రేపు విడుదల… సంక్రాంతి బరిలోకి పందెంకోళ్ల విడుదల… తన్నుకొండి… కానీ ఈరోజుకూ బయట నిర్మాతలు, బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు తన్నుకుంటున్నారు… ఆగడం లేదు… ఈ సమస్య అంతా హనుమాన్ సినిమాతో వచ్చింది… వాళ్లు స్థిరంగా నిలబడటంతో, ఎవరికీ తలవంచక, తలెత్తుకుని నిలబడటంతో వచ్చింది… బెదిరింపులకు, ఒత్తిళ్లకు తలొగ్గకపోవడం వల్ల వచ్చింది… పెత్తనాలు, అహాలతో వచ్చింది…
ఛస్, ఇదేదో చిన్న సినిమా, ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతుంది అనుకున్నారు, ఏళ్లుగా ఇండస్ట్రీలో వేళ్లు దిగిపోయినవాళ్లు… కానీ ఏం జరిగింది..? చిన్న సినిమా అనుకున్నది ఏకు మేకై భయపెడుతోంది… ఇది చివరకు మన పరువును బజారున పడేస్తుందా అనే సందేహానికి కారణమవుతోంది… ఆఫ్టరాల్, ఓ టీన్స్‌లో ఉన్న అత్యంత జూనియర్ నటుడు… తను అంతటి సూపర్ స్టార్ ప్రిన్స్‌తో పోటీయా..? ఇదీ అహం…
సిండికేట్ల పొగరుకూ, తమపై తమకున్న విశ్వాసానికీ నడుమ పోరాటం ఇది… హనుమాన్, గుంటూరుకారం సినిమాల నడుమ పోటీ భీకరంగానే ఉంది… ఈ నడుమ నలిగి అంతటి వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ మీద ఆసక్తి చూపేవాడే లేడు… హనుమాన్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది…
Ads
మిగతా ముగ్గురూ జస్ట్, తెలుగు ప్రేక్షకులకే పరిమితం… కానీ హనుమాన్ పాన్ ఇండియా ఫిలిమ్… 50, 60 అనుకుంటే ఏకంగా 600 పెయిడ్ ప్రీమియర్ల దాకా పోయిందంటే, యూఎస్‌లో గతంలో ఏ తెలుగు సినిమాకు చేతకాని రికార్డులకు వెళ్తుంటే ఇండస్ట్రీ పండితులు నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు… అది హీరో ఘనత కాదు, హీరోయిన్ ఎవడికీ తెలియదు… సినిమాలో ఏముందో కూడా ఎవడికీ తెలియదు…
ఎవరో హీరో, హనుమాన్ ఆశీస్సులు… గతంలో ఇలాంటిదే ఓ సినిమా వచ్చిందిగా, నితిన్- అర్జున్ కలిసి నటించింది… అలాంటిదేనా..? కావచ్చు, కానీ గ్రాఫిక్స్ అద్భుతంగా కుదిరాయి అంటున్నారు… మరోవైపు గుంటూరుకారం సినిమా కూడా కమర్షియల్‌గా బాగా వచ్చిందంటున్నారు… రెంటికీ దాదాపు పాజిటివ్ బజ్ వస్తోంది.,.. మిగతా రెంటిని వదిలేయండి, మరీ బాగుంటే, మౌత్ టాక్ ప్రబలితే తప్ప అవి నిలబడవు…
అన్నింటికీ మించి హనుమాన్ సినిమాకు పాజిటివ్ ఏమిటంటే… ఒకటి స్పిరిట్యుయల్ ట్రెండ్… మరొకటి ఈ చిన్న సినిమాను తెలుగు ఇండస్ట్రీ పెద్దలు తొక్కడానికి సినిమాల్లో విలన్లలాగే ప్రయత్నించడం… దాంతో సానుభూతి వచ్చిపడింది… నిర్మాతలు స్థిరంగా, బలంగా, వెన్ను వంగకుండా నిలబడి, తలెగరేసిన తీరు జనానికి నచ్చుతోంది… సినిమా కూడా అదే రేంజులో హిట్ కావాలనీ, పెద్దల మొహాలు మాడిపోవాలనీ కోరుకుంటున్నారు… జరుగుతుందా..? ఏమో చూడాలిక…
మరి సైంధవ్, నాసామిరంగ సినిమాల సంగతేమిటి అంటారా…? పర్లేదు, వెంకటేశ్ మరో బూతుల వెబ్ సీరీస్ తీసుకుంటాడు, నాగార్జునకు బిగ్‌బాస్ ఉండనే ఉంది… అందుకే సగటు తెలుగు ప్రేక్షకుడు హనుమాన్ ఓ మోస్తరుగా ఉన్నా సరే, అది హిట్ కావాలని కోరుకుంటున్నాడు… ఎవరికైనా అర్థమవుతోందా..?!
హనుమాన్ థియేటర్ల వివాదం కూడా రచ్చకెక్కుతోంది… నైజాంలోని ఆసియన్ చెయిన్ థియేటర్లలో హనుమాన్ ప్రీమియర్లు వేయడం లేదట… ఆరు థియేటర్ల అగ్రిమెంట్లు కేన్సిల్ చేశారని హనుమాన్ డిస్ట్రిబ్యూటర్ శశి ఆరోపిస్తున్నాడు… ఎహె, శశి సింపతీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఆసియన్ సునీల్ చెబుతున్నాడట… సింగిల్ థియేటర్లు కావాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడట… మొత్తానికి హనుమాన్ సినిమా ఇండస్ట్రీని కుదుపుతోంది…
Share this Article