Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అలా నేను రాయకుండా ఉండాల్సింది… కథకుడు ఖదీర్‌బాబు ఒప్పుకోలు…

May 23, 2023 by M S R

Mohammed Khadeerbabu ………  కేతు విశ్వనాథరెడ్డి గారు – మహమ్మద్‌ ఖదీర్‌బాబు

‘సార్‌.. మీ రెక్కలు కథను రీటెల్లింగ్‌ చేస్తున్నాను. చేయనా?’

‘చేయి నాయనా… నువ్వేం చేసినా బాగుంటుంది’

Ads

‘సార్‌… మీ అమ్మవారి నవ్వు కథను హిందూ ముస్లిం మైత్రి కథానికలు సంకలనంలో వేస్తున్నాను. వేయనా’

‘తప్పకుండా వేయి నాయనా. మా ఖదీరు ఏం చేసినా బాగుంటుంది కదా’

కేతుగారికి ముగ్గురు పిల్లలుగాని ఆయనను తండ్రిగా భావించేవారు, ఆయన తన పిల్లలుగా భావించేవారు చాలామంది ఉన్నారు. సాహిత్యంలో గొప్ప రచన, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారికే ఈ సమూహ సాంగత్యం, అనుబంధం సాధ్యమవుతుంది. గొప్ప రచన చేసి ఏకాకులుగా మిగిలిన వారి కోవలోకి కేతుగారు ఏమాత్రం రారు.

ఫుల్‌ హ్యాండ్స్‌ను మోచేతుల వరకూ మడిచి, టక్‌ చేసి, చేత సిగరెట్‌తో హుషారుగా కనిపించే కేతు గారితో ఎవరు పది నిమిషాలు మాట్లాడినా ప్రేమలో పడిపోతారు. ఆయన గ్రామీణ స్వభావం అలా లాగుతుంది. ఆయనలోని సెన్సాఫ్‌ హ్యూమర్‌ను అనుభవించే భాగ్యం ఆయనతో పరిచయం ఉన్నవారికే దక్కుతుంది.

‘ఆత్మ ముగ్ధత్వం’ అనే మాటను ఆయన ఈసడించుకునేవారు. ‘తమను తాము అతిగా ప్రేమించుకునేవారు నలుగురికీ అట్టే ఉపయోగపడరు’ అని ఆయన భావన.

కథను ఫ్రీ ఫ్లోతో రాసే కథకుల పట్ల నాకు మొగ్గు ఉంది. కేతుగారు ఫ్రీ ఫ్లోతో రాయరు. కాని ఆయన కథాక్షేత్రం, కథాంశం, కథన గుణం అకలుషితమైనవి. సేంద్రీయమైనవి. హేతువు కలిగినవి. ఆయన తాను నమ్ముకున్న నేల గురించి రాసినవి ఒకెత్తు∙స్త్రీల గురించి రాసినవి ఒకెత్తు. ఆయనలోని ఫెనిమిస్టును అంచనా కడుతూ కథలను ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు.

‘రైటర్స్‌ మీట్‌’ తరఫున కేతు గారికి ‘కథా దీపధారి’ పురస్కారం ఇవ్వాలని ఎంతో ప్రయత్నించాము. అప్పటికే ఆయన కడప నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పూర్తిగా బంద్‌ చేసుకుని ఉండటం వల్ల సాధ్యపడలేదు. ‘నూరేళ్ల తెలుగు కథ’ ఫీచర్‌ మొదలెట్టి రోజుకొక కథ రీటెల్లింగ్‌ చేస్తుంటే ఆయన పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. రోజూ కాల్‌ చేసి ప్రోత్సహించేవారు. ‘కథలు ఇలా కూడా రాస్తారు’ క్షుణ్ణంగా చదివి మాట్లాడారాయన. ‘అంతా ఏం జరగనట్టే’ ఉండేవారు. ‘అంతా ఏం జరగనట్టు ఉన్నారే’ అని నాక్కొంచెం సిగ్గేసేది.

కేతు విశ్వనాథరెడ్డి గారు రాసిన ‘అమ్మవారి నవ్వు’ కథను దూకుడు కొద్దీ ‘మక్కా చంద్రుడు’ పేరుతో తిరగేసి రాశాను. పెద్ద గగ్గోలు అయ్యింది. అలా తెలుగులో ఇంతకు ముందు జరగలేదు. పైగా అంత పెద్ద కథకుణ్ణి ఒక పసిగుడ్డు ఆ విధంగా ఆక్షేపించడం. అలా నేను రాయకుండా ఉండాల్సింది. 2002లో దేశంలో జరిగిన పరిణామాలు ఆ వెంటనే 2003లో వచ్చిన ఆ కథ పట్ల నన్ను ‘అతి’ నిశితంగా చూసి రియాక్ట్‌ అయ్యేలా చేశాయి.

‘మక్కా చంద్రుడు’ రాయడం వల్ల కేతుగారి అభిమానులు, ఆత్మీయులు బాగా నొచ్చుకున్నారు. అందుకే కొత్త కథకులకు సూచన. మీరు ఎవరినైనా ఎంతటి వారినైనా విమర్శించవచ్చు. సమర్థంగా, సాహితీ ప్రమాణాలతో చేయాలి. జారుడు మాటలు మాట్లాడితే అవి వారి దాకా చేరినా, వారు పట్టించుకోకపోయినా, ఏదో విధాన రియాక్షన్స్‌ వస్తాయి.

పెద్దవారు ఉంటే ప్రతి సమూహానికి ఒక ధైర్యం ఉంటుంది. తెలుగు కథకు పెద్దదిక్కుగా ఉన్న కేతుగారి నిష్క్రమణతో తెలుగు కథకుల సమూహం నేడు ఆ ధైర్యం కోల్పోయింది. ‘ఆయనకు చెప్దాంలే… ఆయన ఉన్నాడులే’ అనిపించే ఒక మనిషి లేకపోవడం చాలా లోటు. చాలా వెలితి. కేతుగారికి సగౌరవ నమస్సులు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions