ఒకవైపు… కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులకు పెళ్లి చేసే స్థోమత లేక… మనస్సులు చంపుకుని, పెళ్లికొడుకు తల్లిదండ్రులు చేసే పెళ్లి మీద ఆధారపడే దురవస్థ…! మరోవైపు… ఆడపిల్లలు లేక, దొరక్క, అవసరమైతే తమ అబ్బాయిలకు అన్ని ఖర్చులతో పెళ్లిళ్లు చేస్తున్న ధోరణి… తప్పులేదు… ఆహ్వానిద్దాం… అవసరం మేరకే అయినా అబ్బాయి తల్లిదండ్రులు కాలంతోపాటు మారుతున్న తీరును స్వాగతిద్దాం…
అదేసమయంలో హిందూ వివాహ తంతు రాను రాను మోయలేని భారంగా ఎందుకు మారుతుందనే చింతన మాత్రం మన సమాజంలో లోపించింది… మన పెళ్లి తంతు ప్రక్షాళన, సంస్కరణ మాత్రం లోపించాయి సరికదా రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతులను తెచ్చుకుంటూ ‘అవాంఛనీయ ఖర్చు’ వైపు… ఆడపిల్లల తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తున్నాయి… ప్రత్యేకించి సంగీత్, హల్దీ వంటి కొత్త నార్త్ పద్ధతులను తెచ్చుకుంటున్నాం…
సంగీత్ అంటే ఇంటిల్లీపాదీ స్నేహితులు, బంధువులతో రికార్డింగ్ డాన్సులు చేస్తూ ఊగిపోవడం… దానికి ప్రత్యేకంగా డాన్స్ శిక్షకులు, ఖర్చు, స్టేజ్, అలంకరణ, భోజనాలు… ఇంకోవైపు బ్యాచ్‌లర్స్ పార్టీల పేరిట తాగడాలు, ఊగడాలు… అది వేరే ఖర్చు… గతంలో పసుపులు కొట్టడం అనేది చాలా సింపుల్‌గా జరిగిపోయేది… ఇప్పుడు హల్దీ, మంగళస్నానాల తంతు ఆడంబరంగా ఖర్చుతో వచ్చి చేరింది… భోజనాల ఖర్చు లేకపోయినా సరే, డెకొరేషన్ ఖర్చు అదిరిపోతోంది…
Ads
వన్ టైమ్ మెమరీ పేరిట ఆడంబరాన్ని, అధిక వ్యయానికీ కొందరు డబ్బులున్నవాళ్లు వెనుకాడటం లేదు… అదేమంటే మా సరదా మా ఇష్టం అని ఎదురు ప్రశ్నిస్తారు… కానీ క్రమేపీ మధ్యతరగతి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇరకాటంగా… ప్రాణసంకటంగా మారుతున్నా సరే, మనం మాత్రం మారడం లేదు… ఇదంతా ఒకెత్తు… కొత్త పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న చిత్త పైత్యాలు మరో ఎత్తు…
ఈమధ్య ఓచోట పెళ్లికొడుకుకు బీర్లతో మంగళస్నానాలు చేయించిన నిర్వాకం ఒకటి వైరల్ అయ్యింది… ఇదా సరదా..? ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లు, మంగళస్నానాలు, హల్దీలు, రిసెప్షన్లు, బ్యాచిలర్ పార్టీలతో మన పెళ్లి తంతు మోయలేని భారం అయిపోతుండగా… దానికితోడు ఈ చిత్తవికారాలు సైతం వెగటుగా మారుతున్నయ్… ‘మా దోస్త్, మా సరదా, మా బీర్’ అని సదరు బీరు స్నేహితులు సమర్థించుకోవచ్చుగాక… ఒకటీరెండు ఉదాహరణలే అయిఉండవచ్చుగాక… కానీ రాబోయే రోజుల్లో కనిపించబోయే మరిన్ని వికారాలకు ఇది సూచిక…
ఎందుకంటే… గతంలో బర్త్ డే పార్టీలకూ ఇప్పటికీ తేడా చూడండి ఓసారి… కేక్ మొహాలకు పూసుకుంటూ, బర్త్ డే బాయ్ లేదా గరల్ మీద పడి కొడుతూ నానా బీభత్సం చేస్తున్నారు… అంతెందుకు..? ఇప్పుడు పెళ్లిళ్ల కొత్త తంతులకు తోడు ప్రివెడ్ షూట్ వచ్చి చేరింది… పెళ్లి ఖర్చుల్లో ఇది మరీ ఎక్స్‌పెన్సివ్… కొందరు అబ్బాయిలు, అమ్మాయిల ప్రివెడ్ షూట్ శృతి మించుతోంది… వెకిలి, వెగటు ఫోజులతో అశ్లీలం పొంగుతోంది… ఐనా సరదా పేరిట చాలామంది సమ్మతిస్తున్నారు…
కొత్త తంతులు, పెరుగుతున్న ఖర్చులు అనేది ఒక యాస్పెక్ట్… మన పెళ్లితంతులను మనం సంస్కరించుకోలేకపోతున్నాం… పైగా నార్తరన్ పద్ధతులతో తెలుగు వివాహం పొల్యూటవుతోంది… దీనికితోడు ఇలా బీర్లతో మంగళస్నానాలు వంటి చిత్తవికారాలు కూడా జోరందుకుంటే ఇక మన పద్ధతులన్నీ నాశనం పదారుగంతలు… అనగా మరింత బురదే అని…!! అవునూ, ప్రస్తుతం మనం చేయిస్తున్న పెళ్లిళ్లలో అవసరం లేని తంతును కత్తిరించి లేదా కుదించే ప్రయత్నం ఏమైనా అయ్యవార్లు ఆలోచించారా..? విద్వత్సభలకు ఆ బాధ్యత లేదా..?! ఉత్తరాది వివాహ తంతులను ఎందుకు ఆమోదిస్తున్నట్టు..?!
మనవైన పద్ధతులు… ఒడి బియ్యం, అప్పగింతలు, ఎదుర్కోళ్లు, సారె, కూరాళ్లు, పసుపు-పిండి ఇసుర్రాళ్లతో విసిరించడం వంటివి నామమాత్రం అయిపోతూ… వచ్చినవాళ్లకు బియ్యం, జాకెట్ ముక్క, కుడుకలు ఇచ్చే ఆనవాయితీ కనుమరుగవుతూ… ఇదుగో ఈ బీర్ల మంగళస్నానాలు, ఇతరత్రా రికార్డింగ్ డాన్సుల ఉత్తరాది సంగీత్‌లు గట్రా ఆచరిస్తూ, తలపై మోస్తూ మనమే మనల్ని కలుషితం చేసుకుంటున్నాం…!! ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చెప్పినట్టుగా వివాహం జరగడం, అయ్యవార్లూ అసహాయులుగా మిగిలిపోవడం మరో అధ్యాయం…
Share this Article