ఈ రోజుల్లో కొంత మంది “గొప్పవాడిగా ఎలా మారాలి?”, “విజయం సాధించటం ఎలా?” అని ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ, రియలిస్టిక్ గా చూసుకుంటే, ప్రతి ఒక్కరూ ఇప్పటికే గొప్పవాళ్లే… మనం కొండాపూర్‌లో ఉన్నా, కాకినాడలో ఉన్నా, క్యాలిఫోర్నియాలో ఉన్నా, మనిషి అంటేనే గొప్పవాడు అని అర్ధం.
ప్రత్యేకంగా ఎవరూ మారాల్సిన అవసరం లేదు, గొప్పవాడిగా మారాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే, మనిషి విలువ, గొప్పతనం అనేది అంతర్గతంగా వారి వారి ప్రత్యేకత, ప్రతిభలని బట్టి ఉంటుంది. మన దగ్గర ఉన్న స్కిల్ ని బట్టి, మనకి తెలిసినదాన్ని బట్టి వేరే వాళ్ళని కొలవటాన్ని మించిన దౌర్భాగ్యం, మానసిక రోగం ఇంకోటి ఉండదు.
కొందరు కొండాపూర్ చౌరస్తాలో రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడిపేవాళ్లను ఎందుకు తక్కువ అనుకుంటారు, అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళని ఎందుకు గొప్ప అనుకుంటారు లేదా బంజారా హిల్స్ లో ఉండే రంగులు వేసుకునే నటించే సినెమా వాళ్ళు మాత్రమే గొప్ప అని ఎందుకు అనుకుంటారో నాకు అసలు అర్దం కాదు.
Ads
ఇడ్లీ బండి వాళ్ల దగ్గరున్న జ్ఞానం, తెలివితేటలు మనకి ఉన్నాయా..? వాళ్ల ప్రతిభను సరిగ్గా అంచనా వేస్తున్నామా? వాళ్లకు తెలిసిన విజ్ఞానం, ఆర్థిక నైపుణ్యం చాలా ఉంటుంది. అసలు వాళ్ళ ఇన్వెస్ట్ మెంట్ ఎంత, సంపాదన ఎంత.? ఏ రోజుకి ఎంత పిండి కలపాలి, వారంలో ఏ రోజుల్లో ఎక్కువ గిరాకీ ఉంటుంది, ఏ సీజన్‌లో ఏ కూరగాయలు తక్కువ ఖర్చుతో దొరుకుతాయి, వర్షం వచ్చేటప్పుడు ఎంత పిండి అవసరం అవుతుంది, మొత్తం వ్యాపార ఖర్చు ఎంత అవుతుంది, ఏం మిగులుతుంది— ఇలాంటి అన్ని ఆర్థిక విషయాలు వారికెంతో క్లారిటీగా ఉంటాయి.
కానీ, వారికి మ్యూట్చువల్ ఫండ్‌లో ఫ్లెక్సీ క్యాప్‌కి, మల్టీ క్యాప్‌కి తేడా తెలియాల్సిన అవసరం లేదు. అలాగే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళలో ఎంతమందికి పరాగ్ పారిఖ్, HDFC ఫ్లెక్సీ క్యాప్ కాకుండా వేరే మంచి ఫ్లెక్సీ క్యాప్స్ తెలుసు..? ఇంకో రెండు మంచి ఫ్లెక్సీ క్యాప్ చెప్పమనండి, చాలా మంది చెప్పలేరు.
ప్రతి ఒక్కరూ తమ తమ విషయాలపై ద్రుష్టి పెడతారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని విజయవంతంగా నడపటానికి తెలియాల్సినంతగా ఆల్ రడీ తెలుసు. తాము గొప్ప వాళ్ళం అని చెప్పుకోటానికి, తమకి మాత్రమే ఎక్కువ తెలుసు అని నాసా రాకెట్స్ గురించి, న్యూజిల్యాండ్ ఆర్ధిక వ్యవహారాల గురించి ఇంకేదో చెత్త అంతా వాగుతుంటారు కొందరు. మరి కొందరు అయితే చూసిన ప్రతి చెత్త సినెమా గురించి వాగటం. అభిరుచి, వ్యాపకం అయితే పర్వాలేదు కానీ తాము గొప్ప అని చెప్పుకోటానికి డకోటా వేషాలు..!
యూ ట్యూబ్ లో ఉండే చెత్త అంతా బుర్రలో వేసుకోవటం ఎందుకు..? అసలు, జనాలను పోల్చి “వీడు ఎక్కువ”, “వీడు తక్కువ”, “వీడు గొప్పవాడు” అని నిర్ణయించడానికి మీరు ఎవర్రా? ఆదాయం తక్కువగా ఉన్నవారు సుఖంగా లేరు అని ఎందుకు అనుకుంటారు? నిజానికి, చాలా మంది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ, తమకు ఉన్నదానిలోనే సంతోషంగా, ప్రశాంతంగా, మంచి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు.
సంపద అవసరం, కానీ మనకవసరమైన దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నా నిజమైన సమస్యలు ప్రారంభమవుతాయి. మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అంటే ప్రశాంతత పోతుంది, ఆందోళన ప్రారంభమవుతుంది. అయితే ఖచ్చితంగా డబ్బుకి విలువ ఇవ్వాలి, అలా అని డబ్బుది ఏముంది అనకూడదు అంటారు పెద్దలు.
వ్యక్తిత్వ వికాస నిపుణుల్లో 97% మంది మానసిక రోగులే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. “గొప్పవాడిగా ఎలా అవ్వాలి” అని చెబుతూ, ప్రజలను గందరగోళంలో పడేస్తారు “ఎక్కువమంది”. ఇంకా చాలా మంది యూట్యూబ్ గొట్టం వీరులు అయితే మరీ అతి… వీళ్ళ మాటలతో సమయం వృథా చేస్తారు. వారి సలహాల వెనక ఉన్న అసలు ఉద్దేశం — డబ్బు సంపాదించడం మాత్రమే. ప్రజల ఆశలు, ఆత్మవిశ్వాసం కదిలించి, తప్పుడు ఆశలు కలిగిస్తూ, మార్కెట్లో వాళ్ల ప్రాముఖ్యత పెంచుకోవడమే అసలు కధ.
వాస్తవానికి, వీళ్ళ చెప్పే చాలా విషయాలు ఎందుకూ పనికి రావు మరియూ 96% తప్పుడు విషయాలు, వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదిస్తారు.
ఆటో తోలేవాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు, అదానీ కూడా కష్టపడతాడు, కానీ అదానీది గొప్ప పని అంటారు కొందరు. నిజానికి, ప్రతి ఒక్కరు తమకు వచ్చిన పని, నచ్చిన పని చేస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి బిల్ గేట్స్ వేల మందికి ఉద్యోగాలు సృష్టించాడని చెప్పే వారు ఉంటారు, కానీ వాస్తవానికి అది వ్యాపారం. నష్టాలు వస్తే వెంటనే చాలా మందిని తీసేస్తారు, మరి దాన్నేమందాం..?
సాధారణంగా చూస్తే, అమెరికాలో, కెనడాలో నా లాంటి వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం అయినవారు కూడా నా దృష్టిలో బానిసలాంటివారే. ఎందుకంటే మనస్సులో ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పే స్వేచ్ఛ చాలా మందికి ఉండదు. నిజాయితీగా మాట్లాడితే ఉద్యోగం చేయడం కష్టమవుతుంది. కానీ బతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి, “డబ్బులు వస్తున్నాయి” అని ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తారు, అది నిజంగా ఆ పనిని ప్రేమించి చేస్తున్నట్లు కాదు.
సియాటెల్ లో మైక్రో సాఫ్ట్ కంపనీలో పనిచేసేవాడికి, సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆటో తోలే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ ఉండదు. కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్ల సంగతి అయితే మరీ ఘోరం. “తక్కువ ఆదాయం వస్తే ఇన్వెస్ట్ చేయలేరు” అని నీతులు చెప్పుతారు. ఉన్నదంతా అమ్మేసి స్టాక్ మార్కెట్లో పెట్టమంటారు, అటవీ సిద్ధాంతం.
“ఇండియాలో ఏముంది? ఫారిన్‌లో ఎక్కువ డబ్బులు వస్తాయి, లైఫ్ బాగుంటుంది” అని మాటలు చెబుతారు కొందరు. వాళ్ళ క్లైంట్లు ఎవరంటే, చాలా మంది తెలిసీ తెలియని జ్ఞానంతో ఉన్న వాళ్లు, వాళ్లకే ఈ డబ్బు సంపాదించే సలహాలు ఇస్తుంటారు. నిజంగా చూస్తే, ప్రతి ఒక్కరికీ వారి జీవిత పరిస్థితులు, అవసరాలు వేరు. జీవితంలో “జీవించడాన్ని” మించిన గొప్పది ఏమీ ఉండదు.
ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రతి మనిషి గొప్పవాడే. అసలు మనిషి అంటేనే ఉన్నతమైన వ్యక్తి అని అర్థం. మనిషి శాస్త్రీయ నామం “హోమో సేపియన్స్”, ఇందులో హోమో అంటే “మానవుడు”, సేపియన్స్ అంటే “జ్ఞానవంతుడు, తెలివైన వాడు” అని అర్థం…. (- రోమన్ తత్వవేత్త జగన్నాథ్ గౌడ్ పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article