అధికారంలో ఉన్నవాడు ప్రశ్నను సహించలేడు… విమర్శను తట్టుకోలేడు… ఆ నోళ్లు మూయించడానికే ప్రయత్నిస్తాడు… దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు… ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ విషయంలో దూకుడు మరీ ఎక్కువ..! కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, వేధింపులు గట్రా..! మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న పత్రికలు, టీవీలే కాదు, ఇండిపెండెంట్ మీడియాగా పేరొందిన వెబ్ జర్నలిజాన్ని కూడా టార్గెట్ చేస్తోంది… అయితే దీనికి మరో పార్శ్వమూ ఉంది… అది కూడా చెప్పుకోవాలి… ఎందుకంటే..? న్యూస్‌క్లిక్ అనే వెబ్సైటు ఆఫీసుపై, కొందరు జర్నలిస్టుల నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది మొన్న… సోదాలు నిర్వహించింది… ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జర్నలిస్టు సర్కిళ్లు మండిపడుతున్న ఇష్యూ…
ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడి అని కొందరు… మీడియాను అణగదొక్కడమే అని మరికొందరు… పాత్రికేయ స్వేచ్ఛకు సంకెళ్లు అని ఇంకొందరు ఖండించేస్తున్నారు… కొన్ని లెఫ్ట్ పార్టీలతోపాటు ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది… వివిధ రంగాలకు చెందిన 90 మంది ప్రముఖులు దీన్ని ఖండిస్తూ ఓ లేఖ విడుదల చేశారని లెఫ్ట్ పత్రికలు వార్తలు రాశాయి… కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ఆసియా చాప్టర్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని విమర్శించాయి… సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించిందనే వార్త కాస్త ఇంట్రస్టింగు… ఆమధ్య ఈ పార్టీకే చెందిన కేరళ ప్రభుత్వం మీడియా మీద కఠిన ఆంక్షల్ని విధిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని ఏమనాలి మరి..? (ప్రస్తుతం అభయెన్స్‌లో ఉంది)… ఈ ఖండిస్టులకు అది కనిపించలేదా..? ఇదే గిల్డ్, ఇదే ప్రెస్ క్లబ్, ఇదే ప్రొటెక్ట్ కమిటీ, ఈ ప్రముఖులు ఒక్కరూ మాట్లాడలేదు… అలాగని న్యూస్ క్లిక్ మీద ఈడీ దాడులు సమర్థనీయం అనడం లేదు… కానీ ఏ మీడియా సంస్థ మీద దాడి జరిగినా సరే ఈ స్పందన ఎందుకు ఉండటం లేదు… ఆమధ్య కర్నాటకలో పవర్ టీవీ అనే ఓ టీవీ చానెల్ మూసేయించింది ప్రభుత్వం… ఈ స్పందన ఏదీ..?
Ads
ఇదే న్యూస్ క్లిక్ యాజమాన్యం కూడా దీన్ని పాత్రికేయ స్వేచ్ఛపై దాడిగా వర్ణించింది… అలా గాకుండా… ‘‘మీరు ఈ సోదాలతో భయపెట్టలేరు, మేం ఏ ఆర్థికనేరాల్లోనూ లేము, వుయ్ ఆర్ ఓపెన్, సహకరిస్తాం, మీ దర్యాప్తు చేసుకొండి, మా చేతులకు ఏ మసి లేదు… మీ బెదిరింపులతో మా జర్నలిస్టిక్ లైన్ కూడా మార్చుకోం’’ అని ప్రకటించి ఉంటే బాగుండేదనిపించింది… యజమానుల ఆర్థిక వ్యవహారాలపై కేసులు మీడియా మీద దాడిగా చిత్రితం కావడం మనకు తెలుసు కదా… మార్గదర్శి మీద కేసులు పెడితే, అప్పట్లో వైఎస్ హయాంలో ఈనాడు, పాత్రికేయ స్వేచ్ఛ మీద దాడి అన్నారు… వైఎస్ ఉద్దేశం అదే కావచ్చు, కానీ మార్గదర్శి యవ్వారాలు కూడా బయటపడ్డాయి కదా… అలాగే జగన్ అక్రమాస్తుల కేసుల సందర్భంలో సాక్షిని మూసేయించే కుట్ర, మీడియాకు సంకెళ్లు అన్నారు… కానీ సాక్షిలోకి పెట్టుబడులు అనేది ఈరోజుకూ విచారణలో ఉన్నదే కదా… సన్ టీవీ స్కాం అందరికీ తెలిసిందే కదా… ఎన్డీటీవీ మీద సీబీఐ కేసులు కూడా ఉన్నాయి కదా… రిపబ్లిక్ టీవీ టీఆర్పీ దందాలు బయటపడ్డాయి కదా… సో, మీడియా వ్యాపారంలో ఉన్నంతమాత్రాన, వాటి ఆర్థిక వ్యవహారాలు అన్ టచబుల్ ఏమీ కాదు… మీడియాలో ఉన్నంతమాత్రాన ఇమ్యూనిటీ ఏమీ ఉండదు… రాజ్యంతో పాత్రికేయ ఘర్షణ అనేది ఎప్పుడూ ఉంటుంది… స్టేట్ స్వభావమే అది… అందుకే ఏ చిన్న సంస్థపై వేధింపులున్నా పాత్రికేయ సంస్థల నుంచి ఇదేతరహా స్పందన కనిపించాలి… అదేసమయంలో మీడియా బాసుల చేతులు క్లీన్‌గా ఉండటమూ అవసరమే…! చివరగా… పైన సబ్జెక్టులో అతకదు కానీ… న్యూస్‌లాండ్రీ అనే వెబ్సైటుపై టైమ్స్ ఆఫ్ ఇండియా వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది… రెండూ మీడియా సంస్థలే… మరి దీన్నేమనాలి చెప్మా..?!
Share this Article