.
నిన్న నమస్తే తెలంగాణలో ఓ వార్త… ఆసక్తికరంగా అనిపించింది… వరంగల్ నుంచి జనరేటయింది… ఎందుకు కాస్త ఇంట్రస్టింగు అంటే…
మేడారం దగ్గర 250 కోట్లతో ఆధునీకరణ పనులు చేస్తున్నారు కదా… అక్కడ ఊరట్టం క్రాస్ (కన్నెపల్లి ఆర్చ్) దగ్గర ఉన్న ఓ నక్సలైట్ల స్మారక స్థూలం హఠాత్తుగా ఆకుపచ్చ రంగు వేసుకుని కనిపించింది… అదీ వార్త…
Ads
మరి ఎందుకు అందులో ఇంట్రస్టు అంటే..? ఒకప్పుడు ములుగు నియోజకవర్గంలోని పలు మండలాల్లోని అడవులు నక్సలైట్లకు బలమైన స్థావరాలు… చాలా ఏళ్లు హింస రాజ్యమేలింది అక్కడ… రాజ్యం వైపు నుంచి… తిరుగుబాటు వైపు నుంచి…

చాలాచోట్ల పీపుల్స్‌వార్ నక్సలైట్లు తమ పోరాటంలో అసువులు బాసిన వారి సంస్మరణార్థం స్థూపాలు నిర్మించారు… పెద్ద పెద్దవి… తరువాత అనేక స్థూపాల్ని పోలీసులు కూల్చివేయించారు… ఇప్పుడు చెప్పుకునే స్థూలం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు… అప్పటి సీఎం వైఎస్ నక్సలైట్లతో చర్చలకు సిద్ధపడినప్పుడు కట్టింది…
కూల్చివేతల నుంచి ఈ పెద్ద స్థూపం బయటపడటం విశేషమే… కానీ అసలు విషయమేమిటంటే..? అక్కడి ఎమ్మెల్యే సీతక్క… ఆమె మంత్రి కూడా… ఆ ఏరియా ఆమె అడ్డా ఇప్పుడు… ఆమెకు తెలియకుండా ఏదీ జరగదు… మరి తను కూడా ఓ నక్సలైట్ల నేపథ్యం నుంచి వచ్చిందే కదా… ఈ అరుణారుణ స్థూపం కాస్తా హరిత స్థూపం ఎలా అవుతున్నదనేది స్థానికుల ఆశ్చర్యం…
కాకపోతే ఆమెది పీపుల్స్‌వార్ నేపథ్యం కాదు… తనది జనశక్తి గ్రూపు… సరే, దాన్ని కూల్చలేదు సరే, కానీ ఈ ఆకుపచ్చ రంగు వేయడం దేనికి..? స్థూపం ఉన్నా సరే, పర్లేదు గానీ, దానికి హరితవర్ణం పులిమితే నాటి పీపుల్స్‌వార్ ఛాయల్ని, జ్ఞాపకాల్ని కప్పేయడమా..? ఆ అడవుల పచ్చదనంలో అది కలిసిపోతుందిలే అనుకున్నారా..?
ఎలాగూ నక్సలైట్ల ఉద్యమం కొడిగట్టింది కదా, ఇంకా స్మారకాలు, జ్ఞాపకాలు ఎందుకులే అనుకున్నారా..? జనం మనస్సులో నుంచి ఈ కలర్ థెరపీతో చెరిపేయడమా..? అశాంతి నుంచి అభివృద్ధి అనే సంకేత సూచనా..? ఈ ఆలోచన ఎవరిదో గానీ ఆశ్చర్యమే…

మరో వార్త కూడా ఇంట్రస్టింగే… మేడారంలో నాలుగు గద్దెలు కదా ఉండేవి… ప్రధానమైనవి సమ్మక్క, సారలమ్మ… అవి గాకుండా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు వేరు… ఇప్పుడు అక్కడ మరో గద్దె వెలిసింది… పోతరాజు గద్దె…
పోతరాజు అంటే సమ్మక్క తమ్ముడు… నాడు కాకతీయులతో యుద్ధం చేసిన సమయంలో సేనాధిపతి కూడా..! కొత్తగా వెలిసిన గద్దె దగ్గర ‘శ్రీ వనం పోతరాజు గద్దె’ (శ్రీసమ్మక్క తమ్ముడు) సేనాధిపతి’ అనే బోర్డు పెట్టారు…
(నిజానికి తెలంగాణలో పలుచోట్ల సమ్మక్క- సారలమ్మల పేరిట మినీ జాతరలు జరుగుతుంటాయి… అక్కడా మేడారంలాగే గద్దెలుంటాయి… కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోనే దాదాపు 24 చోట్ల మినీ జాతరలు జరుగుతాయి…)
మేడారంలో ఉన్న గద్దెలు ఎవరెవరివో ఓ క్లారిటీ… 1) సమ్మక్క- ఈమె తల్లి… నాయకురాలు… 2) సారలమ్మ- ఈమె సమ్మక్క బిడ్డ… 3) పగిడిద్దరాజు – తను సమ్మక్క భర్త… 4) గోవిందరాజు – తను సారలమ్మ భర్త… 5) పోతరాజు – సమ్మక్క తమ్ముడు అంటున్నారు… సమ్మక్క కొడుకు జంపన్న…
కాకతీయ సైన్యంతో జరిగిన పోరాటంలో కుటుంబాన్ని కోల్పోయానన్న బాధతో, శత్రువుకు చిక్కకూడదనే భావనతో జంపన్న అక్కడి సంపెంగ వాగులో ప్రాణత్యాగం చేస్తాడు… అందుకే దాన్ని జంపన్న వాగు అంటారు… అందులోనే మేడారం భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు… మరి సమ్మక్క…?
ఆమె కాకతీయులదే యుద్ధంలో పైచేయి కావడంతో, తీవ్రంగా గాయపడి, చిలకలగుట్ట వైపు అడవుల్లోకి వెళ్లిపోయి, అక్కడ అదృశ్యమైపోయిందని, దైవత్వంలో విలీనమైందని ఆదివాసీల విశ్వాసం...!!
Share this Article