సీఎం జగన్‌కు ప్రభుత్వ వాహనాల కాన్వాయ్ ఉంటుంది… సెక్యూరిటీ వెహికిల్స్ విడిగా ఉంటాయ్… ఇంకా కావాలంటే తన సొంత వాహనాలు ఎన్నంటే అన్ని వెంట పరుగులు తీస్తాయ్… వెంట పోలోమంటూ అనుసరించి వచ్చే నాయకులకు కూడా వాహనాలు ఉంటయ్… మరి ఎప్పుడూ సీఎం పర్యటన అనగానే కాన్వాయ్ పేరిట ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకుని ఏం చేస్తారు..? అసలు కాన్వాయ్‌కు ప్రజలు వాహనాలను సమకూర్చడం ఏమిటి..?
పోనీ, ఏదైనా సభ ఉందంటే ప్రైవేటు బస్సుల్ని, లారీల్ని, జీపులను, కార్లను నిర్బంధంగా తీసుకుని, ఏ డ్వాక్రా మహిళల్నో, కార్యకర్తల్నో తరలించడానికి వినియోగిస్తుంటారు… మరి ఇక్కడ అంత రాత్రి, తిరుపతి వెళ్లే ఓ కుటుంబాన్ని కాన్వాయ్ సమీకరణ పేరిట నడిరోడ్డు మీద వదిలేసి, డ్రైవర్‌తో సహా కారును స్వాధీనం చేసుకోవడం దేనికి..?
ఏపీలోనే కాదు, ఈ పైత్యం ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నదే… దీనికి ప్రత్యేకంగా ఉన్నతాధికారులు దిగువ స్థాయికి చెప్పాల్సిన పనిలేదు… ఎన్నేళ్లుగానో పోలీసులకు, రవాణా శాఖకు అలవాటైపోయిన తంతే… సీఎం కుర్చీలో చంద్రబాబు ఉన్నా సరే, జగన్ ఉన్నా సరే, ఇంతే… ప్రభుత్వమే ఓ పీడన యంత్రాంగంగా మారిపోయి, అధికారులే యమకింకరులైపోయి, వీళ్లకు దొరక్కపోతే చాలు అన్నట్టుగా బతికేయాల్సిందే…
Ads
విధాన నిర్ణయాల్లో తప్పులు, కుంభకోణాలు, పాలన వైఫల్యాలు కాదు… ఇదుగో ఇలాంటివే ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకతను పెంచుతాయి… ఇందులో జగన్ తప్పో, ఆ జిల్లా కలెక్టర్ తప్పో, ఆ ప్రాంత ఎస్పీ తప్పో నేరుగా ఉండదు… కానీ జనానికి అవన్నీ అక్కర్లేదు… తమ మీద దాష్టికం చూపించిన దిగువ స్థాయి సిబ్బంది వైఖరి మీద కోపం, అసహనం ప్రభుత్వం మీదకు మళ్లుతుంది…
పొద్దున్నే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజల్లో బాగా చర్చనీయాంశమైపోయిన వార్త ఇది.., ప్రభుత్వ యంత్రాంగం తీరును ఛీకొట్టారు జనం… అసలు కారును జబర్దస్తీగా తీసుకోవడం మీదకన్నా యంత్రాంగం తమ వాళ్లను కాపాడుకోవడానికి ప్రయత్నించే తీరు మరింత ఎక్కువ ఏవగింపుకి, కోపానికి కారణం అవుతుంది… ఓ కుటుంబాన్ని అలా రోడ్డు మీద వదిలేసిన వాళ్లు తప్పు చేశారు సరే, కానీ ఎవరి కోసం చేశారు..? అందుకే ఎక్కడికక్కడ హషప్ చేయడానికి ప్రయత్నిస్తారు…
వాహనాలు లాక్కుని అంతరాత్రిపూట జనాన్ని అవస్థలపాలు చేయడం ఆ ప్రాంత సీఐ గారి దృష్టికి రాలేదట… అయ్యో, అలాగా, ఇంకా ఆ ఫ్యామిలీ అక్కడే ఉందా..? ఫాఫం, రక్షక్ వాహనాన్ని పంపించి, వివరాలు తెలుసుకుంటాను అని స్పందించారట దయతో… సాధారణంగా ఇటువంటి ప్రోగ్రామ్స్‌కు దూరప్రాంతాలు వెళ్లే వెహికిల్స్ తీసుకోము అని కూడా నిజాయితీగా చెప్పిందట… ఈనాడులో ఈ వార్త రాకపోతే ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు… ఆ కుటుంబం తన అవస్థలేదో తను పడేది… తమను తాము తిట్టుకుంటూ వెళ్లిపోయేవాళ్లు… కానీ..?
ఈనాడులో మూడు కాాలాల ఫోటో వార్త రావడం, సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు వెంటనే అందుకోవడంతో ఇక ఉన్నత స్థాయిలో ఏదో స్పందించక తప్పలేదు… సీఎం సీరియస్ అయ్యాడట, సీఎంవో రంగంలోకి దిగిందట… చివరకు చేసింది ఏమిటీ అంటే..? ఒక హోంగార్డును, అక్కడి సహాయ రవాణా అధికారిని సస్పెండ్ చేశారట… ఈ సస్పెన్షన్లు ఎంతకాలమో అందరికీ తెలుసు… (ఏదో టెంపరరీ బకరాలు)…
మరీ ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఆ కారు మళ్లీ ఆ ఓనర్ దగ్గరకు చేరుతుందో లేదో, ఎప్పుడు ఏ స్థితిలో చేరుతుందో తెలియదు… ఆ కష్టాలు ఇంకా వేధిస్తాయి… ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఘోరంగా వేధించగలదో అనుభవించేవాడికే అర్థమవుతాయి… అవునూ, ఈమధ్య ఈనాడులో వచ్చిన ప్రతి వార్తను తీవ్రాతితీవ్రంగా ఖండిస్తూ ఏది నిజం..? ఇదీ నిజం..? అని కాలాలకొద్దీ ఖండన కథనాలు రాస్తున్నారు కదా… ఈ సంఘటన మీద కూడా రేపు ‘‘ఆ కుటుంబానిదే అసలు తప్పు, ఏం..? చంద్రబాబు కాలంలో జరగలేదా..?’’ అన్నట్టుగా ఏదైనా కౌంటర్ కథనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..?! ఎంతగా మారీచులు అని తిట్టిపోసినా సరే… ప్రతిపక్షాలు, ప్రతిపక్షంలా వ్యవహరించే మీడియా ఉండటం సొసైటీకి ఎంత అవసరమో అర్థమైంది కదా…!!
Share this Article