.
వార్తలు ప్రధాన పత్రికల్లో, ప్రధాన పేజీల్లో , అనగా మెయిన్ ఎడిషన్లలో ఉండవు… జిల్లా పేజీల్లో లేదా చిన్న పత్రికల్లో ఉంటాయి… అఫ్‌కోర్స్, ఈమధ్య సోషల్ మీడియా పేజీల్లో ఉంటున్నాయి… ఎందుకంటే, మెయిన్ స్ట్రీమ్ ఓ పడికట్టు, పాత ఛాందస ధోరణుల్లో పడి కొట్టుకుపోతోంది కాబట్టి… ఇదీ అలాంటిదే…
చిత్తూరు వార్త, ఆంధ్రప్రభలో… ఓ మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు… విషయం ఏమిటంటే..? కలికిరిపల్లి అనే ఊళ్లో మొన్నటి కనుమ పండుగ రోజున ఓ పెద్ద బ్యానర్… అందులో 30 మంది యువకుల ఫోటోలు, వాళ్ల వయస్సు, విద్యార్హతలు… వాళ్లు బ్రహ్మచారులు, ముదిరిపోతున్న బెండకాయలు, సారీ, ముదిరిపోయిన…
Ads
అవును, ఎంత వయస్సొచ్చినా పెళ్లి కాని ప్రసాదుల బాధ అది… భిన్నమైన ఈ కనుమ బ్యానర్ సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడా కనిపించింది… నిజానికి ఇది నవ్వులాట కాదు, రాబోయే రోజుల్లో రానున్న ఓ సామాజిక సంక్షోభానికి సంకేతం… సీరియస్ అంశమే…
మొన్న అందరూ రాశారు… చైనాలో మరింత జనాభా తగ్గింది… గత ఏడాది పుట్టిన పిల్లల సంఖ్య గతంలో పోలిస్తే మరీ మరీ తక్కువగా ఉంది… ఫర్టిలిటీ రేటు ఏటేటా పడిపోతోంది… వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ, మ్యాన్ పవర్ సంక్షోభాన్ని ఎదురుకుంటోంది…
వాస్తవంగా ఇది ఒక్క చైనా సమస్య కాదు… ఒకరు లేదా అసలే వద్దు అనే నినాదంతో బలంగా, నిర్బంధంగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన చైనా ఇప్పుడు పిల్లల్ని ఎక్కువగా కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు అంటోంది… కానీ నెవ్వర్, వినిపించుకునేవాడే లేడు… పెళ్లే వద్దు, పెళ్లయినా సరే పిల్లలొద్దు… ఇదే యువత ధోరణి…
జపాన్, రష్యా, కొన్ని తూర్పు దేశాల్లో కూడా ఇదే పంథా… యువత పెళ్లి అనే బంధంలో చిక్కుకోకూడదని అనుకుంటోంది… పెరిగిన జీవనవ్యయమే కాదు… విడాకుల ఇష్యూస్, భరణాలు, మెయింటెనెన్స్, ఇండియాలోనైతే ఫేక్ గృహహింస కేసులు, అడ్డగోలు భరణాల డిమాండ్లు… ఎహె, పెళ్లెందుకు అనే ధోరణిలోకి యువకులు జారిపోతున్నారు… ఐనా సరే పెళ్లి చేసుకుందాం అనుకునేవారిది మరో సమస్య…

అదేమిటంటే..? యువతుల కోరికలు… ఇండియానే తీసుకుందాం… బాధ్యతల బందీఖానాల్లో ఇరుక్కోవడానికి యువతులు ససేమిరా అంటున్నారు… విడాకులు తీసుకున్నవాళ్లయితే మళ్లీ పెళ్లి అనే జంజాటంలోకి పోదలుచుకోవడం లేదు… సోలో బతుకే సో బెటరూ అంటున్నారు… పెళ్లి చేసుకుందాంలే అనుకునేవాళ్లు 30 వయస్సు దాకా ఆలోచించడం లేదు…
పెళ్లయినా సరే, చిన్న చిన్న సమస్యలతో విడాకులు… ఇండియాలో విడాకుల రేటు ఏటేటా పెరిగిపోతోంది… పెళ్లి చేసుకుంటాం గానీ ఈ షరతులు అని ముందే చెప్పేస్తున్నారు… పల్లెల్లో ఉండకూడదు, పట్టణాల్లో ఉండాలి, మస్తు ఆస్తి ఉండాలి, ఆడపడుచులు లేకపోతే బెటర్, అత్తామామలు లేకపోతే మరింత బెటర్… ఇలాంటివి… యువతుల తల్లిదండ్రుల ఆలోచనలూ అలాగే సాగుతున్నాయి… వెరసి సమాజంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది…
చిన్నాచితకా జాబ్స్ చేసేవాళ్లు అక్కర్లేదు, తమకన్నా ఎక్కువ సంపాదించాలి… వ్యవసాయం చేసేవాళ్లు, ఇతరత్రా కులవృత్తుల్లో ఉన్నవాళ్లు అక్కర్లేదు… ఊళ్లో 20 ఎకరాల పొలమున్నవాడు అక్కర్లేదు, పట్టణంలో పదీఇరవై వేలకు కొలువు చేసేవాడైనా వోకే… పైగా నో చిల్ట్రన్, డబుల్ ఇన్‌కమ్ కోరికలు… DINC…
ఇక్కడే అయిపోలేదు… సొసైటీలో అక్రమ సంబంధాలు ఏ రేంజుకు పోయాయంటే… ప్రియులతో కలిసి పిల్లలను, మొగుళ్లను చంపేస్తున్న వార్తలు రోజుకొకటి కనిపిస్తున్నాయి… వర్తమానమే ఇలా ఉంటే, ఇక రేపు..? అందుకే యువకులకు భయం, యువతుల్లో పెళ్లంటే నిరాసక్తత…
ఇక్కడ మరో సమస్య… 30 దాటాక మహిళలకు గర్భధారణ సమస్యలు ఎక్కెువ… తద్వారా ఇంకా ఇంకా పెరిగిపోయే ఫర్టిలిటీ బిజినెస్… మానసిక వేదన… కొన్ని కులాల్లో సరిపడా ఆడపిల్లల్లేరు… అదీ ఓ సమస్యే… భ్రూణహత్యల పర్యవసానం…
అవును, భవిష్యత్తు మరింత గందరగోళంగా కనిపిస్తోంది... మన దేశం బలమే మ్యాన్‌పవర్ కదా... అదీ సన్నగిల్లబోతోంది... మన ఫర్టిలిటీ రేటు కూడా పడిపోతోంది... బహుపరాక్..!! ఇందులో మీడియా, సినిమాలు, సోషల్ మీడియా పాత్ర చెప్పాలంటే అదొక మహాభారతం..!!
Share this Article