సారంగదరియా పాట వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా..? లేక ఎందుకొచ్చిన పంచాయితీలే అనుకుని శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటన ఓ కొత్త ఆనవాయితీకి శ్రీకారం చుట్టబోతున్నాయా..? నిజానికి ఈ వివాదం ఎక్కడ స్టార్టయిందనేది పక్కన పెడదాం కాసేపు… ‘‘అయ్యో, నాకు రావల్సిన పేరును ఇంకెవరో ఎత్తుకుపోతున్నారు, నేనే ఆ సినిమాలో ఆ పాట పాడితే బాగుండు’’ అనే ఆశ ఒరిజినల్‌గా అప్పట్లో ఈ పాట పాడిన కోమలికి ఉండటంలో తప్పులేదు… మొదటిసారి ఆమెతో పాడిద్దామని ట్రై చేసిన దర్శకుడు నా గొంతు బాగాలేదు ప్రస్తుతం అని చెప్పినప్పుడు ఊరుకున్నాడు, మరోసారి ట్రై చేసి, ఆమెకు అవకాశం ఇచ్చినా బాగానే ఉండేది… ఓ డిఫరెంట్ గొంతు, సినిమాలో కొత్తగా పలికేది కదా… సినిమాలకు ఓ కొత్త గొంతును పరిచయం చేసినట్టు కూడా ఉండేది… కోమలి ఆశ కూడా నెరవేరేది… అఫ్ కోర్స్, మంగ్లి కూడా బాగా పాడింది… తన టోన్ కూడా ఆ ట్యూన్‌కు బాగా సూటయ్యింది… వివాదం వచ్చినప్పుడు నిన్ను ఆడియా ఫంక్షన్‌కు పిలుస్తామనీ, కొంత డబ్బు ఇస్తామనీ, సినిమాలో క్రెడిట్స్ ఇస్తామనీ ఆమెకు ముందే చెబితే బాగుండేది… కానీ సుద్దాల ఏదేదో అనవసర వివరణలకు ప్రయత్నించాడు… దాంతో మీడియా, సోషల్ మీడియా ఈ కురుపును గిచ్చీ గిచ్చీ పుండును చేసేశాయి…
నిజానికి జానపద గీతాల మీద ఎవరికీ రైట్స్ లేవు… అది సమాజం సొత్తు… నేను ముందుగా సేకరించాను, నేనే సినిమాలో పాడాలీ అంటే ఎలా..? పైగా లవ్ స్టోరీ సినిమాలో సుద్దాల కేవలం పల్లవిని తీసుకుని, చరణాలను సొంతంగా రాసుకున్నాడు మెరియా, చురియా, చిడియా అంటూ… రేప్పొద్దున ఓ బతుకమ్మ పాటో, ఓ గౌరమ్మ పాటో, ఓ లాలిపాటో, ఓ విప్లవ గీతమో ఎవరైనా తీసుకుని, మార్చుకుని, అవే ట్యూన్లను వాడుకుంటే… వాటికి క్రెడిట్స్ ఎవరికివ్వాలి..? ఉదాహరణకు చిత్తూచిత్తుల బొమ్మ పాట… చాలా పాపులర్… ఆ పాటను ఎవరైనా వాడుకోవాలంటే ఎవరికి డబ్బులు ఇవ్వాలి నిర్మాత..? ఎవరితో పాడించాలి..? తరతరాలుగా జానపదులు పాడుకునే పదాలు ఒక తరం నుంచి ఇంకో తరంలోకి సహజంగా ప్రవహిస్తాయి… కొన్ని పాటల్లో పదాలకు అర్థాలూ దొరకవు… అలా దరువులకు అనువుగా ఒదుగుతూ, నోళ్లలో నానుతూ పాపులర్ అయిపోతయ్…
Ads
నర్సపెల్లే గండిలోన గంగధారి అనే ఆడనెమలి పాట ఈమధ్య బాగా పాపులర్ యూట్యూబ్‌లోనే కోట్ల వ్యూస్ వచ్చినయ్… మంగ్లి ప్లస్ కనకవ్వ పాడారు పాట… కనకవ్వ విడిగా కూడా పాడినట్టుంది… ఎవరైనా సినిమాలో ఆ పల్లవి వాడుకునే పక్షంలో ఎవరికి డబ్బులు..? ఎవరికి క్రెడిట్స్..? ఎవరికి పాడే చాన్స్..? ఎవరికి ఆడియో ఫంక్షన్లో పాడే చాన్స్..? అసలు ఈ సారంగ దరియా పాట వివాదం దెబ్బకు ఇక జానపద ట్యూన్ల జోలికి పోరేమో ఇప్పట్లో..? నిజానికి ఒక మంచి ట్యూన్‌ను సినిమా కోసం వెకిలిగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు వివాదాలు సహజంగానే వస్తయ్… సమాజమే ప్రశ్నిస్తుంది… లేదా కమర్షియల్ అవసరాల కోసం పాపులర్ గీతాల్ని వాడుకున్నప్పుడూ వివాదాలు వస్తయ్… అప్పట్లో, అంటే 1991లో కావచ్చు… పీపుల్స్ ఎన్కౌంటర్ పేరిట నక్సలైట్లకు వ్యతిరేకంగా ఒక సినిమా తీశాడు రామోజీరావు… కీరవాణి సంగీత దర్శకుడు… ఈనేల మనదిరా, పొట్టకూటికోసం పోలీసన్నా వంటి విప్లవ గీతాలను నిర్మొహమాటంగా ఎత్తేశాడు… అప్పట్లో మీడియా, సోషల్ మీడియా లేవు కాబట్టి సరిపోయింది… ఐనా నక్సలైట్లు ప్రతిఘటించారు… కొన్నిచోట్ల బాక్సులను దహనం చేసినట్టు గుర్తు… నారాయణమూర్తి అలాంటి పాటలను వాడుకోవడం కూడా నక్సలైట్లకు నచ్చని విషయం… సో… ఇకపై పాపులర్ ట్యూన్లను ట్రై చేసేటప్పుడు ఏ వైపు నుంచి వివాదం వచ్చే అవకాశముందో ముందుగానే ఓసారి చూసుకోవడం బెటర్…!….. అవునూ.., జానపదులకు అకడమిక్ వాల్యూస్ ఉండవనీ, చదువుకోనివారు అనీ ఏదేదో కూసిన సదరు ఘన లవంగి రచయితతో క్షమాపణ చెప్పించాడా శేఖర్ కమ్ముల..? లేక ఆ సారంగధరుడి విజ్ఞతకే వదిలేశాడా..?
Share this Article