Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉత్తదే అంకెల కనికట్టు… అప్పుల ఊబి, అసాధారణ అంచనాల మాయామర్మం…

February 7, 2023 by M S R

అనుకున్నట్టుగానే… ఉద్దేశపూర్వకమో తెలియకో కానీ ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలంగాణ బడ్జెట్‌ను శాస్త్రీయంగా విశ్లేషించలేదు… అసలు ఆదాయంపై అశాస్త్రీయ, అడ్డగోలు అంచనాల్ని విప్పిచెప్పలేదు… ఏ శాఖకు ఎంతో రాసేసి పేజీలు దులుపుకున్నారు… పొలిటికల్ పార్టీల నేతలు అసలు బడ్జెట్ చదవరు, చదివినా అర్థం కాదు, అర్థమైనా ఎలా జనానికి చెప్పాలో తెలియదు… సేమ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలాగే…

ఎంతసేపూ అంకెల గారడీ అని విపక్షాలు, ప్రగతిశీల బడ్జెట్ అంటూ అధికారపక్షం పడికట్టు పదాల్ని ప్రయోగించడమే… దాదాపు ప్రతి పత్రిక ఇది రైతు బడ్జెట్ అని డప్పు కొట్టింది… ఆంధ్రప్రభ వాడయితే ఏకంగా పద్దు పంట అని హెడింగ్ వండాడు… సాక్షి, ఈనాడు కూడా అదే మాయలో పడ్డాయి… రైతు బొమ్మల్ని గీసి పాఠకులకు కన్నుగొట్టాయి… సాక్షి అంటే దాసోహం బాపతు, మరి ఈనాడుకు ఏం పైత్యం..?

లోపల పేజీల్లో నాలుగైదు పేజీల అయోమయ కథనాలు వండటం కాదు, అసలు బడ్జెట్ స్వరూపాన్ని చెప్పాలి కదా… ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకుందాం… హరీష్ ప్రసంగంలో రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ఆర్థిక స్థితి అత్యంత దయనీయంగా ఉందన్నాడు… కానీ కేసీయారే కదా బోలెడుసార్లు మనది ధనిక రాష్ట్రం, ఆర్థికంగా పటిష్టంగా ఉన్నామన్నాడు..!! విభజనవేళ తిప్పితిప్పి కొడితే 90 వేల కోట్ల అప్పు, కానీ అదిప్పుడు బడ్జెట్ రుణాలు ప్లస్ కార్పొరేషన్ రుణాలు కలిపితే అయిదారు లక్షల కోట్లు అప్పు… అదేమంటే ప్రాజెక్టుల మీద, ఉపయుక్త పనుల మీద ఖర్చు పెడుతున్నాం అంటారు…

budget

Ads

కానీ మొత్తం బడ్జెట్‌లో 2.11 లక్షల కోట్ల రెవిన్యూ వ్యయం కాగా, జస్ట్, 37 వేలు మాత్రమే పెట్టుబడి వ్యయం… అర్థమైంది కదా, ప్రాజెక్టుల మీద, ఉపయుక్త పనుల మీద పెడుతున్న ఖర్చు శాతమెంతో… మరి తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నయ్..? అది ఓ పెద్ద సబ్జెక్టు… రైతు సంక్షేమానికి పెద్ద పీట అన్నారు కదా ప్రతి పత్రిక… రుణమాఫీకి అవసరమైనది ఎంత..? కేటాయింపులు ఎంత..? అసలు దాని జోలికే పోలేదు… పంటల బీమా పరిస్థితేమిటి..? అదీ రాయలేదు… మరి రైతు బడ్జెట్, ఊరి బడ్జెట్ ఎలాగైంది..?

ఒకటీరెండు పత్రికలు ఎన్నికల బడ్జెట్ అని రాసి సంబరపడిపోయాయి… ఏం కొత్త పథకాలున్నయ్..? అసలు హామీలు ఇచ్చిన నిరుద్యోగభృతి మాటేమైంది..? గిరిజన బంధు ఏమైంది..? దళితబంధుకు గత బడ్జెట్‌లో 17 వేల కోట్లు కేటాయించారు, ఖర్చు చేయలేకపోయారు… ఈసారీ అంతే, సేమ్ డబ్బు కేటాయించారు… ఈసారీ ఖర్చు ఉండదు, ఎందుకంటే ప్రభుత్వం అంచనా వేసుకుంటున్న ఆదాయం వచ్చే మార్గాలు లేవు, అదీ చెప్పుకుందాం… డబుల్ బెడ్‌రూం మటాష్ అయిపోయింది, అసలే నామమాత్రం సాగుతున్న ఈ పథకాన్ని కొనసాగించలేక ఇప్పడిక 3 లక్షలిస్తాం, మీరే కట్టుకొండి అంటున్నారు… 3 లక్షలతో లబ్ధిదారుడు తన సొంత జాగాలో, ఆత్మగౌరవ సూచికల్లాగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టుకోవాలట… ఇలాంటివి బోలెడు…

budget

2021-22 కోసం పెట్టబడిన బడ్జెట్ పరిమాణం… 2.30 లక్షల కోట్లు… ఆడిటింగ్ పూర్తయ్యేసరికి దాని పరిమాణం… 1.83 లక్షల కోట్లు… అంటే దాదాపు 50 వేల కోట్ల మేరకు కోత… ఇప్పుడు ఇది ఏకంగా 2.90 లక్షల కోట్లకు పెరిగింది… అంటే జస్ట్ రెండేళ్లలో కాగితాలపైనే 60 వేల కోట్లు పెంచేశారు… ఇక అసలు ఖర్చు రఫ్ అంచనాల మేరకు 2 నుంచి 2.20 లక్షల కోట్లు ఉండనుంది… అంటే ఓ 70 వేల కోట్ల మేరకు కోత అంచనా వేయవచ్చు ఈజీగా…

ఆదాయం మీద సరిగ్గా అంచనాలు ఉండవా..? ఎందుకు ఉండవు..? ఆర్థికశాఖకు అన్నీ తెలుసు… కానీ బడ్జెట్ అంటేనే మసిబూసి మారేడు కాయ చేయడం… ఎలాగూ బడ్జెట్‌ను బట్టి నడుచుకోవడం అనేది ఉండదు కదా, చేతిక ఎముక లేనట్టుగా కేటాయింపులు చూపిస్తారు… తీరా ఖర్చులో అడ్డంగా చతికిలపడిపోతారు… అసలు అంత ఆదాయం ఉంటే కదా… ఉదాహరణకు… కేంద్రం నుంచి గ్రాంట్లుగా 40 వేల కోట్లు లెక్కేసుకుంటే 2021-22లో వచ్చింది ఎంతో తెలుసా..? 8,600 కోట్లు…! ఈసారీ 41 వేల కోట్లను రాసుకున్నారు… ఇంపాజిబుల్ ఫిగర్…

2021-2022లో సొంత పన్నుల ద్వారా ఆదాయం 91 వేల కోట్లు, దాన్ని ఇప్పుడు 1.31 లక్షల కోట్లు చూపిస్తున్నారు… అంటే 40 వేల కోట్లు… జీఎస్టీ సొంతంగా వేసే సీన్ లేదు, పెట్రో మండుతోంది… పొగాకు మీద లాభం లేదు, మద్యం ఇప్పటికే కిక్కు దింపేస్తోంది… ఇంకేమున్నయ్ రాష్ట్రం పెంచడానికి, వేయడానికి..? నాన్ టాక్స్ రెవిన్యూ 21-22లో కేవలం 8,800 కోట్లు, దాన్నిప్పుడు 22.8 వేల కోట్లు చూపిస్తున్నారు… కేంద్ర ఆదాయంలో వాటా 2, 3 వేల కోట్లకు మించి అదనంగా రాదు… మరి 2.16 లక్షల కోట్ల ఆదాయం ఎలా..?

మరో ఇంట్రస్టింగు… ఒకవైపు తెలంగాణ నాకివ్వాల్సిన కరెంటు బకాయిలు ఇవ్వడం లేదని గొడవ చేస్తోంది… 6 వేల కోట్ల దాకా చెల్లించాలని ఒత్తిడి వస్తున్నట్టు ఆర్థిక మంత్రే తన ప్రసంగంలో చెప్పుకున్నాడు… మరోవైపు ఇంటర్ స్టేట్ సెటిల్‌మెంట్ ఆదాయం 17,800 కోట్లు వస్తుందని బడ్జెట్ కాగితాల్లో రాసుకున్నారు… ఏపీకి తెలంగాణే బాకీ… మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్ ఇచ్చేదేమీ లేదు… పైగా చత్తీస్‌గఢ్‌కే మనం కరెంటు బకాయిలు చెల్లించాల్సి ఉంది… వాళ్లు కరెంటు సరఫరాయే ఆపేశారు… మరి 17,800 కోట్లు ఎవరు చెల్లించాలి మనకు..? ఆంధ్రప్రదేశేనా..? ఈ 17,800 కోట్లను ఎవరు తేల్చారు..? ఇలా అనేక అంశాల్లో హరీష్‌రావు గణాంకాల కనికట్టు ప్రదర్శించాడు తప్ప ఇది రియలిస్టిక్ బడ్జెట్ కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions