టీవీ షో అంటే మనకు తెలిసింది వెగటు బూతుల జబర్దస్త్‌లు, సర్కస్ ఫీట్ల ఢీ షోలు, వెగటు పంచుల డ్రామా కంపెనీలు, కిట్టీ పార్టీల్లాంటి రియాలిటీ షోలు, సంగీత సరస్వతిని అవమానించే సింగింగ్ కంపిటీషన్లు… కాదంటే డిఫెక్ట్ పీసులను జనం మీదకు రుద్దే బిగ్‌బాస్‌లు… దీనికి పూర్తి కంట్రాస్టు కౌన్ బనేగా కరోడ్‌పతి… 23 ఏళ్లు… మరోసారి చదవండి, 23 ఏళ్లుగా అప్రతిహతంగా నడుస్తోంది ఈ షో… మధ్యమధ్య కొన్ని అవాంతరాలు ఉన్నా సరే…
15వ సీజన్ చివరి ఎపిసోడ్‌లో హోస్ట్ అమితాబ్ అలియాస్ బిగ్‌బి కన్నీటి పర్యంతమయ్యాడు… ఎస్, మరో సీజన్ ఉంటుందా..? ఉంటుందేమో… మళ్లీ అమితాబే హోస్ట్‌గా వస్తాడా…? ఇప్పటికే తనకు 81 ఏళ్లు… ఎన్నో అనారోగ్యాలు, ప్రాణాపాయాలు దాటి, కోట్ల భారతీయుల ప్రార్థనలు, ఆశీస్సులతో ఈరోజుకూ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో… తను మళ్లీ హోస్టుగా వస్తాడో రాదో తెలియదు… కానీ అమితాబ్ అంటే కేబీసీ, కేబీసీ అంటే అమితాబ్… అంతే, ఇంకెవరు వచ్చినా సరే, తనను మరిపించలేరు… తనొక చరిత్ర…
ఆ కుర్చీలో తనను తప్ప ఇంకెవరినీ ఊహించలేం… ఇలాంటి టీవీ షోకు తనే కరెక్టు… చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల దాకా… దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, స్త్రీలు, పురుషులు… రకరకాల ఏరియాలు, రకరకాల వృత్తులు, రకరకాల హోదాలు… అయిదారు స్టాండర్డ్స్ పిల్లల నుంచి ఐఏఎస్ ప్రిపేరయ్యేవాళ్లు, సీనియర్ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల దాకా… కేబీసీ టచ్ చేయని సెక్షన్ లేదు… మొన్న ఒకామె వీడియో వైరల్… పదే పదే నవ్వుతూ కనిపించింది… ఆమె 18 ఏళ్లుగా ఆ హాట్ సీటులో కూర్చోవడానికి ప్రయత్నిస్తోందట… ఆమె చెబుతోంది, మీ ఎదుట కూర్చుని కాసేపు మాట్లాడటమే కోటి రూపాయలు గెలిచినట్టు కదా సార్ అని… వావ్…
Ads
నిజమే కోట్లాది మందిలో కొందరే అక్కడి దాకా వస్తారు… లక్షల మంది ప్రయత్నిస్తూనే ఉంటారు… ఆ హాట్ సీటులో కూర్చోవడమే ఓ విజయం… గెలుపో ఓటమో జానేదేవ్… జాతిలో జనరల్ నాలెడ్జిని దట్టంగా నింపుతున్న ప్రోగ్రామ్ అది… సీజన్లు మారేకొద్దీ ఆప్షన్స్, ప్రైజ్ మనీ గట్రా మారుతున్నయ్… కొందరు అనూహ్యంగా ఫుల్ ప్రైజ్ అమౌంట్ గెలిచిన రికార్డులు… కానీ ప్రశ్నలడిగే సీటులో మాత్రం అదే మొహం… అదే గాంభీర్యం…
లక్షల కుటుంబాలు ఒక్క ఎపిసోడ్‌నూ మిస్ కాలేదు… అదీ దాని రేంజ్… నాలెడ్జి మాత్రమే కాదు, ఏవోవో జీకే బిట్స్ మాత్రమే కాదు… నవ్వించే కేరక్టర్లు, కదిలించే కథలు, కన్నీళ్లు, అన్నిరకాల ఉద్వేగాలూ… ఒకసారి కనెక్టయితే వదిలిపెట్టని ఓ వ్యసనం కేబీసీ వీక్షణం…
వెండితెర నుంచి బుల్లితెరకు రావడానికి చాలామందికి నామోషీ… నామర్దా… కానీ 23 ఏళ్ల క్రితమే అమితాబ్ టీవీలోకి వచ్చేశాడు… అఫ్‌కోర్స్, నమ్ముకుని స్థాపించిన ఏబీసీ (అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్) నిండా అప్పుల్లో ముంచేసి, అమితాబ్ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిన దశలో, ఆరోగ్యమూ సహకరించని స్థితిలో… కేబీసీ సీటులో కూర్చున్నాడు… అది తనను ఈరోజు ఆకాశంలో నిలిపింది… అమితాబ్ అంటే తెలియని ఇల్లు ఏముంది..? ఇంటింటికీ బంధువు తను… సో, 16వ సీజన్‌కూ నువ్వే రావయ్యా మహానుభావా…
సినిమా హీరోగా అమితాబ్‌కు తిరుగులేదు, ఆ పాపులారిటీ మరొకరికి రాదు… కానీ అంతకుమించిన పాపులారిటీని సంపాదించి, జాతి మొత్తాన్ని తనకు చేరువ చేసింది కేబీసీయే… పలు భాషల్లో పలువురు హీరోలు ఇదే ప్రోగ్రాంకు హోస్ట్‌గా ట్రై చేశారు… సక్సెస్ కాలేదు… అంతెందుకు..? హిందీలో కూడా వేర్వేరు హీరోలు మధ్యలో ట్రై చేసి, ఎవరూ ఆదరించక, కుర్చీ దిగి నిష్క్రమించారు… తెలుగులో నాగార్జున, జూనియర్, చిరంజీవి… ప్చ్…
సినిమా నటుడిగా కూడా… అమితాబ్ అంటే అమితాబే… నచ్చితే ఏ భాషాచిత్రమైనా సరే, ఎంత చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాడు… ఎక్కడికైనా ఫ్లయిట్‌లో వచ్చేస్తాడు… రకరకాల పాత్రలు, ప్రయోగాలు ఈరోజుకూ… నటుడంటే వాడు… హోస్ట్ అంటే వాడు… వాడొక ఎవరెస్టుడు…!! చిల్లర ఈగోలతో ఎగిరిపడే కుక్కమూతిపిందెలు ఎన్నో అమితాబ్ ఫోటోకు రోజూ పొద్దున్నే దండం పెట్టుకోవాలి… అనుసరించాలి…!!
Share this Article