మీరు బరువు తగ్గాలి లేదా కొంత పెరగాలి… ఏం తినాలి..? ఏం తినకూడదు..? మీకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది… ఏం తినాలి..? ఏం అవాయిడ్ చేయాలి..? ఇవి ఎవరు చెప్పాలి..? డాక్టర్ చెప్పాలి లేదంటే న్యూట్రషనిస్టు చెప్పాలి… అంతే కదా… కాదు, మీరు తప్పులో కాలేశారు… మీరు ముందుగా మీ రాశిని బట్టి ఏమేం తినాలో ఎవరైనా పండితుడిని అడిగి తెలుసుకోవాలి… మీ రాశిని బట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఆయన చెబుతాడు…
వాటిని కఠినంగా ఫాలో కావాలి… అప్పుడే మీకు ఆరోగ్యమస్తు… కాదంటే కైవల్య ప్రాప్తిరస్తు… ఎహె, ఏమిటీ పిచ్చి వ్యాఖ్యలు అనుకుంటున్నారా..? ఏమో, నాకేం తెలుసు… తెలుగు పాత్రికేయానికి కొత్త దశల్ని, దిశల్ని చూపిస్తున్న ఆంధ్రజ్యోతి చెప్పింది… దాని న్యూస్ సైట్ చెప్పింది… ఎవరికి ఏం తోస్తే అది రాసిపడేసి నెట్‌లోకి తోసేయడమే… రాసేవాడికి చదివేవాడు అలుసు… సగటు యూట్యూబ్ వాడో, ఏ నాసిరకం సైటు వాడో ఆంధ్రజ్యోతికన్నా ఏమాత్రం తక్కువ కాదు ఇకపై…
మొన్నామధ్య ఓ విషయం చెప్పకున్నాం కదా… ఇదే ఆంధ్రజ్యోతి శివరాత్రి సందర్భంగా శివుడికి ఏమేం రాశులు ఎందుకిష్టమో వివరంగా రాసుకొచ్చారు… ఆ రాశుల వ్యక్తులపై శివుడికి ప్రేమ ఉంటుందనీ, అన్నీ శుభాలేనని గాలి పోగేసి ఏదేదో రాసింది… అంతేలే… రాశి ఫలాలను, జాతకాలను మీడియా ఒక ఫార్స్‌గా మార్చేసింది… రంగురాళ్లు, జాతకపూజల దందాలకూ మీడియా పోకడలకూ పెద్ద తేడా ఏమీ అనిపించదు…
Ads
ఆంధ్రజ్యోతి సైటులోని తాజా స్టోరీ కూడా అంతే… https://www.andhrajyothy.com/web-stories/lifestyle/the-food-favoured-for-the-arian-is-lettuce-ssd-spl-1026.html పైగా ఇది లైఫ్ స్టయిల్ స్టోరీ అట… సరే, రాసినవాడు ఏదో రాశాడు, అదయినా రాశులను బట్టి మాత్రమే గాకుండా నక్షత్రాలను కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చు కదా, ఇంకా కచ్చితత్వం ఉండేది… లోకం ఉద్దరింపబడేది…
ధనుస్సు రాశి వాళ్లు పచ్చి గుడ్లు మాత్రమే తినాలి… వృశ్చికం వాళ్లు ఎండ్రకాయలు తినాలి… కుంభం వాడు చేపలతో వండిన ఆహారాన్ని కుంభాలకుకుంభాలు లాగించవచ్చునట… అదే రాశివాడు ప్రశాంతతను తినాలట… అది అర్థం కావాలంటే ఏం తిని చావాలో ఏమో…!! ఎంతసేపూ రాజకీయ వార్తలు, డిబేట్ల మీద కాన్సంట్రేషన్ తప్ప, పాఠకజనం అధికంగా చదివే డిజిటల్ న్యూస్ తమ సైట్లలో ఏం వస్తుందో ఏం పాడో కనీసం చూసుకునే సోయి లేదు, దిక్కు లేదు..!!
రాయండర్రా… రాయండి… ఏ రాశి వాళ్లు ఏ తేదీల్లో, ఏ వేళల్లో మాత్రమే సంభోగంలో పాల్గొనాలి… ఏ రాశి వాడు ఏరకం మద్యం తాగాలి… ఎలాంటి బట్టలు వేసుకోవాలి… మీ ఇష్టం… పాఠకుడి ఖర్మ..!! ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిదా.. కీటో డైట్ మంచిదా.. కోడిగుడ్డులోని పచ్చసొన ప్రమాదాలు.. పులిసిన ఫుడ్డులో ప్రొబయోటిక్స్ మంచివా… రోగనిరోధకశక్తిలో మన పోపుల పెట్టె పాత్ర.. వంటి చాలా అంశాలపై బోలెడు అంతర్జాతీయ సంస్థలు, న్యూట్రిషనిస్టులు రకరకాల సర్వేలు, రీసెర్చులు చేస్తుంటారు… వేస్ట్… ఆంధ్రజ్యోతి చదివితే చాలు… ఆల్ క్లియర్..!
Share this Article