ఒక వార్త బాగా ఆశ్చర్యపరిచింది… ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఓ నాయకుడి చివరి రోజుల్లో తనకు మిగిలిన ఆస్తులేమిటయ్యా అంటే… రేకుల పైకప్పు ఉన్న ఓ చిన్న ఇల్లు… కొన్ని పుస్తకాలు… తన హాఫ్ హ్యాండ్స్ కోటు పెట్టుకునే ఓ రేకులపెట్టె, భోజనం చేయడానికి ఓ ఇత్తడి పాత్ర…
ఆయన పేరు దామోదరం సంజీవయ్య… నిన్న ఆయన వర్ధంతి… చోటాచోటా నేతలకూ బోలెడన్ని నివాళ్లు అర్పించి, స్మరించుకుంటుంటారు కదా… మరి ఈ నిస్వార్థ, నిజాయితీపరుడైన నాయకుడికి ఏ స్మరణ దక్కింది..? నిజంగా తన జీవితం గురించి చదివితే ఇప్పటి తరం నమ్మదు… అలాంటి కేరక్టర్ తనది… కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెదపాడు ఆయన సొంతూరు… 1921లో… పుట్టిన మూడు రోజులకే తండ్రి చనిపోయాడు… ఆరోజుల్లో ఓ దళిత బిడ్డ చదువుకోవడం ఎంత కష్టమో తెలుసు కదా…
బడికి రోజూ ఏడెనిమిది కిలోమీటర్లు నడక, జొన్నరొట్టెలో ఎర్రకారం మధ్యాహ్నభోజనం… అమ్మ కష్టపడేది… బీఏ అయ్యాక పొట్టకూటి కోసం చిన్నాచితకా కొలువులు… తరువాత మద్రాస్ వెళ్లి, పార్ట్ టైం మ్యాథ్స్ చెబుతూ, లా చదివాడు… తరువాత 29 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యాడు… 31 ఏళ్ల వయస్సులోనే కేబినెట్ మినిష్టర్… 39 సంవత్సరాల వయస్సులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి… జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన దళిత నేత… కేంద్ర కేబినెట్‌లో పలు మంత్రి పదవులు…
Ads
నిజానికి తన పదవుల గురించి కాదు, చెప్పాల్సింది… వితంతులకు, వృద్ధులకు సామాజిక పెన్షన్లను ప్రవేశపెట్టిన పాలకుడు తను… ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేశాడు… మధ్యాహ్న భోజన పథకం… కార్మికులకు భరోసాగా ఈఎస్ఐ ఏర్పాటు… ఏసీబీ, ప్రొహిబిషన్ విభాగాల ఏర్పాటు… పులిచింతల, వంశధార ప్రాజెక్టులు… కార్మికులకు నెల జీతం బోనస్… ఫస్ట్ ల్యాండ్ సర్వే… ఎన్నెన్నో…
పిల్లల్లేరు, వారసుల్లేరు… ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నాడంటారు గానీ ఆ వివరాలు పెద్దగా తెలియవు… ఆయనకు చెందిన ఆ గుడిసెలాంటి ఇంటిని ప్రభుత్వం ఆయన మరణానంతరం స్వాధీనం చేసుకుంది… దాన్ని మ్యూజియం చేస్తాం, కమ్యూనిటీ హాల్ చేస్తామనే ప్రకటనలే తప్ప పట్టించుకునేవారెవరూ లేరు… జాతికి నిజాయితీతో కూడిన సేవలందించిన నాయకుడిని నిజంగా స్మరించుకున్నవాళ్లు ఎందరు..? ఇప్పటికీ తనది శిథిలావస్థలోని ఇల్లే… సో, ఒక్కసారి ఇలాంటి నాయకుల జీవితాల్ని, ఇప్పటి నాయకుల జీవితాల్ని పోల్చిచూడండి… ఎంత తేడా..?!
Share this Article