Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు… చివరకు..!!

August 10, 2025 by M S R

.

ఐనా ఎవరికి గుర్తుంటాడులే… తన జయంతిని ఎందరు స్మరించుకుంటారులే… ఒక ఏఎన్నార్ అవుతాడు, ఒక ఎన్టీయార్ అవుతాడు అనిపించుకున్న ఓ అందాల నటుడి పుట్టినరోజు ఈరోజు… పేరు హరనాథ్… అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు… నిజంగానే ఓ దశలో చాలా పాపులర్ హీరో తను… రూపం, నటనతో మెప్పించాడు… ఎన్టీయార్‌కే సొంతం అనుకునే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లోనూ ఒప్పించాడు…

అంతెందుకు..? ఎన్టీయార్ దర్శకత్వంలోనే వచ్చిన సీతారామకల్యాణం సినిమాలో రాముడు హరనాథే… తరువాత ఎన్టీయార్ చెబితేనే భీష్మలో శ్రీకృష్ణుడి పాత్ర వరించింది… ఆ అగ్ర హీరోల తరువాత స్థానం హరనాథ్‌దే అనుకున్నారంతా… హీరోయిన్లయితే తన అందానికి ఫిదా… జమున ఏకంగా ప్రేమలో పడిపోయింది… పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంది… వాళ్లది హిట్ పెయిర్ అప్పట్లో…

Ads

ఇప్పటికీ హరనాథ్ అనగానే ‘లేత గులాబీ పెదవులతో కమ్మని మధువే తాకాలి, మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం’ అనే పాట గుర్తొస్తుంది… (పద్మనాభం దర్శకత్వం..?)… హీరోహీరోయిన్ల కెమెస్ట్రీ అంటే అప్పట్లో వాళ్లిద్దరిదే… నిజానికి తన సినిమా రంగప్రవేశమే యాదృచ్ఛికం… మనిషి అందగాడు కదా, చెన్నైలో ఎక్కడో ఓ నిర్మాత చూసి, సినిమాలో హీరో వేషం ఇస్తాను చేస్తావా అనడిగాడు… ఇతను సరే అన్నాడు… ఇంకేం… హీరో అయిపోయాడు.,.

1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాలో హరనాథ్ స్వర్ణయుగం… కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీ కృష్ణ, అమర శిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు… బోలెడు హిట్స్… అప్పట్లో జమున ఇగోకు ఎన్టీయార్, ఏఎన్నార్‌లకూ పడలేదు… ఆమెతో నటించడానికి నో అనేశారు… వాళ్లదే కదా తెలుగు సినిమా రాజ్యం… ఇక ఆమె పనయిపోయింది అనుకున్నారు అందరూ…

జమునకు హరనాథ్ దొరికాడు… తెలుగు తెరపై ఓ అందమైన జంట… హరనాథ్ అలాగే ఉంటే కెరీర్ ఉజ్వలంగా ఉండేదేమో… కానీ అలా ఉంటే విధికి పనేముంది..? హరనాథ్‌కూ ఎస్వీరంగారావుకూ దోస్తానా… ఇద్దరూ కలిసి మందుకొట్టేవాళ్లు… ఇద్దరూ ఓ సినిమాలో నటిస్తున్నట్టయితే వీళ్లు ఎప్పుడొస్తారో తెలియదు, వస్తారో లేదో తెలియదు… అలా మద్యం హరనాథ్‌ను లోబరుచుకుంది…

దాంతో నిర్మాతలు విసిగిపోయారు… అవకాశాలు సన్నగిల్లిపోయాయి… ఇదే ఎస్వీయార్ ఓ అర్ధరాత్రి జమున ఇంటికెళ్లి మరీ హరనాథ్‌ను పెళ్లిచేసుకుంటే బతుకు బస్టాండ్ అయిపోతుంది జాగ్రత్త అని తెల్లారేదాకా క్లాస్ తీసుకున్నాడట… క్రమేపీ కృష్ణ, శోభన్‌బాబు తదితరులు హరనాథ్ స్థానాన్ని ఆక్రమించేసుకున్నారు… అందమే తప్ప ఆలోచన కరువైంది… మందుచూపే తప్ప ముందుచూపు కరువైంది… ఫలితం ఏమిటంటే..? చివరకు డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు వేసేవాడు…

వృత్తిని ప్రేమించకుండా వ్యసనాన్ని ప్రేమిస్తే జరిగేది ఇదే… 1984లో చిరంజీవి నటించిన నాగు సినిమాలో హరనాథ్ అసలు డైలాగులే లేని ఓ అనామక పాత్ర పోషించాడు… దటీజ్ డెస్టినీ… ఒకప్పటి హీరోయిన్ల కలల రారాజు… తెలుగు వెండితెర ఆశాకిరణం… ఆ వ్యసనంలో పడి తెల్లారిపోయింది… 53 ఏళ్లకే లోకం విడిచిపెట్టి వెళ్లిపోయాడు..!! ‘మధువు పుట్టింది నా కోసం’ అని పాడతాడు కదా అదేదో సినిమాలో… అలాగే అనుకున్నాడు… మధువు కోసమే తను పుట్టాడు, దాన్నే ప్రేమించి లోకం విడిచిపెట్టాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
  • రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
  • ఈ తలనొప్పిని మీకు సమర్పించువారు…!
  • అటెన్షన్ చంద్రబాబు..! అమరావతి వ్యవహారం తనే పర్యవేక్షించాలి..!
  • ఐఫిల్ టవర్‌ను అర్ధచంద్రాకారంలో వొంచి వొంచి రేకులు కప్పినట్టు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions