Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో అజిత్ 100 శాతం ఓ డిఫరెంట్ కేరక్టర్… ఏకంగా ఆర్మీ కంట్రాక్టే దక్కింది…

August 10, 2023 by M S R

రెండేళ్ల క్రితం మనం ముచ్చటలోనే చెప్పుకున్నాం… హీరో అజిత్ గురించి… ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మళ్లీ వచ్చినట్టుంది… ఆ పాత పోస్టు యథాతథంగా ఓసారి చదవండి ముందుగా…


అజిత్… అసలు ఈయన హీరో ఏమిటో అర్థం కాదు… ఎందుకు చెప్పుకుంటాడో కూడా తెలియదు… అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? అందులోనూ ఓ ఇండియన్ హీరో… అదీ సౌతిండియా హీరో అంటే ఏ రేంజ్ ఉండాలి… ఫ్యాన్స్ గీన్స్ హంగామా రెచ్చిపోవాలి, చచ్చిపోవాలి… కానీ తనకు ఫ్యాన్స్ సంఘాలు అధికారికంగా ఏమీ లేవు, వద్దంటూ రద్దు చేశాడు… ఏమిటయ్యా అది… అసలు ఒక హీరో అంతటి అప్రాచ్యపు పని చేయొచ్చా..?

ఫ్యాన్స్, ఏసీలు లేకపోతే హీరో అనిపించుకోరయ్యా బాబూ… అసలు ఒక సినిమా కూడా విడుదల గాకముందే ఫ్యాన్స్ ఉండే రోజులు ఇవి… నువ్వేదో తప్పుదారిన సినిమాల్లోకి వచ్చిపడ్డట్టున్నవ్… అసలు హీరో అంటే ఎలా ఉండాలి..? మాటిమాటికీ హెయిర్ టచప్, మీసాల ట్రిమ్మింగ్‌కు ఓ అసిస్టెంట్ ఉండాలి… నయా నయా ట్రెండ్ల బట్టలు ఉండాలి., అవి మడత నలగొద్దు… కారవ్యాన్ దాటి రావొద్దు… ఈయనేమిటో యాభై ఏళ్లకు వచ్చాడు… జుట్టుకు రంగు వేయడు… రఫ్‌గా అలా వదిలేస్తాడు… మేకప్ సోయి లేని ఏకైక హీరో…

Ads

ajit

పుట్టింది హైదరాబాదే… తండ్రి తమిళ బ్రాహ్మిన్, తల్లి సింధీ… ఈయన తమిళ స్టార్… చదివింది పదో తరగతి… అంతే… కానీ తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ, ఇంగ్లిషు దంచి కొట్టేస్తాడు… సొంత డబ్బింగు… ఎహె, తనకు అసలు ఈ ఇండస్ట్రీ హీరోయిజమే లేదు… దగ్గరకే రానివ్వడు… తను రియాలిటీలో హీరో… ఒక్కొక్క రీల్ హీరో ఈర్ష్యతో లోలోపల గింజుకునేంత హీరో…

ముందు ఏదో వెహికిల్ మెకానిక్… తరువాత డ్రైవర్… ఎలాంటి డ్రైవరో తెలుసా..? రేస్ కార్ల పోటీదారు… అనేక జాతీయ కార్ల రేసుల్లో పార్టిసిపేట్ చేశాడు… ఇక బైక్ రైడింగ్ అనేది తనకు ఉత్త జుజుబీ… ఆగండాగండి… ఒక్క రేసరే కాదు… మంచి షూటర్… మొన్న రెండో తారీఖు నుంచి చెన్నైలో స్టేట్ లెవల్ షూటింగ్ పోటీలు జరిగితే 900 మంది వచ్చారు ప్రొఫెషనల్ షూటర్లు… చెన్నై రైఫిల్ క్లబ్ మెంబర్ ఈ అజిత్… ఏకంగా ఆరు మెడల్స్ మెడలో పడ్డయ్… రకరకాల విభాగాల్లో ఇరగదీసేశాడు… అల్లాటప్పా ఏమీ కాదు… ఈమధ్య సీరియస్ ప్రాక్టీస్ కూడా చేశాడు…

జీవితం అంటే మొహానికి రంగు, డబ్బులు, ఆస్తులు, ఫాల్స్ ఇమేజీ అనుకునే తొక్కలో దిక్కుమాలిన హీరో కాదు తను… పోలింగ్ బూత్ వెళ్తే సిన్సియర్‌గా అందరితోపాటు అలా క్యూలో నిల్చుంటాడు… నేను ఓ హీరోను, నేను దైవాంశసంభూతుడిని అనుకుని విర్రవీగే టైపు చిల్లర హీరో కాదు… అప్పుడప్పుడూ తన ఫ్యాన్స్ పేరిట కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్‌తో సోషల్ గొడవలకు దిగితే అసలు ఆవైపు చూడడు… అలాంటివి కలలో కూడా ఎంకరేజ్ చేయను అంటాడు…

అప్పుడెప్పుడో 1993లో ప్రేమపుస్తకం అని తెలుగులో హీరో… అప్పట్నుంచి నేటికీ వెనక్కి తిరిగి చూడని హీరో… హీరా రాజగోపాల్ అనే హీరోయిన్ ఉండేది… ఆమెతో ప్రేమ, సహజీవనం… చాలాఏళ్లు గడిపారు, ఎక్కడ తేడా కొట్టిందో అకస్మాత్తుగా బ్రేకప్… తరువాత షాలినితో ప్రేమ, పెళ్లి… పిల్లలు… సినిమాల్లోనూ పిచ్చి పిచ్చి రొమాన్స్ సీన్లు, తనకు నప్పని కామెడీ సీన్లు, తిక్క తిక్క స్టెప్పుల జోలికి పెద్దగా పోడు… యాక్షన్ అంటే ఇక సీరియస్ యాక్షన్‌లోకి దిగిపోతాడు అంతే… ఎస్… అజిత్… ఒక డొల్ల హీరో కాదు… హీరో… అంతే…!!


చదివారు కదా… తను ఎంత డిఫరెంట్ అంటే… తన అడుగు పెట్టిన వ్యాపారం కూడా డిఫరెంటే… ఈ ఫోటో చూడండి…

అజిత్

అజిత్ నేతృత్వంలో దక్ష అనే సంస్థ ఒకటుంది… అది డ్రోన్ల తయారీకి పెట్టింది పేరు… దానికిప్పుడు భారత రక్షణ శాఖ కంట్రాక్టు దక్కింది… అదేమిటో తెలుసా..? మన సైన్యానికి అవసరమైన డ్రోన్లను తయారీ చేసి ఇవ్వడం… 200 డ్రోన్ల కంట్రాక్టు… మొత్తం 165 కోట్ల ప్రాజెక్టు…

వీటిని పాకిస్థాన్ సరిహద్దుల్లో నిఘాకు ఉపయోగిస్తారు… అంతేకాదు, విపత్తుల్లో సహాయ కార్యక్రమాలకు కూడా ఇవి ఉపయోగకరం… తనకు సొంతంగా డ్రోన్ల టెక్నాలజీతో పరిచయం ఉంది… గతంలో ఓ చిన్న తరహా డ్రోన్ కూడా తయారు చేశాడు… చెన్నై ఐఐటీ విద్యార్థులు కొందరు అజిత్ నేతృత్వంలో ఓ టీమ్‌గా ఏర్పడ్డారు… కరోనా సమయంలోనూ ఈ టీం తయారు చేసిన డ్రోన్లు బాగా ఉపయోగపడ్డాయి… చూశారుగా, అజిత్ ఆ సినీ మురికి కూపంలో, ప్రత్యేకించి నానా అవలక్షణాల హీరోయిజాల నడుమ మెరిసే ముత్యం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions