సినిమా సంగతి తరువాత… నిర్మాత, దర్శకుల ఓ కొత్త ఆలోచన మాత్రం డిఫరెంటుగా అనిపించింది…. ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… అంటే మరేమీ లేదు, తెలుగు, కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషలు మాత్రమే… మార్కెట్ ఈ భాషల్లో మాత్రమే ఉంటుంది… నాలుగు డబ్బులు రాలతయ్… జస్ట్, ఆయా భాషల్లోకి డబ్ చేసి మార్కెట్ మీదకు వదిలేయడమే… అయితే ఒకే భాష సినిమాలకు చెందిన నటులైతే వేరే భాషల వాళ్లకు పరాయి సినిమా చూస్తున్నట్టు ఉంటుంది… అందుకని… అరె, ఇది మన సినిమాయే అనే ఫీల్ రావాలంటే ఏం చేయాలి…
ఆయా భాషల నుంచి నటుల్ని ఏరుకుని, మన సినిమాలో ఇరికించేయాలి… కొత్తదనం, వెరయిటీ ప్లస్ పాన్ ఇండియా లుక్కు… వావ్ కదా… గని సినిమాలో కూడా అంతే… మలయాళం నుంచి నదియా… ఈమె తమిళానికీ సూటవుతుంది… కన్నడం నుంచి ఉపేంద్ర… బాలీవుడ్ నుంచి సునీల్ శెట్టి… పాన్ ఇండియా బాహుబలితో దేశం మొత్తానికీ పరిచయమైన తమన్నాతో ఓ ఐటం సాంగ్… ఇంకేం కావాలి..? అఫ్‌కోర్స్, ఓ ముంబై హీరోయిన్… సయీ మంజ్రేకర్… ఈమె నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ బిడ్డ… అంతేనా..? హీరో సిక్స్ ప్యాక్… బాడీ ప్రదర్శన… స్పోర్ట్స్ స్టోరీ…
నిజానికి సినిమాలైనా, నవలలైనా… ఏదైనా సరే… కొత్తగా ఏమైనా చెప్పు… లేదంటే అందరికీ తెలిసిన పాతదే కొత్తగా చెప్పు… వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో కొత్త సబ్జెక్టు లేదు, కొత్తగా చెప్పలేదు… ఓ తండ్రి బాక్సర్, డోపింగ్ ఆరోపణలతో వెలివేయబడతాడు… కొడుకు అందులోనే శ్రమించి, తండ్రి పేరు నిలబెడతాడు… అదే కథ… సినిమా మొత్తమ్మీద బాక్సింగ్ క్రీడ, ఇండియాలో దాని పరిస్థితి ఏమిటో ఏమీ చర్చించదు… పోనీ, ఇంకేమైనా ఎమోషనల్ కంటెంట్ ఉందా అంటే అదీ లేదు…
Ads
సినిమా అన్నాక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఓ హీరోయిన్‌ను పెట్టారు… హీరోయిన్ ఉన్నాక లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి ఓ లవ్ ట్రాక్ రాసుకున్నారు… అదేమీ పండలేదు… మరి బాక్సర్ అన్నాక కోచ్ ఉండాలి కాబట్టి ఓ కోచ్ పాత్రను పెట్టారు… మరీ నవ్వొచ్చేదేమిటంటే సీనియర్ నరేష్ ఈ కోచ్ పాత్ర పోషించాడు… హేమిటో… సినిమా మొత్తం ఇలాగే… ఫస్టాఫ్ అంతా మనమేం సినిమా చూస్తున్నామో మనకే తెలియనంత అనామకంగా నడిపించాడు దర్శకుడు…
రమ్యకృష్ణ, నదియా వంటి మెరిట్ స్టార్లను తీసుకుంటున్నారు అంటే వాళ్లకు తగిన పాత్రలు అవసరం… అలాంటి పాత్రలు దొరికితే చించేస్తారు… ఉదాహరణకు నదియాకు అత్తారింటికి దారేది? దృశ్యం సినిమాల్లో దక్కిన పాత్రలు… రమ్యకృష్ణకు బాహుబలి… ప్చ్, గనిలో నదియా పాత్రకే ఏ ప్రాధాన్యమూ లేదు, ఆమెకు పెద్ద స్కోపూ లేదు… (అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా గుర్తొస్తూ ఉంటుంది గని చూస్తుంటే…)
సరే, ఆకట్టుకునే డ్రామా లేదు, థ్రిల్ కలిగించే సీన్లు లేవు… కనీసం పాటలైనా సరిగ్గా ఉన్నాయా..? ఫస్టాఫ్ పాట ఇంటర్వెల్ తరువాత గుర్తుండి చావదు… అంత నాసిరకం సాంగ్స్… బీజీఎం సరేసరి… కేవలం వరుణుడి కండలు చూస్తూ ఉండిపోలేడు కదా ప్రేక్షకుడు… చివరగా :: వరుణ్ తేజ్ మొదటి నుంచీ పాత్రల ఎంపిక పట్ల జాగ్రత్తగా ఉంటున్నాడు… తన పరిధిలో తాను కష్టపడతాడు… కథకు తలొగ్గుతాడు… ఈ సినిమా మాత్రమే మరీ సాదాసీదాగా ఉంది…!!
Share this Article