గార్గి… అంటే..? వేదకాలం నాటి ఓ మహాయోగిని పేరు… గొప్ప జ్ఞాని… ఈమధ్య తెలుగులోకి డబ్బింగ్ అయ్యే తమిళ సినిమాల పేర్లన్నీ చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి కదా, ఇదీ అలాంటిదే అనుకునేరు సుమా… ఆ పేరుకున్న విశిష్టత చెప్పాలని ఈ వివరణ… ఈ సినిమాకు ఆ పేరు నప్పుతుందా లేదనేది వేరే సంగతి… ఇక విషయంలోకి వెళ్దాం… గార్గి సినిమాలో సాయిపల్లవి నటన సింప్లీ ఎక్సలెంట్… ఆ పదానికి తక్కువ వద్దు, ఎక్కువ వద్దు… బహుశా తన కెరీర్ బెస్ట్ ఇప్పటికి… భావోద్వేగాల్ని ప్రదర్శించడంలో వర్తమాన కథానాయికల్లో ఆమే నంబర్ వన్…
మొన్నామధ్య మనమే చెప్పుకున్నాం… మరణించిన మహానటి స్మితాపాటిల్ బాటలో సాయిపల్లవి వెళ్తోందని… నిజమే, గార్గి పాత్ర కూడా అలాంటిదే… సినిమా చూస్తున్నంతసేపు ఓ సమాంతర సినిమాలాగా ఉంటుంది… అంటే బాగా లేదని కాదు… సాయిపల్లవే కనిపిస్తూ ఉంటుంది… చాలాసార్లు సినిమాల్లో చూసిన కథే… అత్యాచారాలు, కేసులు, మీడియా చెత్తదనం, తప్పుడు పోలీస్ కేసులు గట్రా రోజూ చదువుతున్నవే… కానీ అదే కథను కొత్తగా ఎక్కడా వీసమెత్తు అశ్లీలం లేకుండా, కమర్షియల్ వాసనలు ఏమీ లేకుండా నీట్‌గా ప్రజెంట్ చేయబడిన సినిమా ఇది…
తమిళ దర్శకులు ఎంచుకున్న దారి అదే… ఇంకా నిద్రలేవని తెలుగు దర్శకులు ఎంచుకోవాల్సిన దారీ అదే… ఓ అత్యాచారం… తప్పుడు కేసు… ఇటు నిర్దోష కుటుంబం ఎలా డిస్టర్బ్ అవుతుంది… అటు బాధిత కుటుంబం ఎలా తల్లడిల్లిపోతుంది… అదీ కథ… కోర్టు రూంలో బోలెడు వాదనలు… అసలు తప్పు లేకపోయినా కేసు బనాయించబడిన కుటుంబం పడే వేదన, సమాజం చూపే వివక్ష ప్రధానంగా ఫోకస్ అవుతుంది… అన్నింటికీ మించి సమాజానికి పెద్ద శిక్షగా, విద్రోహిగా మారిన మీడియా ధోరణిని ఎండగట్టడం భలే నచ్చుతుంది…
Ads
సరే, సాయిపల్లవి ఎంచుకున్న పాత్ర అంటేనే ఓ ఇంటెన్సిటీ ఉన్న బరువైన, విభిన్నమైన పాత్ర అని అర్థమవుతూనే ఉంది… దాన్ని సవాల్‌గా తీసుకుంటుంది… హీరోయిన్ అంటే హీరో పక్కన నాలుగు పిచ్చి గెంతులేసే దేభ్యం మొహం కాదు అని సాయిపల్లవి తన పాత్రలతో పదే పదే చెబుతోంది… ఇవన్నీ వదిలేస్తే… నాణేనికి మరోవైపు వెళ్దాం ఓసారి…
సీరియస్ సినిమా… కేవలం సాయిపల్లవి నటన కోసం థియేటర్ వెళ్లాలా..? ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూసినా, టీవీలో చూసినా వోకే కదా… మరి అందరూ ఇలాగే అనుకుంటే ఇలాంటి సినిమాలు వచ్చేదెలా..? నిజమే… కానీ థియేటర్ వెళ్లి సినిమాలు చూసే రోజులా ఇవి..? థియేటర్‌కు వెళ్తే అడుగడుగునా తిరు క్షవరమే కదా… సగటు ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పించే థ్రిల్, గొప్ప థియేటరికల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఏమీ ఉండని సినిమా ఇది… కథనంలో స్పీడ్ ఉండదు… కట్టిపడేసే మలుపులు ఏమీ ఉండవు… ప్లెయిన్ అండ్ పెయిన్… సంగీతం, పాట గురించి చెప్పడానికి ఏమీలేదు…
స్థూలంగా చూస్తే మరోసారి సూర్య, జ్యోతిక తమ అభిరుచిని ప్రదర్శించిన సినిమా అనిపిస్తుంది… తెలుగులో రానా తన పేరును, సురేష్ ప్రొడక్షన్స్ పేరును వాడుకోవటానికి, ప్రమోషన్ కోణంలో అనుమతినిచ్చారు తప్ప వాళ్లు పెట్టిందేమీ లేదు… పెద్దగా ఖర్చు పెట్టిన సినిమా కూడా కాదు… నిజానికి ఓటీటీ, టీవీ రైట్స్‌తోనే సినిమాకు పెట్టిన డబ్బు వాపస్ వచ్చేసి ఉంటుంది… సో, తక్కువ ఖర్చు… అర్థవంతమైన కథలు… గార్గి అలాంటి సినిమాలకు ఓ ప్రేరణ… కట్ చేస్తే… ఇక సాయిపల్లవి అంటేనే సమాంతర సినిమాల నటి మాత్రమేనా..? మరి ఆమె ప్రతిభ చూపే డాన్స్, చూపగల ఇతర ఉద్వేగాల మాటేమిటి..? రాను రాను అదీ అడవిగాచిన విరాటపర్వమేనా..?!
Share this Article