సిద్ధార్థ్… హీరో, నటుడు… వ్యక్తిగత జీవితంలో బోలెడన్ని వివాదాలు… వృత్తిగత జీవితంలోనూ బోలెడు ఒడిదొడుకులు… కస్తూరి, చిన్మయి, ప్రకాష్‌రాజ్, సుచిత్ర తరహాలో అప్పుడప్పుడూ కొన్ని వ్యాఖ్యలతో ట్రోలింగుకు గురవుతూ ఉంటాడు… కొన్ని నిజంగానే అపరిపక్వ వ్యాఖ్యల్లా అనిపించినా, మెజారిటీ జనానికి నచ్చకపోయినా సరే, తను మారడు…
తాజాగా టీ20 క్రికెట్‌పై ఏవో వ్యాఖ్యలు చేశాడు… ఇప్పుడు దీని మీద ట్రోలింగ్ సాగుతోంది… నిజానికి ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్ సరికాదు… అనవసరంగా సోషల్ మీడియా టార్గెట్ చేస్తోంది తనను… తన మీద బలంగా అల్లుకుని ఉన్న నెగెటివిటీయే దానికి కారణం… ఇండియన్-2 ప్రమోషన్ గురించి (ఈ సినిమాలో తను కూడా చేశాడు) ఎవరికో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనేమన్నాడు..?
‘‘ఈతరం క్రికెట్ ఫ్యాన్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్ ఎవరో తెలియదు… ఒక తరానికి ముందు గ్రేటెస్ట్ క్రికెటర్, ఇప్పుడంతా టీ20 మత్తులో మునిగి తేలుతున్నారు… అసలు అది ఆట కాదు, ఒక వినోదం… టీ20 మ్యాచులో సిక్సర్ బాదితే దేశభక్తుడు…’’ ఇలా చెప్పుకుపోయాడు… అసలు ఆ సినిమా ప్రమోషన్‌కూ ఈ సబ్జెక్టుకూ సంబంధం లేదు, ఈ వ్యాఖ్యలు మొదట అసందర్భం…
Ads
వన్‌డే, టెస్టు, టీ20… క్రికెట్‌లో రకరకాల ఫార్మాట్లు… రాబోయే రోజుల్లో టీ10, టీ5, టీ5 టూ ఇన్నింగ్స్ వంటి చాలా ట్రెండ్స్ రాబోతున్నాయి కూడా… కాలానికి తగినట్టు ఆట మారుతుంది, ప్రేక్షకుల అభిరుచీ మారుతుంది… అసలు క్రికెట్ అంటనే తీవ్రంగా ద్వేషించే జనం కూడా ఉంటారు… ఎవరి టేస్ట్, ఎవరి అంచనా వాళ్లది… అభిప్రాయాన్ని కలిగి ఉండటంలో తప్పు లేదు, దాన్ని వ్యక్తీకరించడంలో కూడా తప్పులేదు…
టెస్ట్ క్రికెట్ ఆటే గొప్ప, టీ20 అసలు ఆటే కాదు అనేది సిద్ధార్థ్ వ్యక్తిగత అభిప్రాయం, అసందర్భంగానైనా ఎక్కడో చెప్పుకున్నాడు, అందులో తప్పుపట్టడానికి ఏముంది..? మనం విభేదించవచ్చు గానీ, నీ అభిప్రాయం అలా ఉండటం ఏమిటి అని ప్రశ్నించలేం కదా… కానీ ట్రోలర్లు ఊరుకోరు కదా… ఓ పాయింట్ దొరికితే చాలు, విరచుకుపడటమే…
నీ పెళ్లిళ్లు పెటాకులు, లవ్వు యవ్వారాలు, బ్రేకప్పులు అంటూ ఎక్కడికో వెళ్లిపోయారు… (తాజాగా అదితిరావు హైదరీతో బంధంలో ఉన్నాడు, రీసెంటుగా వనపర్తి సంస్థానంలోని ఓ గుళ్లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు…) క్రికెట్ మీద సిద్ధార్థ్ అభిప్రాయానికీ తన లవ్వు యవ్వారాలకూ లింకేమిటి అసలు..? అసందర్భం, అసంబద్ధం… చూడబోతే భారతీయుడు-2 సోషల్ మీడియా రివ్యూలు కూడా సిద్ధార్థ్ పట్ల నెగెటివిటీతో ప్రభావితం అవుతాయేమో..!!
Share this Article