గోపీచంద్… ఒకప్పుడు సెన్సేషనల్ పీపుల్స్ సినిమాలు తీసి మెప్పించిన మంచి దర్శకుడు టి.కృష్ణ కొడుకు… నటనాపరంగా మంచి మెరిట్ ఉంది తనలో… అప్పట్లో విలన్‌గా చేసి కూడా మెప్పించాడు… కానీ చాన్నాళ్లుగా వరుస ఫ్లాపులు… అసలు తన కెరీరే ప్రమాదంలో పడి, ఫీల్డులో ఉంటాడా లేడా అనే సందేహాలు వ్యాపిస్తున్న తరుణంలో కూడా ఏదో ఒక సినిమా చాన్స్ వస్తోంది, మరో ఫ్లాప్ కొడుతున్నాడు…
విలేకరులు తన దగ్గర ఓ ఆసక్తికరమైన ప్రశ్నను ముందుపెట్టారు… ‘‘గతంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, ప్రజాల సమస్యల్ని చర్చించే సినిమాలు వచ్చేవి, మీరు కూడా వాటిపై ఆసక్తి చూపించడం లేదేమిటి..?’ అనేది ఆ ప్రశ్న… దానికి గోపీచంద్ ఏమని సమాధానం ఇచ్చాడంటే…
‘‘అలాంటి కథలు వస్తే కచ్చితంగా చేస్తాను… కొన్ని కాన్సెప్ట్‌లు వినడానికి బాగుంటాయి. కానీ ఆ కథల్ని అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చి ఆసక్తికరంగా చెప్పగలిగితే ఓకే… ఒకవేళ కుదరనప్పుడు అలాంటి కథలు ముట్టుకోకపోవడమే మేలు…
Ads
మా నాన్న తరం దర్శక రచయితలంతా బయట జనాలతో ఉండేవారు… వాళ్లు జీవితాల్ని, కష్టనష్టాల్ని దగ్గరగా చూశారు… అలా చూసిన జనాల జీవితాల నుంచే కథలు తీసుకునేవారు… కానీ ఇప్పుడు అందరూ పాత సినిమాలు, ఇతర భాషల సినిమాలు చూస్తున్నారు… బయట జనాల్ని చదవడం లేదు… సమాజంలోకి వెళితే బోలెడన్ని సమస్యలున్నాయి… వాటిని సినిమా రూపంలో చూపించొచ్చు… అయితే ఆ కథలకు కొన్ని హంగులు అద్ది… రెండున్నర గంటలు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా చెప్పగలిగే చాలు… అలాంటి దర్శకులు ఇప్పుడు మన దగ్గర చాలా తక్కువ ఉన్నారు’’…
ఎస్, గోపీచంద్ చెప్పింది కొంత నిజం… మన దర్శకులు జనం సమస్యల్ని చదవడం లేదనేది కరెక్టు కాదు… వాళ్లకు అన్నీ తెలుసు… సమస్యల్ని ఎఫెక్టివ్‌గా చెప్పడమూ తెలుసు… కానీ ఎందరు నిర్మాతలు ముందుకొస్తారు ఆ సినిమాల్ని తీయడానికి..? ఏ బ్యానరైనా సరే, ఓ స్టార్ హీరో డేట్స్ తీసుకోవడం, దిక్కుమాలిన ఏదో ఓ కమర్షియల్ రొడ్డకొట్టుడు సినిమా తీసి జనం మొహాన కొట్టడం తప్ప వేరే ప్రయోగాలు ఎవరు చేస్తున్నారని..?
అంతెందుకు..? ది గ్రేట్ రాజమౌళి అంతటి కుమ్రం భీమ్ పాత్రను తీసుకుని, అల్లూరి పాత్రనూ జతచేసి ఓ సినిమా తీశాడు… మరి అందులో భీమ్ సాగించిన జల్ జంగల్ జమీన్ ఇష్యూను కనీసం ప్రస్తావించాడా..? ఏవో దిక్కుమాలిన మసాలాలు అల్లి, ఆ రియల్ హీరోల కథల్ని వక్రమార్గం పట్టించి సినిమాను వదిలాడు… జస్ట్, ఒక ఉదాహరణ ఇది… పోనీ, ఎవరైనా స్టార్ హీరో ఒక ప్రయోగానికి లేదా ఒక జనం ఇష్యూ బేస్డ్ కథ చేయడానికి ముందుకొస్తాడా..?
నాలుగు పిచ్చి గెంతులు, ఫైట్లతో సినిమా చుట్టేసి, వందల థియేటర్లలో రిలీజ్ చేసి, వారంలో మొత్తం డబ్బును వసూలు చేసుకోవడమే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు కదా… అంతెందుకు..? ఇదే గోపీచంద్ ఎందరు కొత్త దర్శకులకు చాన్సులు ఇచ్చాడు..? కొత్త కథ చేయడు, కొత్త ప్రయోగం చేయడు… ఏదో చల్తీకానామ్ గాడీ అన్నట్టు నడిపించేస్తున్నాడు… టి.కృష్ణ కొడుకుగా ఇదీ నా సినిమా అని చెప్పగలిగే ఒక్క సినిమా పేరు చెప్పగలడా గోపీచంద్… అలా చెప్పలేనప్పుడు, తెలుగు దర్శకులను నిందించడం అనేది కరెక్టు కాదు..!!
Share this Article