నా కారు ముందు డాన్స్ చేసినవ్, నీ స్థాయి మరిచిపోయినవా అని ఎద్దేవా చేస్తున్నాడు హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి..! అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ మాటల్ని కూడా అదుపు తప్పిస్తుందనేది నిజమే గానీ… నిజంగానే నీ కారు ముందు డాన్స్ చేసిన ఓ సాదాసీదా నీ శిష్యుడు, నీ కార్యకర్త ఏకంగా సీఎం అయ్యాడు… సో, ఆ సక్సెస్ స్టోరీలో నీకూ సంతోషం ఉండాలి కదా… ఆడిపోసుకుంటావు దేనికి..?
పోనీ, అదే బీఆర్ఎస్‌లో ఉండి ఉంటే… అదే కార్యకర్తగా మాత్రమే ఉండిపోయేవాడు కదా… అలాగే నీ కారు ముందు డాన్స్ చేసుకుంటూ కాలం గడిపేవాడు కదా… సీఎం అయ్యేవాడా..? పోనీ, నువ్వు ఏనాటికైనా బీఆర్ఎస్ నుంచి సీఎం అవుతావా..? నీ మామ, తరువాత నీ బావ… అంతే కదా…
నగరం, రాష్ట్రం మూడు దిక్కులా సముద్రం… దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు కొనుక్కోవడం వంటి మాటతూలిన రేవంత్ మీద బీఆర్ఎస్ క్యాంప్ విపరీతంగా ట్రోలింగ్ నడిపింది… రేవంత్ క్యాంపుకి ఎలా సమర్థించుకోవాలో తెలియలేదు… ఈలోపు హరీశ్ రావు ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి చాన్స్ ఇచ్చాడు… ఎప్పుడైతే కారు, రేవంత్ డాన్స్, నా శిష్యుడు అని కామెంట్స్ చేశాడో ఇక రేవంత్ క్యాంపు అందుకుంది…
Ads
ట్రంకు పెట్టె, పారగాన్ స్లిప్పర్లు, వెలమ హాస్టల్ బతుకు మరిచిపోయినవా అని దాడికి దిగింది… అప్పట్లో వైఎస్ దగ్గరకు ఎందుకు వెళ్లి కలిశావో ముందు చెప్పు అని అడిగింది… నెగెటివో పాజిటివో… ఎలాగూ కేసీయార్ ప్రస్తుతం ఫామ్ హౌజు నుంచి కదలడం లేదు, జనంలోకే రావడం లేదు కదా… బీఆర్ఎస్ వారసుడు కేటీయార్‌కన్నా హరీశ్ రావే హైలైట్ అవుతున్నాడు…
మాటకుమాట సమాధానం ఇవ్వడంలో ఆ బావాబావమరదులకు రేవంత్ రెడ్డే దీటు కదా… హరీశ్ రావు ‘కారు ముందు డాన్స్’ వ్యాఖ్యలకు… నా వెనుక నిలబడి కెమెరాల్లో కనిపించేందుకు నిక్కి నిక్కి చూసినోడివి అనే వ్యాఖ్యలకు ఇక తనే కౌంటర్ స్టార్ట్ చేశాడు… నిన్న ఎక్కడో మాట్లాడుతూ… నేను నీలాగా దొంగతనాలు చేయలేదు, చెప్పులు కొనుక్కోవడానికి కూడా చేతులు కట్టుకుని, నా ఇంటి ముందు బిచ్చమెత్తుకోవడానికి నిలబడ్డ రోజులు మరిచిపోయినవా అని తీవ్రమైన విమర్శ చేశాడు రేవంత్ రెడ్డి…
సరే, ఈ పారగాన్ స్లిప్పర్లు, వెలమ హాస్టల్, వైఎస్‌తో భేటీ, మళ్లీ అధికారంలోకి వచ్చాక కేసీయార్ దూరం పెట్టేయడం వంటివి వోకే గానీ… మరీ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర హరీశ్ రావు నిలబడటం ఏమిటి..? దేనికి..? ఎప్పుడు జరిగింది..? సీఎం సార్, అర్జెంటుగా తెలంగాణ సమాజానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీదే… మళ్లీ హరీశ్ రావు నుంచి మరింత పదునైన ఎదురుదాడి జరగకముందే ఆ క్లారిటీ ఇచ్చేస్తే బెటర్…
అలాగే కేటీయార్ జన్వాడ గెస్ట్ హౌజు గురించి ఎప్పటి నుంచో చెబుతున్నవ్, వోకే, అజీజ్‌నగర్‌లో హరీశ్ రావుకు ఫామ్ హౌజ్ ఉందని చెబుతున్నావు… వాళ్ల ఫామ్ హౌజులు కూలిపోతాయనే భయంతోనే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారనీ అంటున్నావు, సరే… ఆ ఫామ్ హౌజులు ఏ నాలాల మీద ఉన్నయ్… ఏ ఎఫ్‌టీఎల్ పరిధుల్లో ఉన్నయ్… ఏ బఫర్ జోన్లలో ఉన్నయ్..? మరి హైడ్రా నోటీసులు ఇచ్చిందా..? నిజాన్ని హైడ్రా నిర్ధారించిందా..? అవీ చెప్పాలి కదా మరి..!!
Share this Article