ఏమో గానీ… కొన్ని సినిమాలు చూస్తే అనుకోకుండా… ఒకరిద్దరు యాక్టర్లు తమ ముద్ర వేసి కొసేపు మన ఆలోచనల్లో తచ్చాడుతూ ఉంటారు… శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ షోలో తెలంగాణ ఆవిర్భావ ప్రత్యేక స్కిట్‌లో అమరుల మీద పాడిన నూకరాజు అనే జబర్దస్త్ కమెడియన్ ఒకరకంగా పేరు తెచ్చుకోగా… తనతోపాటు రీసెంటుగా బాగా పాపులరైన మరో కమెడియన్ ఇమాన్యూయేల్ గం గం గణేష చిత్రంలో మెరిశాడు…
నిజానికి వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాప్ స్టార్ కమెడియన్… ఒకప్పుడు బ్రహ్మానందం అనుభవించిన స్టేటస్ ఇప్పుడు వెన్నెల కిషోర్ అనుభవిస్తున్నాడు… అలాంటి తనకు దీటుగా ఈ సినిమాలో ఇమ్ము అలియాస్ ఇమాన్యుయేల్ పర్‌ఫామ్ చేయడం బాగుంది… సాధారణంగా మన చాలా తెలుగు సినిమాల్లో హీరోలు చిల్లర దొంగతనాలు చేసుకునే బతికే ఆవారాగాళ్లు, చిల్లరగాళ్లు… కథ నడిచేకొద్దీ భారీగాళ్లు అవుతుంటారు… (ఈమధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు పరిశీలించండి, అదే అర్థమవుతుంది)…
వాళ్ల పక్కన ఓ జతగాడు కంపల్సరీ… ఆ పాత్రలకు మనకు చాలామంది కమెడియన్లు ఉన్నారు పోషించేవాళ్లు… అదుగో వాళ్లకు ఇమ్ము రూపంలో మరో జతగాడు దొరికినట్టే…! కాస్త డార్క్ షేడ్‌తో ఉన్నా, నెత్తి మీద పదెకరాలు పోయినా… కామెడీ టైమింగులో అదరగొడుతున్నాడు… ఇక సినిమా విషయానికి వస్తే చాన్నాళ్ల తరువాత, అనగా చాలా సినిమాల తరువాత వెన్నెల కిషోర్‌కు కాస్త కామెడీ పండించే పాత్ర దొరికింది… బాగా చేశాడు సహజంగానే…
Ads
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ… నేల విడిచి సాము చేయడు, దొరుకుతున్నాయి కదా చాన్సులు అనుకుని వీర మాస్ యాక్షన్ సీన్లు కావాలని అడగడం లేదు… కథకు తగ్గ, పాత్రకు తగ్గ నటన కోసం కష్టపడుతున్నాడు… అఫ్‌కోర్స్, ఇంకా చాలా దూరం వెళ్లాలి… ఈ సినిమా చూసినా అదే అనిపిస్తుంది… కాకపోతే బేబీ హిట్ తరువాత ఇది తనకు మళ్లీ సంతృప్తినిచ్చే మరో సినిమా అవుతుంది…
అసలు తనకుతాను అధికంగా ఊహించుకుంటూ, చిన్న దర్శకులు వద్దు, కొత్త దర్శకులు వద్దు అనుకుంటూ, గిరిగీసుకుని, తప్పులు చేసే విజయ్ దేవరకొండ తమ్ముడిని చూసి నేర్చుకోవాలి… ఇదే సినిమా విజయ్ చేసి ఉంటే ఇంకాస్త బిజినెస్ పెరిగేది… మరీ మొన్నటి ఫ్యామిలీ స్టార్ కన్నా ఈ గణేషుడు నయం…
ఒక వజ్రం, హీరో దొంగిలించాడు, పోలీసులకు భయపడి, అటుగా తారసపడే ఓ గణేషుడి విగ్రహం తొండంలో వేస్తాడు, అదేమో ఓ పర్పస్ కోసం రూపొందించబడిన విగ్రహం, ఒక దగ్గరకు చేరాల్సింది మరోచోటకు చేరుతుంది… భిన్నమైన స్టోరీ పాయింట్… కామెడీని రంగరించి ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు…
కాకపోతే తెలుగు సినిమా అన్నాక వీరోయిన్ ఉండక తప్పదు, ఏదో దిక్కుమాలిన లవ్ ట్రాకు ఉండక తప్పదు అనే సూత్రానికి కట్టుబడి దర్శకుడు రెండు మొహాల్ని తీసుకున్నాడు గానీ… టోటల్‌గా ఆ ట్రాకులే వేస్ట్ ఈ సినిమాలో… అవీ తీసిపారేసి, ఇంకాస్త వెన్నెల కిషోర్ పోర్షన్ అధికంగా రాసుకుని ఉంటే ఇంకాస్త వర్కవుట్ అయ్యేదేమో… పోనీలే, గుడ్ అటెంప్ట్… పర్లేదు సినిమా..!!
Share this Article