పాకిస్థాన్ అనగానే మనకు ఓ భయం… అక్కడ ఉగ్రవాదులు తుపాకులు ధరించి బజారుల్లో తిరుగుతారని… ప్రజలందరూ జేబుల్లో గ్రెనేడ్లు పోసుకుని సంచరిస్తుంటారని… మందుపాతర్లు మామూలేనని… భయం, బీభత్సం, క్రూరత్వం రాజ్యమేలుతుంటాయని…! నిజంగానే అది ఉగ్రవాద దేశం… ఉగ్రవాదులకు పుట్టిల్లు… ఎక్కడెక్కడి ఉగ్రవాదులకూ అది అడ్డా… అక్కడి రాజకీయాధికారం ఉగ్రవాదంతో ఆడుకుంటుంది… కానీ ప్రజలందరూ అదేనా..? కాదు…
ఏ దేశంలోనైనా ప్రజల ప్రజలే… మనుషులే… ప్రభుత్వాలు వాళ్లను ప్రభావితం చేస్తుంటాయి గానీ ఎవరిలోనైనా పారేది అదే మనిషి నెత్తురు… ఉద్వేగాలు ఉంటయ్… ప్రత్యర్థి దేశమైనా సరే, ఓ ఇండియన్ కనిపించగానే కత్తితో కసుక్కుమని పొడిచేయరు… కోట్ల మంది పాకిస్థానీలు… సరిహద్దుల్లో మన శతృత్వాలు, ఆ హద్దులు దాటి, కాస్త లోపలకు వెళ్తే… ఆ జీవనం వేరు… ఇండియా పట్ల, ఇండియన్ల పట్ల, ఇండియా కల్చర్ పట్ల హద్దుల్లేని అభిమానం చూపేవారున్నారు… ఉంటారు…
అదుగో, అలాంటి ఓ డిఫరెంట్ స్టోరీ సాక్షి హైదరాబాద్ సిటీ పేజీలో కనిపించింది… రాజకీయ బురదను మాత్రమే దట్టంగా పట్టించుకుని, అదే పాత్రికేయం అనుకునే ‘పార్టీ పత్రికల’కు ఇలాంటి స్టోరీలు చూపించాలి… ఆ స్టోరీని భలే పట్టుకుని, బాగానే ప్రజెంట్ చేశారు గానీ కేవలం సిటీ పేజీకి పరిమితం చేయడం కరెక్టు కాదు… ఆఫ్ బీట్ స్టోరీలను మెయిన్ పేజీల్లో కూడా ప్రజెంట్ చేస్తుండాలి… వార్త సారాంశం ఏమిటంటే..?
Ads
పాకిస్థాన్‌లో ఐటీఎప్ జే-5 టోర్నమెంట్స్ జరిగాయి… దానికి హైదరాబాద్ నుంచి శ్యాంసన్ కూతురు తానియా, సత్తెయ్య కూతురు ప్రిన్సీ కూడా వెళ్లారు… వెళ్లే ముందు బోలెడు భయాలు… పాకిస్థాన్ కదా… ఇండియన్స్ అనగానే తమ పట్ల ఎలా వ్యవహరిస్తారో అనే ఓరకమైన జంకు… ఇస్లామాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని జిన్నా స్టేడియంలో టోర్నీలు… అదొక అడవి… రోజూ వెళ్లిరావడానికి తిప్పలు, క్యాబులు…
10న గేమ్ పూర్తయింది… క్యాబుల్లేవు… హోటల్‌కు ఎలా వెళ్లాలి… నడుచుకుంటూ వెళ్తున్నారు… ఇస్లామాబాద్‌కు చెందిన తాహెర్ ఖాన్ అనే యూట్యూబర్, బ్లాగర్ మాత్రమే కాదు.., కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో ఎనిమిది రెస్టారెంట్ల ఓనర్… లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు, ఇండియన్స్ అని తెలిసి తారిఫ్ చేశాడు, ఆతిథ్యం తీసుకోవాలని పదే పదే అడిగాడు… భోజనం చేసేవరకూ వదిలిపెట్టలేదు… సాక్షి రిపోర్టర్ సదరు తానియా తండ్రి ‘శ్యాంసన్’తోనూ మాట్లాడి స్టోరీ ఫైల్ చేశారు… వీళ్లతో తన పరిచయం, ఆతిథ్యం గురించి సదరు తాహెర్ కూడా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు…
తాహెర్ మాత్రమే కాదు… పలువురు ఆటోవాళ్లు డబ్బులు కూడా తీసుకోలేదు… హైదరాబాదీలు అని తెలియగానే చాయ్ తాపించి, పంపించేవాళ్లు… ఎందుకైనా మంచిదని వీళ్లు వెళ్లేటప్పుడే చిన్న స్టవ్, వంట సామగ్రి తీసుకుపోయారు… ఓచోట చికెన్ కొన్నారు, ఇండియన్స్ అని చెప్పాక ఓ కిలో అదనంగా, ఉచితంగా ఇచ్చి, చాయ్ తాపించాడు ఆ చికెన్ సెంటర్ ఓనర్… ఇలాగే చాలా… సో, ప్రజలు ప్రేమించుకుంటారు… ప్రభుత్వాలు ద్వేషించుకుంటాయి… సగటు పాకిస్థానీ అనగానే ఉగ్రవాది అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేయడానికి ఇలాంటి స్టోరీలు ఉపయోగకరం…!!
Share this Article