Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ద పత్రికల ‘ఆత్మ’హత్య… వీసమెత్తు ప్రొఫెషనలిజం కూడా కరువైంది…

January 29, 2023 by M S R

పాలక స్థానంలో ఉన్న వ్యక్తి నోటి వెంట ఏ మాట వచ్చినా… దానికి ఓ సాధికారత ఉండాలి, విలువ ఉండాలి, అదొక డాక్యుమెంట్‌లా ఉండాలి, మళ్లీ పదే పదే మారకుండా ఉండాలి, అన్నింటికీ మించి అది నిజమై ఉండాలి… ఇదే కేసీయార్‌కు నచ్చనిది… ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, కరోనా- పారాసెటమాల్ వైద్యంలాగా..! మామూలు జనానికి అర్థం కాకపోవచ్చుగాక, కానీ చదువుకున్నవాళ్లకు, ఆలోచించగలిగేవాళ్లకు ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది…

తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవ్… అని మొన్న ఎక్కడో భారీ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు కదా… ఇదీ అలాంటిదే… ఆప్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో హస్తిన గద్దెపై ఆశలతో జాతీయ రాజకీయాలు స్టార్ట్ చేసిన కేసీయార్ రైతు ఆత్మహత్యలపై చెప్పింది నిజమా..? నిజంగా తెలంగాణలో రైతులు రోజూ పండుగ చేసుకుంటున్నారా..? ఆత్మహత్యలే లేవా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో దీటుగా, బలంగా కౌంటర్ చేసే నాయకుడే లేకుండా పోయాడు… కౌంటర్ చేసినా అది జనానికి రీచ్ కాదు… ఎందుకంటే, రాష్ట్ర మీడియా చతుర్విధ ఉపాయాలతో కేసీయార్‌ అంటే భయభక్తులతో వ్యవహరిస్తోంది కాబట్టి…

ఈమధ్య రైతుల సమస్యలపై బలంగా గళం ఎత్తుతున్న రైతు స్వరాజ్యవేదిక స్పందిస్తుందని అనుకుంటే, దాన్నుంచీ అంత బలమైన కౌంటర్ రాలేదు… అప్పుడప్పుడూ కేసీయార్ పాలన విధానాలపై నిష్కర్షగా తన ఒపినీయన్ వెల్లడిస్తుందని అనుకున్న ఆంధ్రజ్యోతికి చేతకాలేదు… (ఫాఫం, దానికి రాసేవాళ్లు కరువైనట్టున్నారు…) ఏదో దిశ అనే ఓ డిజిటల్ పత్రిక, పెద్దగా జనంలోకి రీచ్ లేని వెలుగు మాత్రం అందుకున్నాయి… కేసీయార్ అబద్ధాన్ని లెక్కలతో సహా ఎండగట్టాయి… ఎలాగూ గులాబీ రంగు పులుముకున్న ఈనాడు, సాక్షి వంటి పత్రికలకు చేతకాదు… కాస్తో కూస్తో చిన్న పత్రికలే ప్రొఫెషనల్ పోకడలతో సాగుతున్నట్టున్నాయి…

Ads

kcr

తెలంగాణ విడిచిపెట్టేసి… అసలు రైతు మరణాలో కాదో కూడా నిర్ధారణ లేని కుటుంబాలకు తెలంగాణ ప్రజల డబ్బుతో చెక్కులు ఇచ్చి రావడమే విమర్శల పాలైంది కదా… బీజేపీని విధానాలపరంగా కౌంటర్ చేయలేక, ఓ స్పష్టమైన జాతీయ ఎజెండా లేక సాగుతున్న బీఆర్ఎస్ విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతు సమస్యలు అంటూ, రైతు ప్రభుత్వం అంటూ ఏదేదో మాట్లాడుతోంది… ఈ స్థితిలో తెలంగాణ మోడల్, రైతుల ఆత్మహత్యల్లేవు అనే స్టేట్‌మెంట్ నిజానికి కొద్దిగానైనా చర్చనీయాంశం అయి ఉండాలి…

ఎవరైనా మరణిస్తే రైతు బీమా కింద డబ్బులొస్తాయి… రైతు బంధు కింద డబ్బులిస్తాడు… నిజానికి వ్యవసాయాన్ని తన ప్రాణాల్ని పణంగా పెడుతున్నవాడు కౌలు రైతు… సగం మంది వాళ్లే… ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో అధికులు వాళ్లే… ఏ ప్రభుత్వ సాయం ఉండదు, ఏ ప్రభుత్వ పథకం ఉండదు… ప్రభుత్వ లెక్కల్లో అసలు కౌలు రైతు అనే పదమే ఉండదు… ‘‘పంటనష్టాలతో జరిగేవి మాత్రమే రైతు ఆత్మహత్యలుగా పరిగణించాల్సిన పనిలేదు, నమ్ముకున్న వ్యవసాయం కుటుంబ సమస్యలను తీర్చనప్పుడు జరిగేవి కూడా రైతు ఆత్మహత్యలవే’’ అన్నాడు వైఎస్… అదే నిజం…

వ్యవసాయం అంటేనే రిస్క్… నకిలీ విత్తనాల దగ్గర నుంచి మొదలై పంట అమ్మకాల దాకా ప్రతి దశలోనూ రైతును పీడించేవి తెగుళ్లు కాదు, స్వార్థపరులైన వ్యాపారులు ప్లస్ ప్రకృతి… రైతు సంక్షేమ విధానం అంటే బటన్లు నొక్కి రైతు ఖాతాల్లోకి… వ్యవసాయం చేస్తున్నా, చేయకపోయినా డబ్బు పంపించడం కాదు… నిజంగా సాగు వృత్తిలో ఉన్న రైతును ఆదుకునే ఓ వాస్తవ సంక్షేమ విధానం అవసరం… అదే లేనప్పుడు ఇక ఆత్మహత్యల్లేని రాష్ట్రం ఎలా సాధ్యమవుతుంది… కేసీయార్ మాటల్లో నిజం ఏముంటుంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions