ఆర్యన్ రాజేష్… పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..? ఈవీవీ పెద్ద కొడుకు… హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని బాగా ప్రయత్నించాడు ఆయన… కానీ లెగ్గు… అసలు కెరీర్ కదిలితే కదా… ఇరవై ఏళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు… ఏమాత్రం వెలగని తెలుగు వారసహీరోల్లో తన పేరూ ఉంటుంది… ఇక సినిమాలు చేయడమే మానేశాడు… తమ్ముడు అల్లరి నరేష్ కాస్త నయం… ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు గానీ, అప్పట్లో కామెడీ జానర్‌తో కాస్త నిలబడ్డాడు…
ఇలాంటోళ్లకు ఓటీటీలు మళ్లీ ఊపిరిపోస్తున్నయ్… కరిగిపోయిన కెరీర్ కలలకు మళ్లీ పదును పెట్టుకుంటూ, కొత్త ఆశల్ని నిర్మించుకుంటున్నారు… జీ5 ఓటీటీలో ఆర్యన్ రాజేష్ నటించిన హలో వరల్డ్ వెబ్ సీరీస్ చూస్తుంటే అదే అనిపించింది… సేమ్, సేమ్… ఇదే సీరిస్‌లో నటి సదా ఉంది… ఆమె కూడా 2002లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది… జయం సినిమాతో ఫస్ట్ హిట్… తరువాత అన్నీ ఢమాల్… ఇక నిర్మాతలు పలకరించడమే మానేశారు… ఏదో రెండుమూడు సీజన్ల ఈటీవీ ఢీ షోలో జడ్జిగా చేసింది… అంతే ఇక… ఇప్పుడు మళ్లీ ఈ వెబ్ సీరీస్… ఈ ఆర్యన్ రాజేష్, సదా కలిసి గతంలో ఒకటీరెండు సినిమాల్లో కలిసి చేసినట్టున్నారు…
ఇక ఈ సీరిస్ సంగతికొస్తే… కొణిెదెల నీహారిక నిర్మాత… ఫాఫం, ఆమె కథ కూడా అంతే… కథానాయికగా ఎదగాలని అనుకుంది… కానీ మెగా కుటుంబం కదా, ఆంక్షలుంటయ్… ఎక్కడేసిన గొంగళి అక్కడే అయిపోయింది… తరువాత పెళ్లి చేశారు… ఆ వైవాహిక జీవితం మీద బోలెడు రూమర్లు… ఆమధ్య అర్ధరాత్రి ఏదో పబ్బులో కనిపించి అదో రచ్చ కొన్నాళ్లు… మొత్తానికి వీళ్లంతా ఓ వెబ్ సీరీస్ చేశారు… అదీ ఎవరి కోసం..? ఇంజనీరింగ్ స్టూడెంట్లు, గ్రాడ్యుయేట్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు టార్గెట్‌గా… కంటెంట్ అదే… కథనమూ అదే… భాష అదే…
Ads
వ్యక్తిగత జీవితాల్ని పట్టించుకోకుండా కొలువులు చేస్తే ఎలా ఉంటుంది..? ఉమ్మడిగా పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి..? అని చెప్పాలనుకున్నాడు దర్శకుడు… కానీ కథాగమనంలో ఎక్కడా మెరుపులు ఉండవు… పెద్దగా మలుపులూ ఉండవు… 8 మంది పీపుల్ టెక్ అనే ఐటీ సంస్థలో కొలువుల్లో చేరతారు… ఆరు నెలల ప్రొబేషన్ తరువాత పరీక్ష పెట్టి, పాసయితేనే పర్మినెంట్ చేస్తాం అంటుంది సంస్థ… వీళ్లు హతాశులవుతారు… పరీక్షలన్నీ దాటొచ్చాక మళ్లీ ఈ పరీక్షలేమిట్రా అనుకుంటారు…
బేసిక్‌గా కథలో లోపమే ఇది… ఏ ఐటీ సంస్థయినా తనకు కావల్సిన వర్క్ కోసం శిక్షణ అంటుంది, ప్రొబేషన్ అంటుంది, నేర్పించే ప్రయత్నం చేస్తుంది… మరీ పనికిరాకపోతే వదిలించుకుంటుంది… ఓ దండం పెడుతుంది… ఐటీ సెక్టార్‌లో పర్మినెంట్ అనే పదమేముంటుంది..? (జాబ్ సంబంధ బెనిఫిట్స్ ఇవ్వటమే ఇక్కడ పర్మనెంట్ అంటే…) ప్రాజెక్టులు ఉంటే, పని ఉంటే కొలువు ఉంటుంది, లేదంటే బెంచ్, అదీ కొన్నిసార్లు ఫట్… చిన్న సంస్థలకెప్పుడూ మనుగడ పోరాటమే… ఏదో టైంపాస్ పల్లీ వ్యవహారంలా చూడటానికి ఈ వెబ్ సీరిస్ వోకే… అంతకుమించి పెద్దగా సీన్ లేదు…!!
వేరే ప్రేక్షకులు చూసినా చూడకపోయినా పెద్ద పర్లేదు అనే దర్శకుడి ధోరణి కూడా ఈ సీరిస్‌కు ఓ మైనస్ పాయింట్…!! వెబ్ సీరిస్‌ను చాలామంది దర్శకులు క్రియేటివిటీ, ప్రయోగాల కోసం అద్భుతంగా వాడుకుంటున్నారు… కొందరు ఏదో కంటెంట్ తీసుకొచ్చి ప్లాట్‌ఫామ్ నింపేస్తున్నారు… ఇది రెండో కేటగిరీ…
Share this Article