తెలంగాణ మట్టి ప్రకటన….. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే ప్రకటనలు, ఇంగ్లీషులో రాసినవి తెలుగులోకి అచ్చు ఇంగ్లీషులాగే అనువాదం చేసే ప్రకటనలు, తెలుగే అయినా రైల్వే స్టేషన్ యంత్రం అనౌన్స్ చేసినట్లు కర్త కర్మ క్రియా పదాల అన్వయం తేలక ఇనుప గుగ్గిళ్లే నయమనిపించే ప్రకటనల గురించి లెక్కలేనన్నిసార్లు చెప్పుకున్నాం. గుండెలు బాదుకున్నాం. కంఠ శోష మిగులుతోంది తప్ప…పట్టించుకున్న పాపాత్ముడు లేడు.
భాష, భావం, అనువాదం బాగాలేని ప్రకటనల గురించి పదే పదే చెబుతున్నప్పుడు…ఎలా ఉంటే బాగుంటుందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. తెలుగులో ఆలోచించి…తెలుగులోనే రాస్తే; తెలుగువారికోసం తేట తెలుగులో రాయాలన్న స్పృహ, బాధ్యత ఉంటే ఎలా ఉంటుందో ఈ తెలంగాణ మట్టి పైపుల ప్రకటన చూడండి. మట్టి పరిమళాలతో ఎంత సహజంగా, సరళంగా, సూటిగా ఉందో! మీకే తెలుస్తుంది. ఆ ప్రకటన టెక్స్ట్ యథాతథంగా:-
Ads
“తెలంగాణ మట్టి పైపుల అసోసియేషన్
మట్టి పైపులు వాడండి
మట్టి పైపుల కనీస జీవిత కాలం 150 సంవత్సరాలు.
డ్రైనేజీకి మట్టి పైపులు వాడండి… సంవత్సరాల తరబడి నిశ్చింతగా జీవించండి.
* ఎలుకలు, పందికొక్కులు, చెదలు వీటిని ఏమీ చేయలేవు.
* మట్టి పైపులు పర్యావరణానికి అనుకూలమైనవి మరియు నాణ్యమయినవి. సంవత్సరాల తరబడి ఉపయోగించవచ్చు.
* డ్రైనేజీలో ఉండే చెడు ఆమ్ల, క్షార గుణాలను అద్భుతంగా సంవత్సరాల తరబడి తట్టుకోగలవు.
* పని త్వరగా అయిపోవాలి అనే కంగారులో డ్రైనేజీకి వివిధ రకాల పైపులు వాడుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అవి నిరుపయోగమవుతాయి.
డ్రైనేజీ వ్యవస్థకు మట్టి పైపులే మన్నికయినవి మరియు నాణ్యమైనవి.
తెలంగాణ మట్టి పైపుల అసోసియేషన్, హైదరాబాద్, తెలంగాణ”
అసోసియేషన్ పేరులోనే తెలంగాణ మట్టి వాసన మనసులో మల్లెలు పూయిస్తోంది. పైపు ఇంగ్లీషు పదమే అయినా తెలుగులో గొట్టం నీచార్థంలో ఉంది కాబట్టి మట్టి గొట్టం అనలేదు. ప్రతిమాటను కృతకంగా తెలుగులోకి అనువదించాల్సిన పనిలేదు.
కనీస జీవిత కాలం; సంవత్సరాల తరబడి; వీటిని ఏమీ చేయలేవు; పర్యావరణానికి అనుకూలమైనవి; చెడు క్షార, ఆమ్ల గుణాలకు తట్టుకుని నిలబడడం; పని త్వరగా అయిపోవాలనే కంగారు…
ఇలా ప్రకటనలో ప్రతిమాట మట్టిలా పలకరిస్తోంది. ప్రకటన మన్నికగా ఉంది వారి పైపుల నాణ్యతలా.
ఆ సబ్జెక్ట్ లో ఆవగింజంత అవగాహన లేనివారికైనా చక్కగా అర్థమయ్యేలా చెప్పకపోతే ఆ ప్రకటన నిరర్థకం. మట్టి పైపులు ఎలా పర్యావరణానికి అనుకూలమైనవో ఈ ప్రకటన శాస్త్రీయంగా నిరూపిస్తోంది.
డొంక తిరుగుడు లేకుండా, స్పష్టంగా, సరళంగా తెలుగువారికి వెంటనే అర్థమయ్యేలా తెలుగులో ఆలోచించి…తెలుగులోనే ప్రకటన రాయించిన/రాసిన తెలంగాణ మట్టి పైపుల అసోసియేషన్ కు అభినందనలు.
“అనేక సంభావ్యతలలో రుజువు కాబడ్డ మా మేలిమి విత్తనాలు”
“మా క్రిమి నాశిని మీకు పోషకం”
“మా ఎరువు ఏపుగా పెరుగుతుంది”
“ది బెస్ట్ విలువ; దృవీకరించబడిన; జరిగే హెరిటేజ్; స్వచ్ఛత యొక్క; నైపుణ్యం యొక్క; మరియు”
“మీ గమ్యాలను ప్రేమించే మా నేస్తం”
లాంటి కర్ణ కఠోర అనువాదాలు; తెలుగే అయినా తెలుగువారికి అర్థంకాని ప్రకటనలు…అనేక సంభావ్యతల్లో చదివి చదివి…క్రిమి నాశినిని పోషకాహారంగా తిని తిని…ఎరువే తనంతట తాను ఏపుగా పెరుగుతుంటే చూసి చూసి…మన గమ్యంలేని పయనాలకు వారి నేస్తాలను తోడుగా పంపితే ఆ బరువును మోసి మోసి…తెలుగు ప్రకటనల్లో ది బెస్ట్ తెలుగు విలువ ద్రవీకరణ చెందగా కన్నీరు కార్చి కార్చిన వేళల్లో…తెలంగాణ మట్టి ప్రకటన ఎండిన నేలకు పన్నీటి జల్లు. ఎడారిలో ఒయాసిస్సు. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article