ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది… సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87 లక్షల మంది పురుషులు… కాగా 30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే 18 కోట్లు ఉండే ఆదాయం సోమవారం 11.74 కోట్లు వచ్చింది…
….. ఇదీ ఒక వార్త… ‘‘ఇది మస్తు పథకం, జనాకర్షకం కాదు, వోట్ల కోసం పథకం కాదు… దీంతో జీడీపీ పెరుగుతుందని’’ అంటాడు ఒకాయన… మరి కర్నాటకలో ఏమైనా పెరిగిందా మాత్రం చెప్పడు… చెప్పలేడు… ఎహె, ఇవన్నీ దండుగమారి పథకాలు అంటాడు మరొకాయన… ఇదొక్కడే దండుగమారి పథకం ఎలాగైంది..? మిగతా జనానికి పంచిపెట్టే పథకాల మాటేమిటి అనడిగితే కిక్కుమనడు… ఎవరికి ఏది తోస్తే అది రాసేయడమే… కూసేయడమే…
ప్రతి ప్రభుత్వ పథకానికీ ప్లస్సులుంటయ్, మైనస్సులుంటయ్… ఉదాహరణకు ఉపాధి హామీ పథకం మీద బోలెడన్ని విమర్శలున్నయ్… కాదు, అది మార్కెట్‌లోకి లిక్విడ్‌ను పంప్ చేయడం, దాంతో మార్కెట్ యాక్టివిటీని పెంచి, జీడీపీ పెరుగుతుందనే వాదనలూ ఉన్నయ్… ఆడవాళ్లకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణం పథకం కూడా అంతే… ప్లస్ ఉంది, మైనస్ ఉంది… అదేమిటి..? జనానికి ఉపయోగకరం అయ్యేపక్షంలో మగాళ్లకూ వర్తించాలి కదా అనడిగేవారూ కోకొల్లలు… కేవలం మహిళలకే దేనికి అనేది వాళ్ల ప్రశ్న…
సరే, అమలు చేసి నాలుగు రోజులు కూడా కాలేదు… అప్పుడే ఇంత నష్టం, అంత నష్టం అనే లెక్కలు వేస్ట్… ఈ లెక్కలకు అంత ఆత్రం దేనికి..? అన్నింటికీ సిద్ధపడే కదా ప్రభుత్వం దాన్ని అమలుచేస్తోంది… సోమవారం 51 లక్షల మంది ప్రయాణిస్తే అందులో 30 లక్షల మంది మహిళలేనట, మస్తు నష్టం వచ్చిందట, ఎవరో రాశారు… అయ్యా, బాబూ… కొన్నాళ్లు ఆగు… మనవాళ్లకు ఓ పైత్యం ఉంది… ఏదైనా కొత్తదనం కనిపిస్తే చాలు అరాచకంగా ఎగబడతారు, ఎంజాయ్ చేస్తారు.,. మొన్న లులు మాల్ అనుభవాలు చూశాం కదా…
Ads
అంతకుముందు ఐకియా, మెట్రో ఎట్సెట్రా… కొన్నాళ్లు కొత్త మురిపెం… తరువాత స్ట్రీమ్ లైన్ అయిపోతుంది… ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణాలు కూడా అంతే… నాలుగు రోజులు హడావుడి, తరువాత నిజంగా అవసరమున్నవాళ్లే ఎక్కుతారు… పేద, దిగువ మధ్యతరగతి వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగకరమే… ఎగువ సెక్షన్లు ఎలాగూ బస్సులు ఎక్కవు… పైగా ఇవి సిటీ, ఆర్డినరీ బస్సులకే పరిమితం… దూరప్రాంతాల ప్రయాణికులు ఎలాగూ డీలక్సో, లగ్జరీయో, ఎక్స్‌ప్రెస్సో ఎక్కాలి… ఛార్జీలు కట్టాలి…
అన్నింటికీ మించి ఎలాగూ ఫ్రీ కదాని ఇళ్లు వదిలేసి ఎటుపడితే అటు తిరగడానికి ఆడవాళ్లు పనిలేకుండా ఏమీ లేరు… బోలెడు బాధ్యతలు… అన్నీ వదిలేసి యాత్రలకు వెళ్లరు… దగ్గర ఉన్న యాత్రాస్థలాలకు వెళ్తారేమో… అది పెద్ద విషయమేమీ కాదు… జస్ట్, కొన్నాళ్లు ఆగండి, ఈ హడావుడి సద్దుమణుగుతుంది… అంతేకాదు, అన్నీ అనుకూలిస్తే మగ విద్యార్థులు అనే మరో ఫ్రీ సెక్షన్‌నూ యాడ్ చేయడానికి స్కోప్ ఉంది… అదీ ఉపయోగకరమే…
Share this Article