Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫోన్ ట్యాపింగ్ బండ సమర్థన చాలు… ఆ డిబేట్ డొల్లతనం తేల్చేయడానికి…

April 23, 2024 by M S R

నాలుగు గంటలపాటు టీవీ9లో కేసీయార్ సాగించిన డిబేట్ అనబడే ఏకపాత్రాభినయం ఎట్టకేలకు ముగిసింది… రోజూ కేటీయార్, హరీష్ చెబుతున్నవే తప్ప ఒక్క కొత్త పాయింటూ లేదు.., తన వైఫల్యాలను, తన అక్రమాలను మొరటుగా సమర్థించుకోవడమే తప్ప… మరేమీ కొత్తగా అనిపించలేదు… ఒకటీరెండు ఉదాహరణలతో అందులోని డొల్లతనం చెప్పుకోవచ్చు… మిగతా అన్నమంతా చూడనక్కర్లేదు…

మోడీ దుర్మార్గాలు, రేవంత్ వైఫల్యాలు, కక్షసాధింపుల కేసులు గట్రా సరే… మళ్లీ ఎన్నికలొస్తే మళ్లీ నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అవుతాననే ఆశ, ఆకాంక్ష కూడా సరే… కానీ ఒక్క మాటైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాననే మాట వస్తుందని ఎదురుచూస్తే, ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను తలవంచి పోషిస్తాను అనే వ్యాఖ్య కూడా రాకపోగా… హైదరాబాద్ ప్రజలు ఇంటెలెక్చువల్స్ అట… అందుకే తమవైపు నిల్చున్నారట… గ్రామీణ ప్రాంతాల ప్రజలు అమాయకులట. మోసపూరిత హామీలకు పడిపోయారట… మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ మీద నెగటివిటీ సున్నా అట… లోక్ సభ ఎన్నికల్లో 8-10 సీట్లొస్తాయిట…

ఓ సీనియర్ పాత్రికేయ మిత్రుడు చెప్పినట్టు… ఆయన ఇంకా డినయిల్ మోడ్ నుంచి బయటకు రాలేదు… తనకు వోట్లేయని గ్రామీణ ప్రజల తీర్పును ఆమోదిస్తున్నట్టు గాకుండా ఆక్షేపిస్తున్నాడు ఆయన… గ్రామీణ ప్రజల తీర్పును అవమానించడమే ఇది… ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఆయన పిల్లిమొగ్గలు చూద్దాం… మచ్చుకు ఇదొక్కటి చాలు…

Ads

‘‘ఇంటెలిజెన్స్ కోసం రాష్ట్రాలు, దేశాలు రకరకాల పద్ధతుల్లో సమాచారం సేకరిస్తాయి (టాపింగ్ జరిగివుండొచ్చు). టాపింగ్ జరగలేదు. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఉంటేగింటే హోమ్ మినిస్టర్ కి తెలుస్తుంది. అది పోలీసులకు సంబంధించింది. పోలీసులు ఎలాంటి టెక్నాలజీ కొనుకున్నారో మాకు తెలీదు. ఎవరైనా అధికారి బియాండ్ లిమిట్స్ వెళితే శిక్షపడుతుంది. మాకేం సంబంధం. టాపింగ్ జరగలేదు. టాపింగ్ జరుగుతుంది. మేం చెయ్యం. పోలీసులు చేస్తారు. టాపింగ్ జరగలేదు. జరిగినా పోలీసుల వ్యవహారమది. ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏం చేసిన్రో, ఏం సచ్చిన్రో మాకెలా తెలుస్తుంది. అది పోలీసుల అంతర్గత వ్యవహారం. రాజకీయ అవసరాలకోసం వాడుకున్నామో లేదో మాకు తెలీదు. మల్లన్నసాగర్ దగ్గర ధర్నా కోసం ఎవరైనా ముందు తెలుస్తుంది. తప్పకుండ రిపోర్టులు అడుగుతాం…’’

ఫోన్ ట్యాపింగుతో సీఎంకు, ప్రభుత్వానికి సంబంధం లేదట… అది పోలీసుల యవ్వారమట… పోలీసులు అంటే అదేమైనా సమాంతర ప్రభుత్వమా..? అది పోలీసులు, పరిపాలనా వ్యవహారం అట… నేరస్థులను పోలీసులు ట్యాపింగ్ చేసే పట్టుకుంటారట… పోలీసులు ఏం టెక్నాలజీ కొనుక్కున్నారో తనకు తెలియదట… ఏం చేసిన్రో, ఏం సచ్చిన్రో మాకెలా తెలుస్తుంది అట..? అది పోలీసుల అంతర్గత వ్యవహారమట…

నేరస్థులను ఫోన్ ట్యాపింగుల  ద్వారానే పట్టుకుంటారట… మరి సొంత బిడ్డ కవిత, నీడలా వెంట నడిచే సంతోష్ భార్యల ఫోన్లు ఎందుకు ట్యాప్ అయినట్టు..? రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలు, ధనిక వ్యాపారులు, సినిమా హీరోయిన్లు… చివరకు గవర్నర్ ఫోన్ కూడా ట్యాపింగ్ ఎందుకైనట్టు..? వాళ్లూ నేరస్థులేనా..? ఇదంతా పోలీసుల అంతర్గత యవ్వారమా..? ఎడాపెడా వసూళ్లకు దిగారు కదా, కాపురాల్లో నిప్పులు పోశారు కదా… వాడెవడో పోలీస్ చివరకు ఫోన్ ట్యాపింగులను వాడుకుని అనేకమందిని లైంగికంగా కూడా వాడుకున్నాడట… ఓహో, సీఎం పాలనలో పోలీసులు ఏమైనా చేసుకోవచ్చునన్నమాట… ఆహా, ఏం చెబితిరి దొరవారూ… ఇక చాలు కదా, ఆ నాలుగు గంటల ఎన్నికల ప్రచారం నాణ్యత చెప్పడానికి..!!

రాధాకృష్ణ పొలిటికల్ లైన్ గురించి ఎవరికెన్ని అభ్యంతరాలున్నా సరే… తను మంచి ఇంటర్వ్యూయర్… ఇదే నాలుగు గంటలు ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఎదుట కూర్చుని ఉంటే, కథ బాగా రక్తికట్టేది… పోనీ, ఇండియాటుడే ఆప్‌‌కీఅదాలత్‌లో రజత్‌శర్మ ఐనా బాగుండేది… రాధాకృష్ణతో పోల్చడం దుస్సాహసమే గానీ రజినీకాంత్ అక్కడ జస్ట్, ముందస్తుగా స్క్రిప్ట్ ప్రకారమే ప్రశ్నలు అడిగీఅడగనట్టు, తనకు నిర్దేశించిన డిబేట్ ప్రజెంటర్ పాత్ర మొక్కుబడిగా పోషించినట్టు అనిపించింది, అంతే… టీవీ9 ఓనర్లతో కేసీయార్ సంబంధాల గురించి చెప్పుకోవడం కూడా ఇక్కడ దండుగ…

చివరగా… తనకు సొంత మీడియా ఉంది… వాటిని వదిలి వేరే చానెల్‌కు రావడం అంటే, సొంత మీడియాలో ఏది చెప్పినా జనం నమ్మరు అనే భావనే కదా… అంటే వాటిని సొంత మైకులుగా మార్చి, జనం చదవకుండా, చూడకుండా చేసిన వైఫల్యమూ తనదే కదా… పదేళ్లు ఆ టీవీ చానెల్ వైపు పోకుండా ఉన్నా… చివరకు అదే చానెల్ మెట్లు ఎక్కకతప్పలేదు కదా… అదే కాలమహిమ… కాలం ఎవరినైనా నేల మీదకు దించుతుంది… ఇదీ అంతే… ఇక్కడా అంతే…

ఏదో చానెల్‌లో వచ్చిన ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూ సారాన్ని తన సొంత మీడియా కూడా ‘‘ఒక మీడియా చానెల్ డిబేట్‌లో…’ అంటూ నిర్లిప్తంగా, నిర్వికారంగా రాసుకుని పేజీలకొద్దీ అచ్చేసుకోవాలి… గంటల కొద్దీ బిట్లుబిట్లుగా చూపించుకోవాలి… అంతేనా..? ఇన్నాళ్లూ వేరే మీడియా కంటికి ఆనలేదు, జర్నలిస్టులూ కనిపించలేదు… అందుకే కదా, సుప్రీం చెప్పినా హైదరాబాద్ జర్నలిస్టుల జాగల్ని ఇవ్వని తెంపరితనం… టైమ్ అందరికీ పాఠాలు నేర్పిస్తుంది దొరవారూ… కేసీయార్ మినహాయింపు ఏమీ కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions