విష్ణు విశాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏముంది..? నిజానికి ఏమీ లేదు… తను పూర్తిగా తమిళనటుడు… ఆమధ్య రానాతో కలిసి అరణ్యలో కనిపించాడు… చాలామంది తమిళ హీరోల్ని తెలుగు ప్రేక్షకులు తమ సొంత హీరోల్లాగే అభిమానిస్తారు, ఆదరిస్తారు… కానీ ఈ విష్ణు పెద్దగా తెలుగు ప్రేక్షకులతో కనెక్టయిన హీరో ఏమీ కాదు… అంతెందుకు, తమిళంలోనే 2009 నుంచీ కష్టపడుతుంటే ఇప్పటికి స్కోర్ 16 మాత్రమే… అందులో నాలుగు తను సొంతంగా డబ్బులు పెట్టి తీసుకున్న సినిమాలే…
రాక్షసన్ అనే సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చింది… కానీ తెలుగువారు విష్ణు విశాల్ పేరు వినగానే కనెక్టయ్యే ఓ ఫిల్మేతర విషయం ఉంది… తను ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు… (అంతకుముందు యాక్టర్, డైరెక్టర్ నటరాజ్ బిడ్డ రజినితో ఎనిమిదేళ్ల కాపురం తరువాత 2018లో విడాకులు తీసుకున్నాడు)… అలా మన తెలుగు మీడియాలో కూడా కనిపించాడు పలుసార్లు… విష్ణు మొదట ఓ క్రికెటర్, తండ్రి ఓ పోలీస్ అధికారి… సినిమాల్లోకి వచ్చాక ఇప్పటికీ సినిమాల సంఖ్య, హిట్ల సంఖ్యలో మరీ దూకుడు ఏమీ కనిపించలేదు…
ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశాడు… తెలుగు అంటే స్ట్రెయిట్ ఏమీ కాదు, డబ్బింగ్ బాపతే… ఒరిజినల్ తమిళమే… అయితే థియేటర్లలో రిలీజ్ చేయడం విశేషంగా అనిపించింది… ఎందుకంటే, ఇతర తమిళ హీరోల్లా తెలుగు ప్రేక్షకుల్ని థియేటర్ల దాకా, అదీ ఈ ఓటీటీ కాలంలో రప్పించుకుంటామనే విశ్వాసమే ఆ విశేషం… ఏమో, ఇప్పుడంతా ట్రెండ్ ఇతర భాషల్లో కూడా సేమ్ టైమ్ రిలీజ్ చేయడమే కదా… ఏవో ఓటీటీ, టీవీ డబ్బులైనా వస్తాయి కదా…
Ads
ఉగ్రవాదం, పేలుళ్లు, కుట్రలు, దర్యాప్తు సంస్థల కౌంటర్ ఇంటలిజెన్స్… ఈ అంశాల మీద బోలెడు సినిమాలు వచ్చినయ్… ఇదీ ఆ బాపతు కథే… కాకపోతే కథనాన్ని వేగంగా నడిపిస్తూ బోర్ రాకుండా తీసుకెళ్తాడు దర్శకుడు మను ఆనంద్… కానీ ఈ సినిమాకు తెలుగులో మైనస్ ఏమిటంటే..? తను థియేటర్లకు తెలుగు జనాన్ని రప్పించగల పాపులర్ హీరో కాదు… నటీనటులందరూ తమిళమే, తెలుగువాళ్లకు కొత్త కొత్త మొహాలే… పోనీ, స్టన్నింగ్ కథాకథనాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే, అవీ అంతంతమాత్రమే… వినోదం లేదు, సీరియస్ నోట్‌లో సాగుతుంది సినిమా… డబ్బింగ్ సినిమాలో పాటల గురించి తెలిసిందే కదా…
కాకపోతే విష్ణు విశాల్ మాత్రం బాగా నటించాడు… రెండు భిన్న పార్శ్వాలను సరిగ్గా పోషించాడు… కానీ స్పీడ్ కథనం, హీరో యాక్షన్ మాత్రమే సినిమాను గట్టెక్కించలేదు కదా… అబ్బే, ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనుకుంటాడు ఇప్పటి సగటు ప్రేక్షకుడు… మలేషియా, ఖతార్, కువైట్‌లలో ఈ సినిమాను నిషేధించినట్టు ఎక్కడో చదివినట్టు గుర్తు…
హైదరాబాద్ మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా సినిమా మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు… తెలుగు సినిమా పోస్టర్ లో హీరో మొఖంపై ముద్రించిన అరబిక్ పదాల (షహదాల)ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు… ఆ మూడు దేశాల్లో నిషేధానికి కారణాలు పూర్తిగా తెలియదు కానీ ఇలాంటి కథాంశాలతో సినిమాలు గతంలో వచ్చినవే… అంత వివాదాస్పద అంశాలు కూడా ఏమీ ఉన్నట్టు లేవు..!!
Share this Article