కాలగతిలో చాలామంది జ్యోతిష్కులు పుట్టుకొస్తుంటారు… రకరకాల పద్ధతుల్లో జోస్యాలు చెబుతుంటారు… నోస్ట్రా డామస్ దగ్గర నుంచి మన బ్రహ్మం గారి దాకా… కొందరి జోస్యాలు మాత్రమే అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తుంటాయి… నిజానికి వాళ్లు చెబుతున్నట్టుగా చెప్పబడే జోస్యాలన్నీ వాళ్లే చెప్పారో లేదో అనే డౌటనుమానాలు కూడా తరచూ వ్యక్తమవుతుంటాయి… ఇదంతా పక్కన పెడితే రష్యాలో ఇలాంటి కాలజ్ఞాని ఒకరు అర్జెంటుగా పుట్టుకొచ్చాడు…
వీళ్లందరే కాదు, మన పంచాంగకర్తలు కూడా ఈ ఏడాది ఏం జరగబోతోంది అని పంచాంగ పఠనంలో తమకు తెలిసిన జ్యోతిష పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు… నిజమైతే మన క్రెడిట్… కాకపోతే సైలెంట్… ప్రిడిక్షన్ సక్సెస్ రేటును బట్టి విద్వత్తు పరిగణన కూడా ఉంటుందట… సరే, అవన్నీ పక్కన పెడితే రష్యా కాలజ్ఞాని పేరు దిమిత్రీ మెద్వదెవ్…
ఈయన నోస్ట్రా డామస్‌కు తాత… ఈయన రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్ పర్సన్, మాజీ ప్రెసిడెంట్… అది ఆయన వృత్తి, జోస్యాలు చెప్పడం ఆయన ప్రవృత్తి… 2023లో జరగబోయే సంచలన సంగతులన్నీ చెబుతున్నాడు… ప్రపంచగతినే మార్చే పరిణామాలు… అసలే ట్విట్టర్ షేర్ వాల్యూ కుంగిపోతూ, తలపట్టుకున్న ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడట… అంతేకాదు, అమెరికాలో అంతర్యుద్ధం కూడా జరిగి కాలిఫోర్నియా, టెక్సాస్ విడిపోయి, స్వతంత్ర దేశాలుగా మారతాయట,,,
Ads
టెక్సాస్, మెక్సికోలు విలీనమైపోతాయట… ఈ అంతర్యుద్ధం అంతమయ్యాకే ఎలన్ మస్క్ మహర్జాతకం పనిచేయడం ఆరంభించి, ఎకాఎకి అధ్యక్షుడు అయిపోతాడట… ఈ విలీనాలు, విడిపోవడాలకు మరో అగ్రరాజ్యం బ్రిటన్ కూడా అతీతం ఏమీ కాదుట… అది మళ్లీ యూరోపియన్ యూనియన్‌లో చేరుతుంది… కానీ ఐర్లాండ్ విడిపోయి స్వతంత్ర దేశంగా నిలబడుతుంది… తరువాత యూరోపియన్ యూనియన్ కుప్పకూలిపోతుందట… యూరోను దేకేవాడు ఎవడూ ఉండడట వావ్… అప్పుడే అయిపోలేదు,..
చమురు ధరలు 150కు పెరుగుతాయి… పోలెండ్, హంగరీలు ఉక్రెయిన్ పశ్చిమ భాగాలను స్వాధీనం చేసుకుంటాయి… మరి రష్యా ఏం చేస్తుంది…? అది మాత్రం చెప్పలేదు, అసలే రోజులు బాగాలేవు… పుతిన్ విమర్శకులు ఇద్దరు ఇండియాలో శవాలుగా తేలారు, ఎందుకొచ్చిన రిస్క్…! (ఇప్పటికైతే మెద్వదెవ్ పుతిన్‌కు నమ్మకస్తుడే…) పోలెండ్, బాల్టిక్ దేశాలు, చెక్, స్లొవేకియా, కీవ్ రిపబ్లిక్ ఇతర పరిసర దేశాలన్నీ కలుపుకుని జర్మనీ ఫోర్త్ రీచ్ ఏర్పాటు చేస్తాయట…
ఈ నాలుగో జర్మనీ రాజ్యానికీ ఫ్రాన్స్‌కు నడుమ యుద్ధం జరుగుతుంది… ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు పతనం అవుతాయట… సరే, చదవడానికి ఆసక్తికరంగా ఉన్నా సరే, వీటిల్లో ఏ ఒక్కటీ నిజమయ్యే అవకాశాలైతే ఏ కోణం నుంచి చూసినా లేవు… అప్పుడప్పుడూ పాశ్చాత్య మీడియాలో కుట్ర సిద్ధాంతాలు కొన్ని పబ్లిషవుతుంటాయి… ఫలానా నెలలో ప్రపంచం కాలిపోతుంది, ఫలానా ఏడాదిలో ప్రళయం వచ్చేస్తుంది వంటి జోస్యాలు చెబుతుంటాయి… మన కేఏ పాల్ మాట్లాడుతున్నట్టే ఉంటాయి, కానీ పాల్ ఎప్పుడూ నిరాశావాదంలో ఉండడు… ఈ మెద్వదెవ్ ఆ కుట్ర సిద్ధాంతులను మించిన సిద్ధాంతిగా కనిపిస్తున్నాడు… పర్లేదు, ప్రపంచంలో చాలామంది బండ్ల గణేష్‌లు ఉన్నారన్నమాట…!!
Share this Article