Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

flexi fight… ఇది ఫ్లెక్సీల కోసం, ఫ్లెక్సీల చేత, ఫ్లెక్సీల రాజ్యం…

July 20, 2023 by M S R

I Want Respect:  ప్రజలే ప్రభువులు; ప్రజలే స్వాములు; పాలించేవారు ప్రజలకు సేవకులు; పాలకులు ప్రజలకు కేవలం ప్రతినిధులు- లాంటి ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలు, గుణగణాలు పిండి ఒళ్లు పులకించే, గుండె పొంగిపోయే అభ్యుదయ భావనలు, ఆదర్శాలు ఎన్ని చెప్పినా- అవన్నీ…”your freedom ends where my nose begins” అని ఆ ప్రజాస్వామ్య ప్రతినిధి చెప్పనంతవరకే పని చేస్తాయి. ఒకసారి అతడి/ఆమె నోస్ బిగిన్ అయిన తరువాత ప్రజల ఫ్రీడమ్ కు ఆటోమేటిగ్గా ఎండ్ కార్డ్ పడాల్సిందే. అదే ప్రజాస్వామ్యంలో బ్యూటీ!

సిద్ధాంతపరంగా సూత్రం అర్థం కావాలంటే ఉదాహరణలు తప్పనిసరి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒకానొక ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈరోజుల్లో ఏదయినా జరిగితే అది జరుగుతున్నట్లు ఫ్లెక్సీ పెట్టకపోతే అది జరిగినట్లే కాదు. దాంతో భక్తుడయిన ఒక బి ఆర్ ఎస్ కార్యకర్త అమ్మవారి బోనాల పండుగకు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు. అందులో స్థానిక జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఫోటో చాలా చిన్నదిగా ఉంది. ఇంకెవరో అనామక లేదా సనామక నాయకుడి ఫోటో కాస్త పెద్దదిగా ఉంది. దాంతో ఎమ్మెల్యే మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

Ads

మనోభావాలు దెబ్బ తిన్నప్పుడు…ఎదుటివారికి తన్నులు తినిపించడం, ఎదుటివారికి దెబ్బల రుచి చూపించడం సర్వ సాధారణం. విచలిత మనోభావాలతో సదరు ఎమ్మెల్యే అనుచరులతో వెళ్లి ఫ్లెక్సీ పెట్టిన కార్యకర్త ఇంటిమీద ‘ప్రజాస్వామ్యయుతంగా’ దాడి చేశారు. ఎమ్మెల్యే ‘అప్రజాస్వామికంగా’ తనమీద దాడి చేశారని ఆ కార్యకర్త పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి- ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా…అరిటాకే వెళ్లి ముల్లు మీద పడ్డా...చిరిగేది అరిటాకే లాంటి చక్కటి, చిక్కటి, వెనకటి తెలుగు సామెతలేవో పోలీసుల మనోభావాల్లో సుడులు తిరుగుతూ ఉండవచ్చు!

“First among equals- సమానులలో మొదటివారు అనే అర్థంలో ఎన్నికయినవారు కూడా మనతో సమానులే…కాకపొతే ముందు వరుసలో ఉంటారు” అని అర్థమయినా కానట్లు ఉండే ఆదర్శం కూడా లోకంలో వాడుకలో ఉంది.

కార్యకర్త మీద దాడి కేసులో కార్యకర్త అర్థం చేసుకోలేకపోయిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి.

1. ప్రతినిధి నోస్ ఫ్లెక్సీలో బిగిన్ అయిన చోట…ఇక ఏ నోస్ కు చోటు ఉండదు. ఉండకూడదు.
2. ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా; పార్టీ అధికారిక కార్యక్రమం కాకపోయినా; కార్యకర్తలు చేతి నుండి ఖర్చు పెట్టుకునే కార్యక్రమమే అయినా ప్రోటోకాల్ ప్రోటోకాలే.


3. అమ్మవారి బోనాల్లో ప్రతినిధి పెద్దవారై…అమ్మవారు చిన్నదై…చిన్నబోయినా పరవాలేదు కానీ…ప్రతినిధి మాత్రం ఫ్లెక్సీ పట్టనంత త్రివిక్రముడై భూమ్యాకాశాలు ఆక్రమించి…మూడో పాదం కార్యకర్తల నెత్తిన పెడుతున్నట్లు ప్రతీకాత్మక సైజులోనే ఉండాలి.
4. సర్వ సమానులలో ప్రథములను అథములుగా చిత్రీకరించడం మహాపరాధం. దానికి తగిన ప్రతిఫలంగా ప్రతినిధుల దాడులు, దెబ్బలు, దౌర్జన్యాలు ఉంటాయి.
5. ఇలాంటి దాడులు జరిగిన వేళ- “పేరుకు ప్రజలది రాజ్యం…ఉన్నది మనకు ఓటు…బతుకు తెరువుకే లోటు…గాంధి పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది?” అన్న పాటను రింగ్ టోన్ గా పెట్టుకుని ఎవరికి వారు రింగ్ ఇచ్చుకుని వినడంతో పాటు, ఎదుటివారికి కూడా పదే పదే వినిపించాలి!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions