ఓటీటీలో ఓ సుఖముంది… ఏదైనా డౌట్ వస్తే, మళ్లీ ఓసారి చూడాలనిపిస్తే, ఓ పాట లేక ఓ సీన్ మాత్రమే చూసి వదిలేయాలని అనుకుంటే… ఓటీటీని మించి సౌకర్యం లేదు… టీవీల్లో, థియేటర్లలో ఆ సౌలభ్యం ఉండదు… కొన్ని ఒంటరిగానే చూడాలి, దానికీ ఓటీటీయే బెటర్… ఈసారి చాలా హిందీ సినిమాలు ఫట్ ఫట్ అని పేలిపోవచ్చుగాక… కానీ కశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్యా-2, గంగూబాయ్ కథియావాడి సినిమాలు కమర్షియల్లీ సక్సెస్… గంగూబాయ్ మరొక్కసారి చూస్తుంటే అసలు ఇది సంజయ్ లీలా భన్సాలీ సినిమాయేనా అనిపిస్తుంది…
ఎందుకంటే..? తన టేకింగ్ మీద, ప్రతి సీన్ మీద తను కనబరిచే శ్రద్ధ మీద ఇండస్ట్రీలో మంచి పేరుంది… కానీ ఓ వేశ్య మీద తీసిన బయోపిక్ అసలు నిజాలకు దూరంగా వెళ్లిపోయిందా..? ఓ వేశ్యను విలన్‌గా చిత్రీకరించలేక భన్సాలీ కూడా గాడితప్పాడా..? వేశ్యల మీద బొచ్చెడు సినిమాలు దాదాపు అన్ని భాషల్లోనూ వచ్చాయి… వేశ్య పాత్ర వస్తే నటనకు స్కోప్ ఉంటుందనే భ్రమ కథానాయికల్లోనూ ఉంది… హిందీ సినిమాలకే వస్తే ప్యాసా, అమర్ ప్రేమ్, చమేలీ, చింగారీ, ఖిలౌనా, సాధనా, చోరీ చోరీ చుప్కె చుప్కె, దేవదాస్, ఉమ్రావ్ జాన్, సడక్, మండీ… ఎన్నో హిందీ సినిమాలు వచ్చాయి… ‘‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’’ అంటూ దాదాపు హీరోయిన్లందరూ బాగానే చేశారు…
అలియా భట్ స్వతహాగా మంచి నటి… ఇక ఇలాంటి పాత్ర దొరికితే ఊరుకుంటుందా..? పలు సీన్లలో ఇరగ్గొట్టేసింది… కాకపోతే బక్కపలుచటి లావణ్యం ఆ పాత్రకు నప్పలేదేమో… భన్సాలీ వీలైనంతవరకూ ఆ పాత్ర పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించాడు కాబట్టి… క్రూరమైన విలన్‌ను చూపించలేదు కాబట్టి అలియా బచాయించిపోయింది… లేకపోతే ఆమెకూ కష్టమయ్యేది…
Ads
ఎందుకు ఇది నిజాలకు దూరంగా ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి… 2011లో హుసేన్ జైదీ అనే రైటర్ ‘‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’’ అని బుక్ రాశాడు… ముంబై మాఫియాతో లింకులున్న 13 మంది స్త్రీల కథలివి… జేన్ బోరెస్ అనే జర్నలిస్టు చేసిన రీసెర్చ్ ఆధారంగా రాయబడిన కథలివి… ఎన్నో కేస్ రిపోర్టులు, పత్రికల్లో వార్తలు, అఫిషియల్ డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంతవరకూ సాధికారత అద్దే ప్రయత్నం చేశారు… ఐననూ కొంత కల్పన తప్పదు… ఇందులో రెండో అధ్యాయమే గంగూబాయ్…
దీన్ని సినిమాగా మలిచే క్రమంలో భన్సాలీ ఆ పాత్ర మీద అతి ప్రేమను, జాలిని, సానుభూతిని చూపించాడు… చివరకు తను తీసుకున్న క్రియేటివ్ ఫ్రీడం కూడా ఆ వేశ్యను బాధితురాలిగా చిత్రీకరించడానికి, ఆమెను ఓ గొప్ప మనిషిగా చూపించడానికి ప్రయత్నించాడు… చివరకు ప్రధానితో కూడా కలుపుతాడు… గంగగా పుట్టిన గంగూబాయ్ పదహారేళ్ల వయస్సులోనే తండ్రి దగ్గర పనిచేసే అకౌంటెంట్‌తో లేచిపోయి వచ్చేస్తుంది… అక్కడే పాత్ర ఔచిత్యం గంగలో కలిసింది… సినిమాలంటే ఆమెకు పిచ్చి… లేపుకొచ్చినవాడు కొన్నిరోజులు ఎంజాయ్ చేసి, వేశ్యావాటికలో అమ్మేస్తాడు… ఇక అక్కడ గంగూ తనకు ఇష్టం వచ్చినట్టు బతికే చాన్స్ కోల్పోయింది… అది కామాటిపుర ఏరియా…
విధి లేక, వేరే దారి లేక… వ్యభిచారానికి సై అంటుంది… అనకతప్పదు… లేకపోతే కట్టేసి మరీ ఆ పనిచేయిస్తారు… మరణిస్తే ఓ పురుగులా ఈడ్చిపారేస్తారు… అంతా బాగా నడిస్తే అక్కడి వేల సరుకుల్లో తనూ ఒకతై ఎప్పుడో టపా కట్టేది… కానీ షౌకత్ అబ్బాస్ అనే క్రూరుడు శృంగారంలో ఓ పిశాచం వంటి కేరక్టర్… అలియా ఒక్కసారికే చచ్చిపోయినంత పనవుతుంది… కోలుకున్నాక మళ్లీ వస్తానంటాడు వాడు… అప్పుడు ఆమెలో ఆలోచన మొదలవుతుంది… ఏదయితే అదయిందనుకుని రహీం లాలా అనే ఓ మాఫియా డాన్‌ను కలుస్తుంది… నిజానికి తన దగ్గరకు వెళ్లడం, కలవడమే పెద్ద టాస్క్… ఎప్పుడైతే షౌకత్ గురించి చెబుతుందో అనుచరులు ఆమెను రహీం దగ్గరకు తీసుకుపోతారు…
సినిమాలో రహీం ఆమెకు సోదరుడిలా అభయం ఇచ్చినట్టు… అండగా ఉన్నట్టు చూపించి… తననూ ఓ సాఫ్ట్ కేరక్టర్‌గా మలిచాడు దర్శకుడు భన్సాలీ… నిజానికి రహీంకు కామాటిపురలో ఓ మంచి అడ్డా కావాలి… అక్కడ మద్యం అమ్మకాలకు ఓ నమ్మకమైన కేరక్టర్ కావాలి… అక్కడే బతుకుతూ ఉండాలి… ఈ పిల్ల ధైర్యం, తెగింపు చూసి చేతులు కలుపుతాడు… షౌకత్‌ను చితకబాదుతాడు… దాంతో గంగూబాయ్ పరపతి పెరుగుతుంది అక్కడ… ఆమె అంటే భయం పెరుగుతుంది… అది ఆమె వాడుకుంటుంది…
క్రమేపీ రహీం ప్రాపకంతో గంగూ ఓ మాఫియా క్వీన్‌గా ఎదుగుతుంది… కామాటిపురలోని వేశ్యాగృహాలన్నింటిమీద గ్రిప్ వస్తుంది… నిర్బంధంగా తీసుకురాబడిన కొందరిని తిరిగి ఇళ్లకు పంపించేస్తుంది… ఇక్కడ ఆమెకు ఓ ప్రేమకథ పెట్టి, తన ప్రేమికుడికి మరో వేశ్య బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తుంది… ఇదంతా తన పాపులారిటీని పెంచుకోవడం కోసం… వేశ్యల పిల్లల చదువుల కోసం కొట్లాడుతుంది… స్వచ్చందసంస్థల పేరిట కామాటిపురనే ఖాళీ చేయించే కుట్రల్ని అడ్డుకుంటుంది… ఎందుకు..?
అది తన అడ్డా… తన గ్రిప్, తన దందా కొనసాగాలి… డబ్బు సంపాదించింది… ఖరీదైన కార్లలో తిరిగేది… వేశ్యావృత్తిని చట్టబద్దం చేయాలని ప్రధానినే అడుగుతుంది… కామాటిపురను ఖాళీ చేయించే ప్రతిపాదనలున్నాయి కాబట్టి, ఆమె అక్కడి లీడర్ కాబట్టి ఆయన టైమ్ ఇస్తాడు… మొత్తం వ్యవహారంలో ఆమెను ఓ నాయకురాలిగా, వేశ్యల బతుకుల పట్ల సానుభూతి కలిగి, సంస్కరణల కోసం ప్రయత్నించిన మనిషిగా చూపించడానికి భన్సాలీ ట్రై చేశాడు…
ఆమెకు నిజానికి సంస్కరణలేమీ పట్టవు… ఆమె పొలిటిషియన్ కమ్ మాఫియా యాక్టివిస్ట్… కామాటిపురలో మద్యం అమ్మకాలు ఎక్కువ కదా… ప్రతి సీసా ఆమె అమ్మేదే… ఆమెకు చిన్నపాటి సైన్యం… ఆ ఏరియాకు ఆమే నియంత… పెద్ద సమస్య వస్తే రహీం చూసుకునేవాడు… తన మద్యం వ్యాపారపు కమీషన్ తను తీసుకునేవాడు… ఆమె విపరీతంగా తాగేది, జూదం ఆడేది… ఆమె విగ్రహం కామాటిపురలో ఉంది… నిజమే, ఎందరు నేతల విగ్రహాలు ఎన్నిచోట్ల లేవు… అందరివీ సచ్చరితలేనా..? అప్పట్లో హజీమస్తాన్, వరదరాజన్ తదితర డాన్ల హవా నడిచేది… రహీం తక్కువేమీ కాదు… రహీం యాక్టివిటీస్‌కు కామాటిపుర ఓ సేఫ్ అడ్డా…
Share this Article