Bharadwaja Rangavajhala……… నాలుగు కాలాలపాటు అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడగలిగేదే శాస్త్రీయ సంగీతం. అందులో కొంత లలిత సంగీతమూ ఉండవచ్చు. అది దశాబ్దకాలం జనం మనసుల్లో నిలవగలిగిందీ అంటే అదీ శాస్త్రీయ సంగీతమే. జనం మనసుల్లో నిలవనిది శాస్త్రీయ సంగీతమే అయినా దాన్ని అంగీకరించను. ఇవి బాలమురళి అభిప్రాయాలు.
విశ్వనాథ్ తీసిన సినిమాల్లో సంగీత పరంగా శంకరాభరణం కన్నా శృతిలయలు తనకు నచ్చిన చిత్రమంటారు బాలమురళి. నటుడుగా భక్తప్రహ్లాదలో నారద పాత్ర ధరించారు. అది అందరికీ తెల్సిన విషయమే. అయితే ఆయన ఓ కన్నడ సినిమాలో హీరోగా నటించారు. చిత్రం పేరు సంధ్య గిందెన సింధూరం. అది ఒక సంగీత విద్వాంసుడికి సంబంధించిన కథే. డబ్బుల కోసం కచ్చేరీలు చేయడం తప్పని భావించే పాత్ర.
పిల్లలకు ఉచితంగా సంగీతం నేర్పుతూ ఉంటాడు. ఓ అనాధ పిల్ల వచ్చి చేరుతుంది. ఆ అమ్మాయితో అనుబంధం పెంచుకుంటారు విద్వాంసుడు. అమ్మాయి పెరిగి పెద్దదై కచ్చేరీలు చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటుంది. సంగీతంతో డబ్బులు సంపాదించాలనుకుంటే సినిమాలే బెటరని తెలుసుకుని మద్రాసు చేరుతుంది. ఈ ప్రయత్నంలో సంగీత విద్వాంసుడి సాయాన్ని కోరుతుంది. ఆయన తన ఆస్తులు అమ్మి ఆ అమ్మాయిని మద్రాసులో ఉంచి సినిమా ప్రయత్నాలు చేస్తాడు.
Ads
ఓ సంగీత దర్శకుడి ఆశ్రయంలో చేరిన ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. సినిమా సంగీతంతో డబ్బులు సంపాదించడం కూడా ప్రారంభమౌతుంది. అయితే తన లక్ష్యం ఇది కాదు కనుక విద్వాంసుడు ఇవన్నీ చూసి తట్టుకోలేక చనిపోతాడు. ఇదీ కథ. సినిమా ఫ్లాప్ అయ్యింది. విచిత్రమేమంటే… సంగీత విద్వాంసుడుగా బాలమురళి కనిపిస్తే… ఆయన శిష్యురాలి పాత్రలో సీమ నటించింది.
తెలుగు సినిమాలకూ సంగీత దర్శకత్వం వహించాలనీ … సంగీత దర్శకుడుగా పనిచేయాలని బాలమురళికి ఉండేది. విశ్వనాథ్ కోరితే ఆయన చిత్రానికి సంగీతం అందించడానికి తాను సిద్దం అని ఎనభై నాలుగు ప్రాంతాల్లో ఓ ఇంటర్యూ లో చెప్పారాయన. తన దగ్గర సంగీతం నేర్చుకున్న ఎస్.వరలక్ష్మి బలవంతం కారణంగా సతీ సావిత్రి చిత్రంలో పాటలు పాడడమే కాదు… నాలుగైదు పాటలు కంపోజ్ చేశారు కూడా.
ఆ తర్వాత జి.వి అయ్యర్ తీసిన ఆదిశంకరాచార్య, మద్వాచార్య లాంటి సినిమాలకు సంగీతం అందించారు. వీటితో పాటు జీవీ అయ్యరే తీసిన హంసగీతె అనే కన్నడ సినిమాకూ సంగీత దర్శకత్వం వహించారు బాలమురళి. ఆ సినిమాకుగాను జాతీయ ఉత్తమ నేపధ్య గాయకుడి అవార్డు అందుకున్నారు బాలమురళి. మద్వాచార్య సినిమాకుగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం సాధించారు. ఓ పాత పత్రికలో అచ్చైన సంధ్య గిందెన సింధూరలో స్టిల్లు దొరికింది.
శంకరాభరణంలో పాడమని బాలమురళిని అడిగితే నటిస్తూ పాడతా అని విశ్వనాథ్ ను భయపెట్టారు అని ఓ కథ ప్రచారంలో ఉంది కానీ… నాకు పెద్దగా తెల్దు…
Share this Article