Taadi Prakash…….. 22 సంవత్సరాల క్రితం… ’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్.
ఈ మధ్యన గద్దర్ అంటే చాలా మంది చిరాకుపడుతున్నారు గానీ ఒకనాటి ఒరిజినల్ గద్దర్- తానొక్కడే ఒక సాంస్కృతిక మహోద్యమం కదా… ఆర్టిస్ట్ మోహన్, లెల్లె సురేష్, మల్లెల వెంకట్రావ్ లకి,నాకూ కబుర్లు చెప్పి, పాటలు పాడి… మాతో గంటలతరబడి గడిపిన అలనాటి ఉత్తేజం గద్దర్ నీ, ఆయన మనోహరమైన చిరునవ్వునీ తలుచుకుంటూ….. ఈ పాత జ్ఞాపకం. ఇది 2000వ సంవత్సరం మార్చిలో అచ్చయిన వ్యాసం.
Ads
కొన్నేళ్ళ క్రితం….
ఉత్తర భారతదేశాన ఓ రాష్ట్రంలో గద్దర్ రహస్య జీవనం గడుపుతున్నాడు. రీసెర్చ్ స్కాలర్ ముసుగులో రోజులు దొర్లిస్తున్నాడు. నాగలితో వ్యవసాయం చేసే తెలంగాణ,ట్రాక్టర్తో వ్యవసాయం చేసే పంజాబ్-యిలా నార్త్, సౌత్ ఇండియాలో ఉత్పాదక పద్ధతుల్లో మార్పులొచ్చినప్పుడు పాట ఎలా మారిందన్న అంశం మీద రీసెర్చ్…. ఇదో సాకు. ఆ అండర్ గ్రౌండ్ రోజుల్లో ఒకనాడు….
ఎప్పట్లాగే ఉదయం రన్నింగ్ కు వెళ్ళాను. సూర్యోదయం అయింది. రైల్వేట్రాక్ పక్కన పరుగెడుతున్నాను. మూగిన జనం కనిపించారు. అక్కడో చెత్తకుండీ. దాని దగ్గర చింకి గుడ్డల్లో ఏడుస్తూ ఒక పసికందు. బిడ్డను తీసుకెళ్ళే వాళ్ళెవరూ లేరు. నేను మాత్రం ఎలా పెంచగలను? చూస్తున్నాం అందరం. అట్నించో ఆవు వస్తోంది. అందరూ అయ్యయ్యో అనే వాళ్లే. బిడ్డని తీసిన వాళ్ళెవరూ లేరు. లెట్రిన్లు కడిగి, బక్కెట్ పట్టుకుని ఒక పాకీమనిషి అటుగా వస్తోంది. చూడగానే క్యా ఆద్మీ ఇన్ సాన్ హై? అని తిడుతూ పసిబిడ్డని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. జాకెట్ చించి బిడ్డకి పాలిచ్చింది. నా బిడ్డే అని ప్రకటిచింది. పక్కనే పోలీసు క్వార్టర్లు వుండడం వల్ల హడావుడి చూసి పోలీసులు వచ్చారు. ఆమెను స్టేషషనుకు తీసుకెళ్ళారు. నేనూ వెనుకనే వెళ్ళాను. నువ్వెందుకొచ్చావ్? అన్నారు పోలీసులు. ఆమెకి పిటిషన్ రాయడంలాంటి సహాయమేమన్నా చేయొచ్చని…..ఇంగ్లీషులో మాట్లాడాను. దాంతో వూరుకున్నారు.
దళిత గుండె గాయాన్ని, నిద్ర గన్నేరు నిశ్శబ్దాన్నీ ప్రజాయుద్ధగానంగా, రక్తాశ్రుగీతంగా, అరుణారుణ సంగీతంగా నరాల తీగపై పలికిస్తున్నవాడు గద్దర్. పాట కవిత్వం కాదని అనలేక పెదవి విరుస్తున్న వాళ్ళని చూసి పరిహాసంగా నవ్వుతున్నాడు గద్దర్.
**** **** **** ఆ పాట ****
నిండు అమావాసనాడు ఓ లచ్చా గుమ్మాడీ
ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చా గుమ్మాడీ
అత్త తొంగి సూడలేదు మొగుడూ ముద్దాడలేదు…
బట్టలల్ల సుట్టుకోని- బాయిలో పడేయబోతే
గంగమ్మ కొంగు చాపి సెల్లెదనమియ్యమంది
సెత్త గంపలేసుకుని సెత్త కుండిలెయ్యబోతే
కుక్కపిల్ల అడ్డమొచ్చి…. అక్క అట్ల సేయకనే
ఊపిరాడకుండనేమో బొంతమీద బొంత గప్తె
సిల్లీరంద్రం నుండి సిన్నంగ చూస్తుంది
పున్నమి దినము గోలె పుట్టకాడ పడవేస్తే
నాగన్న పడిగె విప్పి గొడుగుబట్టిండమ్మ
పురిబోసినట్లు నేను నల్లబూస దారం గడితే
నెల్లపూస దండలాయె మల్లెపూల దండలాయె
పాలుతాగనని నేను పంతాలు పట్టుకొంటె
పాలసేపులు దుంకిపోయె పాపనోట్లె బడ్డదమ్మో
వరిగింజ నోట్లోవోసి గొంతుబిస్కవోతే
పెదువులేమొ అడ్డమొచ్చి పుల్కుపుల్కు నవ్వెనమ్మో
కనుకున్న కడ్పుకోత కన్నీటి దారలాయె
పేగుకోసి పెంచుకున్న నాపాప నెట్లు పారేతూ
ఆడదానితో అన్నమావిరి…మొగోనితో పిల్లలవిరి
మొగబిడ్డ చెయ్యని పాపం ఆడబిడ్డలేమి చేసే
ఆడబిడ్డలేనిదే లోకమెట్లు పుట్టిపెరిగి
కన్న బిడ్డ మీదనే కన్నతల్లె పగబడితె
నాకు దిక్కెవరే బిక్కుబిక్కు ఎడ్చె బిడ్డ
చిట్టి చిట్టి కండ్లతోనె…సూటిప్రశ్న వేసే బిడ్డ
నేను సెత్తల్లో పారెయ్యనమ్మా- నా పొత్తిల్లో దాసుకుంటా
నేను బావిలో పడెయ్యనమ్మా- నేను బట్టలల్ల చుట్టనమ్మా
నేను వొరిగింజ వేసి చంపా…నేను వురిపోసి చంపుకోను
నిన్ను సమ్మక్క చేస్తా..సారక్కను చేస్తా
అక్కా శోభక్కనూ చేస్తా…చెల్లీ కుమారిని చేస్తా….
Share this Article