రెండు కొప్పులు ఎప్పుడూ కలవవు… అలాంటిది ఏకంగా ఆంధ్రా ముఖ్యమంత్రి బీట్ చూసే టీవీ కొలువు వాళ్లిద్దరిదీ… పైగా ఒకరు ఎన్టీవీ, మరొకరు టీవీ9… ఆ చానెళ్ల మధ్య కూడా ఉప్పునిప్పూ వైరముంది… ఇంకేం… ఒకరిని మించి మరొకరు ఆ బీట్‌లో ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించి ఉంటారేమో, పెద్ద అసహజమేమీ కాదు… ఇలాంటి ధోరణులు చానెళ్ల నడుమ, చానెళ్లలోనే అంతర్గతంగా కనిపిస్తూనే ఉంటాయి… కాకపోతే ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు స్మార్ట్ ఫోన్లలో తమ తగాదాలను రికార్డ్ చేసి మరీ సర్క్యులేట్ చేసుకోవడమే విశేషం…
నిన్నటి నుంచీ ఆ ఆడియోలు, వీడియోలు తెగ వైరల్ అయిపోయాయి సోషల్ మీడియాలో… నిజానికి ఇద్దరూ ప్రతిభావంతులైన జర్నలిస్టులే… దేశంలోని ఏ మూలకైనా వెళ్లి, ధైర్యంగా రిపోర్టింగ్ చేయదగిన సమర్థులే… కానీ ఇదుగో ఈ పంచాయితీలతో బజారుకెక్కి పరువు తీసుకుంటున్నారు… సారీ, సారీ…. వాళ్ల పరువేమీ పోలేదు… వినిపిస్తున్న ప్రచారాలను బట్టి విశ్లేషించుకుంటే… సీఎం జగన్ చుట్టూ ఉండే కొందరు ముఖ్యులు జగన్ పరువు తీస్తున్నారు…
ఎస్, చాలా ప్రచారాలున్నయ్… తాము కోరింది సాగుతుండటంతో ఏకంగా తమకు ఎమ్మెల్సీ పోస్టులు కావాలని జగన్‌నే నేరుగా అడిగారనీ… ఆయన ఓ క్షణం షాక్‌కు గురై, చేతులు జేబుల్లో పెట్టుకుని, త్రివిక్రమ్ భాషలో తను ఎటు వెళ్తున్నాడో తెలియక అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడనీ అంటారు… వైసీపీ అనుకూల కీలక జర్నలిస్టులకు విల్లాలట… విశాఖలో ఓ పబ్బు ఏర్పాటట… సదరు జర్నలిస్టులకు కార్లట… సీఎంవోలో ఓ పెద్దమనిషి వీళ్లు చెప్పిన ప్రతి పనినీ సానుకూలం చేసి పెడతాడట… ఫాఫం, వాళ్లకూ మీడియా సహకారం కావాలి కదా… అసలే వాళ్ల ప్రత్యర్థి టీడీపీ క్యాంపు మీడియా మేనేజ్‌మెంట్‌లో కాకలు తీరిందాయె… సరే, అవన్నీ రకరకాల ప్రచారాలు వస్తూనే ఉంటాయి, నిజానిజాల గురించిన చర్చ అనవసరం… ఎందుకంటే..?
Ads
జర్నలిస్టులే కాదు, ఉన్నతాధికారులు, కంట్రాక్టర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు గట్రా అధికార కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడం, పనులు చేయించుకోవడం గట్రా అత్యంత సాధారణం… నిజానికి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోల్లో ఆ మహిళా జర్నలిస్టులు కొట్టుకున్నది ఏముంది..? తిట్టుకున్నది కూడా ఏమీలేదు… ఏదో ఆవేశంలో, కోపంలో ఒకరినొకరు కాస్త పరుషంగా నిందించుకున్నారు, అంతే కదా… మగ జర్నలిస్టుల వీడియోలు బయటికి రాలేదు గానీ… వాళ్లేం తక్కువా..?
ఈ మొత్తం వ్యవహారంలో ఇజ్జత్ పోయింది సీఎం కార్యాలయానిదే తప్ప ఆ జర్నలిస్టులదేం పోయింది..? అవకాశముంటే, అవసరమైతే కలిసిపోయి పనిచేసుకుంటారు రేప్పొద్దున… ఈ కోపాలు తాత్కాలికాలు… కానీ సీఎం చుట్టూ ఉండే ముఖ్యులు మరీ అంత అలుసు ఎందుకిచ్చినట్టు..? ఆయా చానెళ్లలోని పెద్దలకు తెలియవా ఇవన్నీ…!! తెలుగు జర్నలిజంలో పెద్ద తలకాయలేమైనా శుద్ధపూసలా..?!
Share this Article