ఈనాడు సైటులో జబర్దస్త్ లేడీస్ అని ఓ మంచి హెడింగుతో ఓ వార్త కనిపించింది… సాధారణంగా ఈటీవీలో వచ్చే పలు షోల ప్రమోషన్ కోసం అలా యాడ్స్ కమ్ న్యూస్ టైపు బిట్స్ అప్పుడప్పుడూ కనిపించడం పరిపాటే… కానీ ఈసారి ఈ వార్త కాస్త ఆసక్తికరంగా… బాగుంది… క్యాష్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రమోషన్ వార్త అది… ఎందుకు బాగుందంటే..?
నిజానికి యాంకర్ సుమ ఎన్నో ఏళ్లుగా యాంకరింగు చేస్తోంది గానీ… తన ప్రోగ్రాములన్నీ ఎలా ఉంటయ్… కాస్త వినోదం, కాస్త అల్లరి, కాసిన్ని పంచులు, ఏవో చిన్న చిన్న కిట్టీ పార్టీ ఆటలు… సీరియస్ నేచర్ అసలు ఉండదు… అంతెందుకు..? సుమ ప్రోగ్రాముల్లో లైఫ్ ఉండదు… మొదటిసారి సుమ ప్రోగ్రాంలో లైఫ్ కనిపించనుంది… కన్నీళ్లు, కష్టాలు, కడుపు లోపల నుంచి తన్నుకొచ్చిన బాధ కనిపించనున్నయ్… అవును, ఆ ప్రోమో చూస్తే కాస్త బరువుగానే ఉంది… నిజం, సుమ తన ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారిగా తన షోలో మాటపలుకూ లేకుండా కంటెస్టెంట్ల కథలు వింటూ అలా నిలబడిపోయింది…
Ads
ఎవరు ఆ కంటెస్టెంట్లు అంటే..? ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనబడే కామెడీ షో ఉంది కదా… అందులో ఆడ వేషాలు వేసే మగాళ్లు… అచ్చం ఆడవాళ్లలా కనిపించే మగ జెంట్స్… వాళ్లు లేకపోతే ఆ కామెడీ స్కిట్లు లేవు… రక్తికట్టవు… కొత్త కొత్తగా నిజమైన ఆడవాళ్లను తీసుకొస్తున్నా సరే ఎవరూ నిలదొక్కుకోవడం లేదు… మాకన్నా ఈ మగ లేడీసే నయం అనుకుని వెనుతిరుగుతున్నారు… అయితే..?
సమాజం వాళ్లను కళాకారులుగా చూస్తోందా..? లేదు… అవమానాలు… వెక్కిరింపులు… ఈ షోలో బరస్టయ్యారు వాళ్లంతా… శాంతి, పావని, మోహన, వినోదిని, తన్మయి, హరిత, సాయి ఎట్సెట్రా… వాళ్ల మాటల్లో చెప్పరానంత, చెప్పుకోలేనంత దుఃఖముంది… బయటివాళ్లకు దాని లోతు, తీవ్రత, గాఢత తెలియదు… అనుభవించేవాడికి తెలుస్తుంది…
అందరూ అదోలా చూస్తారు… ఆ బాపతే అనుకుంటారు, పాయింట్ ఫైవ్ అంటారు… థర్డ్ జెండర్‌గా చూస్తారు.., ఈసడించుకుంటారు… ఇంకా చాలా చాలా సంగతులు వీళ్లు బయటికి చెప్పుకోలేరు… నిజానికి వీళ్లంతా రియల్ జెంట్సే… కడుపు కోసం లేడీ గెటప్పులు వేస్తామే తప్ప జనం మమ్మల్ని వేరే తేడా అనుకుంటారు అనేది వీళ్ల ఆవేదన… మమ్మల్ని అర్థం చేసుకునే ఆడవాళ్లుంటే హాయిగా అందరిలాగే పెళ్లిచేసుకుంటాం, కానీ..? ఈ కానీ అనే పదం దగ్గరే ఉంది బాధల సుడి…
మానవీయ కోణంలో… వాళ్ల అసలు రూపాల్ని చూపించి, వాళ్ల ఆవేదనను చూపించడం అనేది కరెక్టే… కానీ ఆ షో కోణంలో ఆలోచిస్తే ఇలా అసలు రూపాల్ని చూపించడం సరికదా… ఆ కామెడీ షో చూస్తుంటే, ఈ గెటప్స్ మళ్లీ ప్రేక్షకుడికి కనిపిస్తే… స్కిట్స్ సాగుతున్నంతసేపు మళ్లీ వాళ్ల అసలు రూపాల్ని గుర్తు తెచ్చుకునే ప్రమాదం ఉంది… పోనీలెండి… పెద్ద పెద్ద స్టార్ హీరోలే బోలెడు సినిమాల్లో ఆడ వేషాలు వేసి నానా కథలూ పడ్డారు… వీళ్లకేం తక్కువ..? నిజానికి వాళ్లకన్నా వీళ్లే ఎక్కువ… కడుపులో దుఃఖం ఉన్నా సరే, మొహం మీద నవ్వు పులుముకుని… అందరినీ నవ్విస్తున్నారు…
ఇందులో నవ్వులపాలయ్యేదేమీ లేదు, లైఫ్ అంటే నవ్వులాట ఏమీ కాదు… నవ్వేవాడి పళ్లే బయటపడతాయి, నవ్విన నాపచేనే పండుతుంది గానీ… సబ్ చోడ్‌దో… కీప్ రాకింగ్ డియర్ సిస్టోబ్రదర్స్… ఆర్… బ్రోసిస్టర్స్…!!
- పైన చిత్రాలు మల్లెమాల క్యాష్ ప్రోగ్రాం ప్రొమో సౌజన్యం…
Share this Article