ఒక్కొక్క సీఎం వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రగతిభవన్‌లు, రుషికొండ ప్యాలెసులు కట్టుకుంటారు… కోట్లకుకోట్ల విలువైన ఫర్నీచర్ కొంటారు… భద్రత, మెయింటెనెన్స్ ఖర్చు కూడా కోట్లలోనే… వాళ్ల సంపాదనలు పక్కన పెట్టేయండి, అదసలు లెక్కలేనంత… దీంతో పోలిస్తే సముద్రంలో కాకిరెట్ట వంటి ఓ విషయం…
అస్సోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఓ నిర్ణయాన్ని ప్రకటించాడు… ఇకపై తన అధికారిక నివాసం కరెంటు బిల్లు కూడా నేనే కడతాను, నేనే కాదు, మా చీఫ్ సెక్రెటరీ కూడా అంతే… వచ్చే నెల నుంచి హయ్యర్ ఆఫీసర్లు అందరూ దీన్ని పాటిస్తారు… ఇదీ ఆ నిర్ణయం… 75 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఓ ప్రోటోకాల్ వీవీఐపీ ఖర్చు కోణంలో ఇది చాలా చాలా చిన్న నిర్ణయమే కావచ్చుగాక… ఐనా అభినందించాలి…
స్పూర్తి కోసం కావచ్చు, ఏదో ప్రచారం కోసం కావచ్చు, ఖజానాకు నాలుగు డబ్బులు మిగిల్చాలనే కావచ్చు… కారణం ఏదైనా చెప్పండి… చాలా చిన్నదైనా సరే చప్పట్లు కొట్టాలి మనం… ఎట్ లీస్ట్ దీన్నయినా అంగీకరించి, అమలు చేస్తున్నందుకు… ఎస్, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవాళ్లకు జీతాలు ఇవ్వడం లేదా..? అఫిషియల్ క్వార్టర్స్, అన్నిరకాల భత్యాలు, వాహనాలు, సేవల కోసం పనిమనుషులు, ఆర్డర్లీలు…
Ads
ఇవి గాకుండా ఎడాపెడా సంపాదనలు… చివరకు కొన్నిచోట్ల వాళ్ల ఆదాయపు పన్ను కూడా ప్రభుత్వమే కడుతుంది… సింపుల్‌గా చెప్పాలంటే వీళ్లంతా ఈ సమాజానికి పెద్దల్లుళ్లు… జీతభత్యాలు ఇస్తున్నప్పుడు, అపరిమితమైన అధికారాలు, అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు వాళ్ల కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు, ఇతరత్రా వాళ్లే ఎందుకు పే చేయకూడదు..? పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి వాళ్లను ఎందుకు పోషించాలి..? ఏం తక్కువైంది వాళ్లకు…
న్యాయ వ్యవస్థ, అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎవరూ అతీతులు కారు… కొన్నిచోెట్ల వీళ్ల క్వార్టర్లకు సమాంతర కరెంటు లైన్లు… ఒక వైపు నుంచి సాంకేతిక కారణాలతో పవర్ ఆప్ అయితే మరోవైపు నుంచి ఇస్తారు… కావల్సినంత కరెంటు ఫ్రీ, కావల్సినన్ని నీళ్లు ఫ్రీ… బయట నీళ్లకు పేదలు కొట్లాడుతూ, తన్నుకుంటున్నా సరే… వీళ్లకు లీటర్ నీళ్లు కూడా తక్కువ రావడానికి వీల్లేదు…
హలో… ఒక్కొక్కరూ నాలుగైదు అంతస్థుల భవనాలు కట్టుకుని, కిరాయిలకు ఇచ్చి, ఈ సౌకర్యాలన్నీ పొందుతున్న ఘనులూ ఉన్నారట… స్విమ్మింగ్ పూల్స్ వంటి దరిద్రాలు సరేసరి… మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా క్వార్టర్లు ఇస్తారు కదా, మరి వాళ్లకూ జీతాలు ఇస్తున్నాం కదా, మరి వాళ్లకెందుకు ఈ ఉచిత భాగ్యాలు అంటారా..? ఎస్, అస్సోం సీఎం పాటించిన స్పూర్తిని ఇతర రాష్ట్రాలూ పాటిస్తే అవీ కట్టవుతాయి… ఏదో మనకు స్వల్పానందం… వెనుక నుంచి ఏనుగులు పోయినా సరే, ముందు నుంచి ఈగ కూడా అనవసరంగా మన ఖజానా నుంచి పోకూడదు… అంతే…!!
Share this Article