గార్డియన్… బీబీసీలాగే ఇదీ బ్రిటన్ మీడియాయే… దీనికీ భారత వ్యతిరేకతే… బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలున్నా సరే, మారుతున్న వరల్డ్ సినేరియోలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఇండియా సహకారం అత్యవసరమే అయినా సరే… స్థూలంగా అమెరికన్, బ్రిటన్ మీడియాలు మారవు…
తాజాగా గార్డియన్ ఏదో వ్యతిరేకంగా రాసినా సరే, ఆ కథనం చదివేవారికి మోడీ పట్ల మరింత ఆదరణ పెంచేట్టుగానే ఉంది పరోక్షంగా… ఇన్నాళ్లూ మన కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటి..? మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఎడాపెడా కాల్పులు జరిపి వందల మందిని చంపేసినా సరే, పట్టుబడినా సరే, జైలులో పెట్టి కోట్ల ఖర్చుతో భద్రంగా కాపాడుతాం… పార్లమెంటు మీద దాడి చేసిన నిందితుడైనా సరే, సుప్రీం తలుపులు అర్ధరాత్రయినా సరే తెరిచి విచారిస్తాం… పాకిస్థాన్ నుంచి వందలాది ఉగ్రవాదులు తరలివచ్చి విధ్వంసాలు, ఊచకోతలకు పాల్పడుతున్నా మనమేమీ చేయలేం…
గార్డియన్ ఏం రాసిందంటే… మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక విదేశాల్లో, ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావించే వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని రాసుకొచ్చింది… 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మందిని ఇలా ఖతం చేశారని రాసింది… కెనాడాలో నిజ్జర్ హత్య భారత ఏజెంట్ల పనేనని అక్కడి ప్రధాని ఆరోపిస్తున్నాడు కదా… అమెరికా కూడా అవును సమీ అన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది కదా… అలాంటి వాదనలకు ఈ గార్డియన్ కథనం ఓ సపోర్ట్… రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) పర్యవేక్షణలో ఈ హత్యలు జరుగుతున్నాయని ఆ కథనం… సోర్స్ ఏమిటయ్యా అంటే, రా సోర్సెస్‌తోపాటు పాకిస్థానీ గూఢచార విభాగం అధికారులతో మాట్లాడి రాసినట్టు చెప్పుకుంది…
Ads
2019 పుల్వామా దాడి తరువాత ఇండియా వైఖరి మారింది… భారత వ్యతిరేక శక్తులను వాళ్ల అడ్డాలోనే హతమార్చే దూకుడు కనబరుస్తోంది, ఇజ్రాయెల్ ఏజెన్సీ మొసాద్, రష్యా ఏజెన్సీ కేజీబీలే స్పూర్తి అని రాసుకొచ్చింది గార్డియన్… మరి ఐఎస్ఐ సాగించే హత్యాకాండ, సీఐఏ ప్రపంచవ్యాప్తంగా ప్రజ్వరిల్లజేసే అరాచకం మాటేమిటి..? భారత వ్యతిరేక శక్తుల వల్ల ఇండియాలో భయం నెలకొనడం కాదు, వాళ్లు సురక్షితం అని భావిస్తున్న అడ్డాల్లోనే ప్రాణభయంతో తిరుగుతున్నారనే వార్తలు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి అనుకూలం అవుతాయి తప్ప ఈ కథనాల నెగెటివ్ క్యాంపెయిన్ ఉద్దేశం ఎలా నెరవేరుతుంది..?
యూపీలో యోగీ వచ్చాక నేరగాళ్లపై ఎన్‌కౌంటర్లు కొన్ని వేలల్లో జరిగాయి… ప్రభుత్వ ప్రతినిధులే అరాచక శక్తులకు సహకరించి, భాగస్వాములయ్యే ఆ రాష్ట్రంలో ఇదొక కొత్త పంథా.,. దాన్ని యూపీయే కాదు, భారతీయ సమాజం సమర్థిస్తోంది… లీగల్ సిస్టం నేరగాళ్లను శిక్షించలేని వాతావరణంలో ఇల్లీగల్ విధానాలు బలం పుంజుకుంటాయి… నిజమే, పుల్వామా దాడి తరువాత ఇండియా ధోరణి మారింది… అసలు సర్జికల్ స్ట్రయిక్స్ మనం ఊహించగలిగామా..? నిన్న కూడా రాజనాథ్‌సింగ్, మోడీలు చెబుతున్నారు… ఇది పాత ఇండియా కాదు, శత్రువు ఏ దేశంలో దాక్కున్నా సరే, జొరబడి మరీ ఖతం చేస్తాం అని… (ఘుస్‌కే మారేంగే…)
ఈ ఆపరేషన్లకు ప్రభుత్వ అత్యున్నత స్థాయి ఆమోదం తప్పనిసరని రా వర్గాలు చెప్పాయని గార్డియన్ రాసింది… అంటే రక్షణ, హోం, ప్రధాని తదితర ముఖ్యుల నుంచే అన్నమాట కదా… సహజంగానే ఇలాంటి ఖతం ఆపరేషన్లను ఏ దేశమూ అధికారికంగా అంగీకరించదు, మన విదేశాంగ శాఖ కూడా ఇలాంటి కథనాల్ని కొట్టేస్తుంది… 2023లోనే పాకిస్థాన్‌లో 15 మంది కీలక వ్యక్తులను భారత ఏజెంట్లు లేపేశారని ఆ దేశ గూఢచారవర్గాలే చెప్పాయట…
దుబాయ్ కేంద్రంగా ఇండియా స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసి, డబ్బు ఖర్చు చేస్తూ, ఇలాంటి హత్యలు చేయిస్తున్నదట… నిజంగా ఇండియాకు అది చేతనైతే మేలే కదా… దేశశత్రువుల మీద దూకుడుగా వెళ్లడాన్నే కదా ప్రజలు కూడా కోరుకునేది… కెనడా, అమెరికాలు నిజ్జర్ హత్య తరువాత గగ్గోలు పెట్టడంతో ఇతర దేశాల్లో హత్యలు నిలిపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు గార్డియన్ రాసింది… కానీ నిన్ననే పాకిస్థాన్‌లోనే ఓ టెర్రరిస్టును ఖతం చేసినట్టు ఓ వార్త కనిపించింది…
ఎవడో వస్తాడు, ఇక్కడి వాళ్లకే డబ్బులిస్తాడు, భారీ పేలుళ్లు… సామాన్యులతోపాటు ఆర్మీ జవాన్ల దేహాలు కూడా ముక్కలవుతాయి… వందల కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటాయి… మన మీడియా కొవ్వొత్తులు వెలిగించి, సంతాపం ప్రకటిస్తుంది… అది గతం… ఇప్పుడు ఎవడి అడ్డా ఏమిటో కనిపెట్టడం, తెలుగు సినిమా యాక్షన్ హీరోలాగా అక్కడికే వెళ్లి ఖతం కార్యక్రమం పూర్తి చేసి వెళ్లిపోవడం… ఎవరు వాళ్లు… నోబడీ నోస్… ఇది ప్రస్తుతం… కాలం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదు…!!
Share this Article