చెత్తా రాజకీయ నాయకులు… అవినీతి అధికారులు… దోచుకునే పారిశ్రామికవేత్తలు… భ్రష్టుపట్టిన మీడియా… వ్యసనాల్లో మునిగిన యువత… అవలక్షణాల్ని వ్యాప్తిచేసే సినిమాలు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు… తగ్గని పేదరికం, వివక్ష, అణిచివేత, దోపిడీ… సమాజంలో ఎటుచూసినా నెగెటివిటీ కనిపిస్తోంది కదా… ఛిఛీ, లోకం ఇక బాగుపడదు అనే నిరాశ అప్పుడప్పుడూ అలుముకుంటోంది కదా… కానీ అనుకున్నంత వేగంగా కాకపోయినా… వ్యక్తిత్వ భ్రష్టులు ఎంత అడ్డుపడుతున్నా సరే… సమాజం పురోగమిస్తూనే ఉంటుంది…
తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి, ద్రవ్యోల్బణం వంటి సగటు మనిషికి అంతుచిక్కని లెక్కలు, అంకెల్లోనే కాదు… సమాజ పురోగతిని వేర్వేరు ప్రామాణికాల్లో చూడాల్సి ఉంటుంది… అలాంటి అయిదు విశేష పరిణామాల్ని, ట్రెండ్స్‌ను, ఫలితాల్ని, మార్పుల్ని ఓసారి పరిశీలిద్దాం… the first post అనే సైటులో కనిపించింది ఈ క్రోడీకరణ, విశ్లేషణ… (అంతా బాగుందని కాదు, కొన్ని అంశాల్లో ఏం జరుగుతోందని…)
బహుశా పదేళ్ల క్రితం ఇది చెబితే అందరూ పక్కుమని నవ్వేవారేమో… ఏమిటో తెలుసా..? ప్రస్తుతం ఇండియాలో మగవాళ్లకన్నా ఆడవాళ్లు ఎక్కువగా ఉన్నారు… గర్భస్రావాలు, భ్రూణహత్యలు విచ్చలవిడిగా సాగే మన దేశం క్రమేపీ ఆ వికృత ఆలోచన ధోరణుల నుంచి బయటపడుతోంది… మెల్లిగానే కావచ్చుగాక… కానీ స్థిరంగా… అయిదో జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 1000 మంది మగవాళ్లకు ఇప్పుడు 1020 మంది ఆడవాళ్లు ఉన్నారు… 2011లో ఆడవాళ్లు మరీ 943 మాత్రమే… 1991లో 927 ఉండేవాళ్లు… అధికశాతం జంటలు ఒకరూఇద్దరితోనే సంతానవ్యాప్తిని ఆపేస్తున్నందున… ఆడ, మగ ఎవరయితేనేం, మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనే భావన పెరిగింది… మగాడే కావాలి, వారసుడు కావాలి, మగ వంశోద్ధారకుడే కావాలి వంటి పాత, ఛాందసవాదం క్రమేపీ బద్ధలైపోతోంది…
Ads
రెండో ట్రెండ్ ఏమిటో తెలుసా..? నగరాలు, పట్టణాల్లోకన్నా గ్రామాల్లో ఇంటర్‌నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు… పట్టణ ప్రాంతాల్లోకన్నా గ్రామాల్లోనే 20 శాతం మేరకు నెట్ యూజర్స్ ఉన్నారు… ఇది ప్రభుత్వ సర్వే కాదు… నీల్సన్ సంస్థ నిర్వహించి డేటా అండ్ మార్కెట్ మెజర్‌మెంట్‌లో తేలిందే… ఈ భారత్ 2.0 సర్వే ప్రకారం ప్రస్తుతం 64.6 కోట్ల మంది నెట్ యూజర్స్ ఉన్నారు… 2019తో పోలిస్తే గ్రామాల్లో పెరుగుదల శాతం 45 శాతం… అదే పట్టణ ప్రాంతాల్లో పెరుగుదల 28 శాతం మాత్రమే… చాలా అవసరాలకు నెట్ తప్పనిసరి అయిపోయింది… అనివార్యంగా నెట్ వాడక తప్పడం లేదు… అలవాటు పడక తప్పడం లేదు…
మూడో ట్రెండ్… ఇండియాలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోంది… తాజా జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఈ రేటు ప్రస్తుతం 2 మాత్రమే… ఇది 2015-16లో 2.2 శాతం ఉండేది… నిరక్షరాస్యత, అధిక జనాభాతో అనర్థాలపై అవగాహన లేమి కారణంగా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతూ ఉండటం ఆశాజనకమైన పరిణామమే… ముస్లిముల్లో ఇది 2.36 ఉండగా… హిందువుల్లో 1.94, క్రిస్టియన్లలో 1.88 శాతాలు ఉన్నట్టు సర్వే చెబుతోంది…
నాలుగో ట్రెండ్… డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో ఇండియా ప్రతీ దేశాన్నీ దాటేస్తోంది… చైనా, అమెరికాలను కూడా దాటేసి… అసాధారణంగా పెరిగిపోతున్నాయి… వ్యాపారాలకు సంబంధించి రియల్ టైమ్ పేమెంట్స్‌లో ప్రస్తుతం ప్రపంచంలో ఇండియా నంబర్ వన్… దీన్ని ప్రగతి సూచిక అనవచ్చో లేదో, జీవననాణ్యతకు తార్కాణమో కాదో ఒకేసారి చెప్పలేం గానీ… నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయి… ఈ రంగంలో ఉన్న ఏసీఐ మరియు the Centre for Economics and Business Research (CEBR) సర్వే ప్రకారం… 2021లో ఇండియాలో 48.6 బిలియన్ల మేరకు రియల్ టైమ్ పేమెంట్స్ ఉండగా, చైనాలో అది 18.5 మాత్రమే… అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ…
అయిదో ట్రెండ్… ఒక్క సంవత్సరం ఆగండి, మనల్ని ఒకప్పుడు పాలించిన బ్రిటన్‌ను మించిపోబోతున్నాం ఆర్థికస్థితిలో… మన ఎకానమీ కరోనా వల్ల కాస్త వెనక్కి తగ్గినా సరే, స్థూలంగా ఆశావహంగానే ఉంది స్థితి… బ్రిటిష్ కన్సల్టెన్సీ Cybr అంచనా మేరకు మనం ప్రపంచంలో ఆరో స్థానానికి చేరబోతున్నాం… ఈ ఏడాదే ఫ్రాన్స్‌ను, వచ్చే ఏడాది బ్రిటన్‌ను దాటేస్తాం…
నిజానికి ఇప్పుడే అసలైన సవాళ్లు ఉన్నయ్… హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఇంకా పెరగాలంటే (పలు చెత్త సంస్థలు దురుద్దేశాలతో ఇచ్చే ర్యాంకింగులను పట్టించుకునే అవసరం లేదు…) ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది… ప్రోగ్రెస్ వేగంగా లేకపోయినా సరే, ఆగకుండా చూడాల్సి ఉంది… తల్లులు, పిల్లల్లో పౌష్టికాహార లేమి, రక్తహీనత, శిశుమరణాలు, నాసిరకం వైద్య సౌకర్యాలు, అందుబాటులో లేని ఉన్నతవిద్య, సామాజిక భద్రత వంటి చాలా అంశాల్లో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం, లక్ష్య శూన్యత ప్రజల జీవననాణ్యతకు పెద్ద అడ్డంకి..!!
Share this Article