గుర్తుందా..? సరిగ్గా 40 ఏళ్ల క్రితం… భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యన్ వ్యోమనౌక సూయజ్‌లో అంతరిక్షానికి ఎగిసిన రోజు… ఏ ప్రధాని అయినా ఇలాంటివి ఓన్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు కదా… చంద్రయాన్ విషయంలో మోడీలాగా..! అప్పటి ప్రధాని ఇందిర కూడా అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మతో మాట్లాడటాన్ని కోట్లాది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించింది…
అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అనే ఇందిర ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా’ అని స్పందించాడు రాకేశ్ శర్మ… సగటు భారతీయుడి గుండె ఆనందంతో ఎగిసిపడింది… అది రష్యన్ వ్యోమనౌక… అంతరిక్షంలో వెళ్లి, క్షేమంగా తిరిగివచ్చే ఖగోళ సాంకేతిక జ్ఙానం ఈరోజుకూ మనకు లేదు… ఇస్రో ఎన్ని ఘనవిజయాల్ని సాధిస్తున్నా సరే, రిటర్న్ ఫ్లయిట్స్ మనకు ఇంకా దూరమే… అది సాకారం చేసుకునే ప్రయత్నమే గగనయాన్…
అదే రాకేశ్ శర్మ వయస్సు 75 ఏళ్లు ఇప్పుడు… ‘ఇందిర అడిగితే ఈ జవాబు చెప్పాలని ముందే ఆలోచించి పెట్టుకున్నారా’ అనడిగింది ఎన్డీటీవీ… ‘నో, నో, చిన్నప్పటి నుంచీ ఆ పాట పాడేవాడిని, ప్రధాని అడగ్గానే అదే నా నోటి వెంట సహజంగానే వచ్చింది’ అని గుర్తుచేసుకున్నాడు ఆయన… మరో ప్రశ్నకు బదులిస్తూ… ‘వై నాట్, ఇప్పడూ మరో ప్రయాణానికి నేను రెడీ, కానీ ఈసారి జస్ట్, టూరిస్టుగా వెళ్తాను గగనయాన్‌లో అవకాశం ఉంటే’ అన్నాడు నవ్వుతూ…
Ads
‘అప్పటికి నాకు 21 ఏళ్లు… స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ వార్తలు చదువుతూ ఇన్‌స్పయిర్ అయ్యేవాళ్లం, మనిషి అన్వేషించాల్సింది, సాధించాల్సింది ఎంతో ఉంది కదానిపించేది…’ అని గుర్తుచేసుకున్నాడు ఇస్రో చైర్మన్ సోమనాథ్… ‘ఆనాడు రాకేశ్ వేసిన అడుగు మన ఇంత దూరం ఖగోళ ప్రయాణానికి తొలి అడుగు..’ అన్నాడు…
రాకేశ్ మన తొలి గగనయాత్రి (వ్యోమగామి)… అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌లో తను 7 రోజుల 21 గంటలు గడిపాడు… ఇప్పుడు, ఇన్నేళ్ల తరువాత మనం సొంతంగా, మన పరిజ్ఞానంతో నలుగురు గగనయాత్రికుల్ని పంపించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాం… పరీక్షల్లో రిటర్న్ ఫ్లయిట్స్ విజయవంతం అయ్యాయి… ఆస్ట్రోనాట్స్ శిక్షణలో ఉన్నారు కూడా… ఆ నలుగురికి పలు విషయాల్లో శిక్షణకు రాకేశ్ శర్మ కూడా ప్రస్తుతం సహకరిస్తున్నాడు…
అప్పట్లో అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు తను యోగాలో శిక్షణ తీసుకున్నాడు… తద్వారా ప్రపంచ తొలి అంతరిక్ష యోగి అయ్యాడు… ‘అదేమంతా పని అనుకుంటారేమో, భార రహిత స్థితిలో యోగ చేయడం చాలా కష్టం…’ అన్నాడు తను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో… అంతరిక్షంలోకి మన సొంత ఫ్లయిట్లు వెళ్లి వచ్చే ఆ తరుణం కోసం నేనూ ఎదురుచూస్తున్నాను అంటున్నాడు…
ఇవన్నీ సరే… రాకేశ్ శర్మతోపాటు అంతరిక్ష ప్రయాణానికి ఎంపికైన రవీష్ మల్హోత్రా మాటేమిటి…? రాకేశ్ శర్మ ఇండియన్ స్పేస్ హిస్టరీలో నిలిచిపోగా, తనతోపాటు ఎంపికైన రవీష్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాడు… నిజానికి తన గురించి కూడా దేశం నాలుగు మంచి మాటలు గుర్తుంచుకోవాలి… ఒకరిని ఎంపిక చేస్తే, మరొకరు స్టాండ్ బై… ఎవరో ఒకరికి నిరాశ తప్పదు, జరిగింది యాక్సెప్ట్ చేయాలి, మిషన్ ముఖ్యం కదా అన్నాడు పరిపక్వతతో అప్పట్లోనే…
ఇప్పుడాయన వయస్సు 81 ఏళ్లు… లాహోర్ స్వస్థలం, విభజన తరువాత వచ్చేసి కలకత్తాలో స్థిరపడిన కుటుంబం… నిజానికి తను నేవీలో చేరాలనుకున్నాడు మొదట్లో… కానీ తన కంటి దృష్టి బాగుండటంతో ఎయిర్ ఫోర్స్‌లో చేరమన్నారు… అప్పుడు ఫైటర్ పైలట్లకు కొరత ఉండేది… 1971 యుద్ధంలో అనితరసాధ్యమైన సర్వీస్ ఇచ్చాడు తను… 1985లో కీర్తిచక్ర ఇచ్చింది ప్రభుత్వం… రిటైరయ్యాక సొంతంగా బెంగుళూరులో The Dynamatic Technologies ఏరో స్పేస్ కంపెనీ పెట్టుకున్నాడు… మరి ఇప్పుడు గగనయాన్‌కు ఎంపికైన నలుగురు ఎవరంటారా..? అది మరోసారి..!!
Share this Article