కేవీ గుహన్… పెద్ద పెద్ద సినిమాలకు సినిమాటోగ్రాఫర్… సీనియర్… మెరిట్ కూడా ఉంది… తను దర్శకుడిగా మారి నందమూరి కల్యాణరాంతో తీసిన 118 సినిమా కూడా పర్లేదు, బాగుంటుంది… కానీ ఎందుకో పెద్దగా ఆడలేదు… ఇప్పుడు హైవే పేరిట ఆహా ఓటీటీ కోసం ఓ సినిమా తీశాడు… అల్లు అరవింద్ దీన్ని కేవలం ఓటీటీకే ఎందుకు పరిమితం చేశాడో తెలియదు… ‘‘ఎంతొస్తే అంత’’ పాలసీతో థియేటర్లలోకి పుష్ చేస్తాడేమో అనుకున్నారు, కానీ చేయలేదు…
సినిమా విషయానికి వస్తే… ఓటీటీ ఒరిజినల్ కంటెంట్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చినట్టున్నారు… దాంతో తనకు తోచినట్టు సినిమా చుట్టిపడేసినట్టున్నాడు దర్శకుడు… (2014లో కావచ్చు, ఇదే హైవే పేరుతో హిందీలో ఓ సినిమా వచ్చింది… అలియా భట్‌కు మంచి పేరు తీసుకొచ్చింది…) నిజానికి మొదట్లో దర్శకుడు కాస్త ఇంట్రస్టుగానే మొదలుపెట్టినట్టున్నాడు… విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ను తీసుకున్నాడు…
మలయాళంలో ఈమధ్య కాస్త పేరు తెచ్చుకుంటున్న మానసను తీసుకున్నాడు… విలనీ కోసం అభిషేక్ బెనర్జీ మంచి ఎంపికే… ఇక పోలీస్ పాత్రకు తీసుకున్న సయామీ ఖేర్ కూడా పాపులర్ నటి… కథను కూడా ఓ సైకో థ్రిల్లర్ జానర్ నుంచి వెతుక్కున్నాడు… తీరా ఏమైందో… ట్రీట్‌మెంట్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా గాడితప్పింది… ఎక్కడా థ్రిల్ కలిగించకుండా సాగిపోయింది బండి… ఫాఫం, ఆనంద్‌కు మళ్లీ నిరాశ… కనీసం ఆ సయామీ ఖేర్‌కైనా కాస్త మంచి పవర్‌ఫుల్ సీన్లు రాసి వాడుకుంటే సినిమా కాస్త చూడబుల్ అయ్యేదేమో…
Ads
దర్శకుడు మరీ ఎంత లైట్ తీసుకున్నాడు అంటే… హీరో హీరోయిన్‌కు బస్సు మిస్సయితే లిఫ్ట్ ఇస్తాడు… అంతే, ప్రేమలో పడిపోతారు… పాటలు కూడా పాడేసుకుంటారు… చివరలో పులి ఎపిసోడ్ అయితే మరీ నవ్వు, జాలి పుట్టించేలా ఉంది… దర్శకుడు బహుశా ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్‌కు అప్పగించేసి ఉంటాడు…
ఓ సైకో ఉంటాడు… వరుస హత్యలు చేస్తుంటాడు… కారణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు… పోలీసులకు సహజంగానే దొరకడు… హీరోయిన్ వాడి బారిన పడుతుంది… హీరో వెళ్లి కాపాడేస్తాడు… సాధారణంగా సైకో థ్రిల్లర్ల కథలన్నీ ఇంతే కదా… ఇదీ అంతే… పదీపదిహేనేళ్లుగా ఇంతే… కానీ వీటిని ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించాలంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి, కొత్తగా ప్రజెంటేషన్ ఉండాలి… నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేయాలి…
ఇది ఏదో తెలుగు సినిమాను సాదాసీదాగా చుట్టేసినంత ఈజీ కాదు, ఈ జానరే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సింది… ప్రేక్షకుడికి కాస్త కొత్త కొత్తగా, చూస్తుంటే భయంభయంగా ఉండాలి… ఈ సినిమాలో అదేమీ లేదు… ఆనంద్‌ను వదిలేస్తే, మిగతా నటీనటుల్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోవడం… సర్లెండి, ఓటీటీ కదా, ఏదో కంటెంట్ వచ్చి చేరుతూ ఉండాలి… ఇదీ చేరింది… అంతే… ఇంకా చెప్పడానికి ఏమీలేదు… అవునూ, ప్రివెడ్ షూట్స్ కోసం వైజాగ్ నుంచి బెంగుళూరు వెళ్తుంటారా..?! అల్లు వారూ, థాంక్సండీ, థియేటర్లలో రిలీజ్ చేస్తే కొందరి పర్సులైనా గుల్ల అయిపోయేవి…!!
Share this Article