ఫైనాన్సియల్ హెల్త్ – నా వ్యక్తిగత అనుభవం/అభిప్రాయం
“ఆలోచించు, శ్రమించు, కొత్త దారి అన్వేషించు.. అప్పుడే జీవితంలో వృద్ధిలోకి వస్తావు” అంటాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. “నీవు దేని గురించి అయినా ఆలోచించాల్సి వస్తే అది డబ్బు గురించే అయి ఉండాలి, డబ్బు సంపాదన గురించే అయి ఉండాలి” అంటాడు ప్రపంచంలోని అతి పెద్ద రీటైల్ సంస్థ అయిన వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శ్యాం రాబ్సన్ వాల్టన్ గారు.
నేను అయితే, నీవు దేని గురించి అయినా అలోచించాల్సి వస్తే ఖచ్చితంగా అది ఈ మూడింటిలో ఒకటి అయి ఉండాలి అంటాను.
* ఆరోగ్యం (Health)
* సంపద (Wealth)
* సంతోషం (Happiness)
Ads
2014 లో నేను అమెరికా నుంచి తిరిగి వెళ్ళి ఇండియాలో ఒక కంపనీలో జాయిన్ అయిన మొదటి రోజు మధ్యాహ్నం ఆకలిగా ఉంది కేఫిటేరియా ఎక్కడ ఉంది చెప్తావా అని ఆఫీస్ లో ఒకతన్ని అడిగాను. నేను అడిగిన విధానం చూసి ఎందుకో అతనికి చాలా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉన్నా నాతో పాటే వచ్చి అతనే లంచ్ కి 50 రూపాయలు పే చేసి, అతనికి లంచ్ బాక్స్ ఉన్నా నాతోనే తిన్నాడు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు. అతని పేరు వెంకట రెడ్డి. ఉప్పల్ లో ఉంటాడు. ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి రోజూ ఒక డొక్కు బైక్ మీద వస్తాడు. అయితే అతనికి ముగ్గురు ఆడ పిల్లలు. భార్య గృహిణి, మిషన్ కుడుతుంది, ఇంకా చిట్టీ పాటలు పాడి డబ్బుని పొదుపు చేస్తుంది. అతను 15 సంవత్సరాల నుంచి సాఫ్ట్ వేర్ చేస్తూ ప్రతి రోజూ ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి ఎండలో, చలిలో, వర్షంలో ఎలా వచ్చాడో తలచుకుంటేనే నాకు భయం వేస్తుంది, కారణం మా తమ్ముడు కూడా ఉప్పల్ లోనే ఉంటాడు. నేను ఎప్పుడైనా కొండాపూర్ నుంచి ఉప్పల్ కి వెళ్ళాలి అంటే ఒక పెద్ద పనిలాగా ఉండేది.
అయితే వెంకట్ రెడ్డికి జీతం ఎక్కువ ఉన్నా ఆడంబరాలకి పోకుండా వచ్చే డబ్బుని పొదుపుగా ఖర్చు చేస్తూ, ఒక్కో ఆడ పిల్ల మీద కోటి రూపాయలు మూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాడు. సంవత్సరానికి 24% వచ్చినా ఒకో అమ్మాయికి చదువుకుంటూనే నెలకి 2 లక్షలు అదనంగా వస్తుంది. ఇంకా ఉప్పల్ లో మూడు ఇండ్ల స్థలాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఒకో అమ్మాయి పేరు మీద 10 కోట్లు, ఇతని పేరు మీద ఒక 20 కోట్లు అయ్యింది మూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇంకా అతనికి ఉన్న ఇండ్ల స్థలాల విలువ కలిపి…
ఈ మధ్యే హైటెక్ సిటీ మైహోంలో 3 కోట్లు పెట్టి అత్యంత విశాలమైన ఫ్లాట్ తీసుకున్నాడు. కార్ కూడా పోయిన నెలలోనే తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య ప్రపంచ పటం ముందు పెట్టి ఏ ప్లేస్ కి తీసుకుళ్ళమన్నా 24 గంటల్లో తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మ నాన్నలు లేకపోయినా కష్టపడి చదువుకొని, తెలివి తేటలు, మంచి చదువు లేక జాబ్ రాకపోయినా 3 సంవత్సరాలు ఓపికతో కోర్సులు నేర్చుకొని, ఉద్యోగం సంపాదించి వచ్చే ప్రతి పైసా పొదుపు చేసి, ఇన్వెస్ట్ మెంట్ చేసి కేవలం అతని పర్సనల్ ఫైనాన్స్ వల్లే ఈ రోజు తను ఏమి చేయాలనుకున్నా చేసే స్థాయికి ఎదిగాడు. ఇది సక్సెస్ స్టోరీ.
అదే సమయంలో 2016 ఆ ప్రాంతంలో ఒక అబ్బాయి మా కంపనీలో ఉద్యోగానికి వచ్చాడు. అతని పేరు దినేష్ రెడ్డి. నేను, ఇంకో అతను ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్యలోనే ఫేక్ అని తెలిసింది, ఆ పిలగాడు 3 సంవత్సరాలు ఫేక్ అనుభవం పెట్టుకొని వచ్చాడు. నా పక్కన ఉన్న సీనియర్ మేనేజర్ పోలీస్ లకి కాల్ చేస్తా అని మొబైల్ తీసుకోగానే ఆ పిలగాడు ఏడ్వటం స్టార్ట్ చేశాడు. సరదాగా అన్నాడు, ఏమీ కాదులే, మంచిగా ప్రిపేర్ అవ్వు అని పంపించా. తర్వాత నా నంబర్ తెలుసుకొని కాల్ చేసి అతని కుటుంబ పరిస్థితి, అతని లక్ష్యాలు చెప్పే సరికి నాకు తెలిసిన కంపనీ లో ఉద్యోగం ఇప్పించా.
ఆ పిలగాడి వయస్సు 24 సంవత్సరాలు. నెలకి లక్ష జీతం. ఉండేది కూడా మాధాపూర్ లోని వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో. అయితే ఆ పిలగాడు వెంటనే లోన్ తీసుకొని మహేంద్ర కార్ కొన్నాడు, కార్ తగ్గట్లు ఖరీదు అయిన బట్టలు, ఆ తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి హాస్టల్ కి మారాడు. ఒకరోజు వాళ్ళ మేనేజర్ కాల్ చేసి వాడు సరిగ్గా పని చేయటం లేదు అన్నాడు. వీడికి కాల్ చేసి అడిగితే, అదేం లేదు సార్, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని మా మేనేజర్ కి కుళ్ళు అన్నాడు. పోనీలే పిలగాడు చూసీచూడనట్లు ఉండమని వాళ్ళ మేనేజర్ కి చెప్పా.
ఇంకో సంవత్సరం తర్వాత వాళ్ళ మేనేజర్ కాల్ చేసి వాడ్ని ఇమ్మీడియట్ గా తీసివేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. అదే రోజు ఇనార్బిట్ మాల్ లో ఆ పిలగాడ్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో చూశా. నన్ను చూసి, జగన్ బాగున్నావా అన్నాడు. మొదట్లో సార్ అనేవాడు. ఆ తర్వాత జగన్ అన్న, ఇప్పుడు జగన్ కి వచ్చింది.
నేను ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళ మేనేజర్ (అతను నా ఫ్రెండ్) కి కాల్ చేసి ఒక 6 నెలలు అవకాశం ఇవ్వు. అప్పటికీ ఇంప్రూవ్ అవ్వకపోతే తీసివేయండి, అతను మంచి పిలగాడు అని చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి తీసి వేయకుండా ఇంకో 6 నెలలు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అయినా ఇంప్రూవ్ అవ్వకుండా ఉంటే వాడ్ని ఉద్యోగం నుంచి తీసివేశారు. ఇంకో 3 నెలలకి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత లోన్ కట్టలేక కార్ పోయింది. డిప్రెషన్ కి గురి అయ్యి ఆత్మహత్యయత్నం చేసుకొని హాస్పిటల్ లో ఉంటే వెళ్ళి, హాస్పిటల్ లోనే కుక్కని కొట్టినట్లు కొట్టి, బిల్ కట్టి ఒక 10 వేలు ఇచ్చి, పర్సనల్ ఫైనాన్స్ గురించి క్రిస్టల్ క్లియర్ గా చెప్పాను. పూణే వెళ్ళి ఉద్యోగం తెచ్చుకొని చిన్నచిన్నగా మళ్ళీ గాఢిన పడి, అమెరికా H1B వీసా తెచ్చుకొని అమెరికా వెళ్ళాడు. వచ్చింది వచ్చినట్లే ఇన్వెస్ట్ చేసి అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈ మధ్యే ఇళ్ళు కొనుక్కున్నాడు, కార్ అయితే కొనలేదు ఆవసరం లేదు అని.
నిజానికి మనకి వచ్చే ప్రతి రూపాయి, మనం పెట్టే ప్రతి రూపాయి మీద మనకి పట్టు ఉండాలి. ఒకరికి చూపించుకోవటం ఖర్చులు పెట్టకూడదు. ఉద్యోగం రాగానే వచ్చే ప్రతి రూపాయిని ఇన్వెస్ట్ చేసి, దాన్ని ఇంకా ఎలా పెంచాలి అని ఆలోచించాలి కానీ అది చాలక లోన్ తీసుకొని బైకులు, కార్లు కొనకూడదు.
మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మ్యాటర్ కాదు; అది నెలకి 10 వేలు అయినా, 10 లక్షలు అయినా. ఎంత శాతం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఎలా ఉంది అనేది ముఖ్యం. మరీ ముఖ్యంగా ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది చాలా ముఖ్యం, ఇంకా పటిష్టమైన ఆర్ధిక ప్రణాళిక ఉండాలి. పిజికల్ హెల్త్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఫైనాన్సియల్ హెల్త్ కి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బుది ఏముంది, కొండాపూర్ లో కుక్కని కొడితే వస్తే వస్తుంది అనేది తప్పుడు ఆలోచన. కుక్క అయినా బిస్కెట్ వేస్తేనే మన దగ్గరికి వస్తుంది, అవి కొనటానికి అయినా డబ్బులు ఉండాలి కదా.
ఏది ఏమైనా, మనం దేని గురించి అయినా అలోచించాల్సి వస్తే ఖచ్చితంగా అది ఈ మూడింటిలో ఒకటి అయి ఉండాలి.
* ఆరోగ్యం (Health)
* సంపద (Wealth)
* సంతోషం (Happiness)- పూర్తి వ్యక్తిగత అభిప్రాయం ……….. (జగన్నాథ్ గౌడ్, కెనడా)
Share this Article