పార్ధసారధి పోట్లూరి ……. బిజేపి కి ప్రమాద సూచికలు ఇటీవలి ఎన్నికలు ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మరియు ఢిల్లీ లోకల్ బాడీ ఎన్నికలు రాబోయే లోక్ సభ ఎన్నికలకి ఒక హెచ్చరికని జారీ చేశాయని చెప్పవచ్చు. గెలిచే చోట గెలిచి, గెలవదు అన్నచోట గెలిస్తే అది విజయం అవుతుంది, అంతే కానీ గెలిచేచోట ఓడిపోయి, ఓడిపోయేచోట గెలిస్తే అది పాక్షిక విజయం !
కేవలం మోడీకి ఉన్న ఛరిష్మాతో గెలవాలి అనే ఉద్దేశ్యంతో ఉన్న రెండవ స్థాయి నాయకులకి ఈ ఎన్నికలు హెచ్చరిక అయితే బిజేపి అగ్ర నేతలకి కూడా ఒక పాఠం నేర్పాయి! అయితే తాజా ఎన్నికల ఫలితాలు కొత్తగా నేర్పే పాఠాలు ఏమీ కావు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఒకే పాఠం మళ్ళీ మళ్ళీ చెప్తూనే వస్తున్నా స్థానిక బిజేపి నేతల మైండ్ సెట్ గానీ అలాగే జాతీయ స్థాయి బిజేపి నేతల ఎన్నికల వ్యూహాల స్థాయిలో గానీ ఎలాంటి మార్పు లేదు. వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి వ్యూహాలు మారతాయి అన్న ఆశ కనుచూపు మేరలో కనపడడం లేదు.
ఇలాంటి అభిప్రాయానికి రావడానికి పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకుల అవసరం లేదు ! సామాన్యుడి తెలివితేటలతో చాలా సులభంగా తెలుసుకునే విధంగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు!
Ads
***************************************
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు:
రెండు రోజుల క్రితం వెలువడిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలని విశ్లేషించే ముందు 2017 ఎన్నికల ఫలితాలని ఒకసారి అవలోకనం చేసుకుంటే మనకి స్పష్టమయిన చిత్రం ఆవిష్కృతమవుతుంది ఇప్పుడు వెలువడిన ఫలితాల గురించి.
2017 లో జరిగిన ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో మొత్తం వార్డ్ సీట్లు: 272.
బిజేపి గెలిచిన సీట్లు :181. ఓటింగ్ శాతం 36.8%. 2017 కి ముందు జరిగిన ఎన్నికలలో బిజేపి గెలుచుకున్న సీట్లు 138 అంటే 43 సీట్లు ఎక్కువ గెలుచుకున్నది అన్నమాట.
2022 ఎన్నికల ఫలితాలు: బిజేపి గెలుచుకున్నవి 104. అంటే 77 సీట్లు నష్టపోయింది బిజేపి.
***************************
AAP 2017 లో : 49 సీట్లలో గెలుపొందింది కానీ 2017 కి ముందు AAP MCD ఎన్నికలలో పాల్గొనలేదు కానీ గెలుచుకున్న 49 సీట్లు లాభమే. అదే 2022 లో 134 సీట్లలో గెలిచింది అంటే లాభం 85 సీట్లు అన్నమాట…
ప్రధానమంత్రితో పాటు బిజేపి అగ్ర నాయకులు ఉండే ఢిల్లీలో బిజేపి స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోవడం హెచ్చరిక లాంటిది. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఆయా స్థానాలలో ఉన్న సమస్యల మీద ప్రజలు ప్రతిస్పందిస్తారు కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు అని అనుకుంటే అంతకంటే పెద్ద ఆత్మవంచన ఇంకొకటి ఉండదు.
ఢిల్లీలో మునిసిపల్ ఎన్నికలు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీని చూసి ప్రజలు వోట్లు వేస్తారనే భరోసాతో స్థానిక కార్పొరేటర్లు ప్రజా సమస్యల పట్ల ఉదాసీనంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చాయి MCD ఎన్నికలు.
గతంలో కాంగ్రెస్ కి ఉన్న వోట్ శాతం AAP వైపు మళ్ళింది అనుకుంటే అది ఇంకో పెద్ద పొరపాటు. కాంగ్రెస్ వోట్లతో పాటు బిజేపి వోట్లని కూడా AAP తన వైపు మళ్లించుకుంది. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం ప్రధాన భూమిక పోషించలేదు అన్నది స్పష్టం అవుతున్నది. కేవలం 140 కోట్ల ప్రజాధనం కోల్పోవడం అన్నది ఢిల్లీ ప్రజల దృష్టిలో పెద్దదిగా అనిపించలేదు, కనిపించలేదు. పైగా లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు సాధించింది 20% మాత్రమే. అదీ సాగదీస్తూ వెళ్ళాయి తప్పితే వెంట వెంటనే ఫలితాలు రాబట్టలేకపోయింది సిబిఐ కానీ ED కానీ! మొత్తంగా చూస్తే ఢిల్లీ వోటర్లు లిక్కర్ కుంభకోణంని పెద్దగా పట్టించుకోలేదు.
ఢిల్లీ అల్లర్లు కానీ, రోడ్లు బ్లాక్ చేసి చేసిన ఆందోళనలని, వాటి వెనుక AAP హస్తం ఉన్నదని తెలిసినా పట్టించుకోలేదు వోటర్లు. మాకు ఎలాంటి ‘’ఉచితాలు’’ ఇస్తారో చెప్పండి అంతే కానీ మీరెంత తింటున్నారో మాకు అనవసరం అన్న చందాన ఉన్నారు ఢిల్లీ వోటర్లు. ఇదే తరహా వచ్చే అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో కూడా కొనసాగుతుంది ఢిల్లీ వరకు. ఏం చేయాలో ఇప్పటి నుండే ఆలోచించి ఆ దిశగా కార్యాచరణ మీద దృష్టి పెట్టకపోతే ఢిల్లీ చుట్టుపక్కల బిజేపికి ఓటమి తప్పదు ఇది నిజం !
సర్ది చెప్పుకోవడానికి 5 లక్షల మంది రోహింగ్యా ఓటర్లు ఉన్నారు కాబట్టి AAP గెలిచింది అని అనేవాళ్ళకి దానికి విరుగుడు ఎందుకు కనిపెట్టలేకపోయింది బిజేపి ?
********************************
హిమాచల ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు:
వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వని ఆనవాయితీని కలిగి ఉన్న హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ! షరా మామూలుగానే అక్కడి బిజేపి ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వలేదు అని సరిపెట్టుకోవాలి ? కానే కాదు బిజేపికి రెండోసారి కూడా అవకాశం ఇచ్చేవాళ్లే హిమాచల్ వోటర్లు, కానీ ఆ అవకాశం లేకుండా చేస్తుకున్నది అక్కడి స్థానిక బిజేపి రాష్ట్ర నాయకత్వం.
1. ప్రస్తుత బిజేపి జాతీయ అధ్యక్షుడు అయిన JP నడ్డా స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.
2. హిమాచల్ ప్రదేశ్ లోని బిజేపి నాయకత్వం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గంకి బిజేపి జాతీయ అధ్యక్షుడు jp నడ్డా మద్దతు బలంగా ఉంది. మరోవైపు మరో వర్గానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మద్దతు ఉంది. ఇలా రెండు వర్గాలుగా మారి తన్నుకు చావడం హిమాచల్ ప్రదేశ్ లో బిజేపి ఓటమికి కారణం అయ్యింది.
3. ఈ రెండు వర్గాలు కాకుండా ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మరో వర్గం !
4. బిజేపి జాతీయ నాయకత్వం ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నే మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది.
5. కానీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ శ్రమ వల్లనే హిమాచల్ లో బిజేపికి గట్టి మద్దతు దొరికింది కాబట్టి తన తండ్రికే హిమాచల్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టాడు…
6. కానీ బిజేపి జాతీయ నాయకత్వం మాత్రం ప్రేమ కుమార్ ధుమాల్ రాజకీయాల నుండి రిటైర్ అయ్యే వయసు కాబట్టి ప్రేమ్ కుమార్ కు బిజేపి టికెట్ కూడా ఇవ్వలేదు. దాంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి ఆయన తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ బిజేపిలో అసమ్మతి చిచ్చు రాజేశారు.
7. ఫలితంగా రెబెల్ అభ్యర్ధులు బిజేపికి వ్యతిరేకంగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ లో బిజేపి రెబెల్ అభ్యర్ధులు 21 మంది తయారయ్యారు. మరోవైపు మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య వచ్చేసి 68. అంటే మూడో వంతు మంది బిజేపికి వ్యతిరేకంగా పనిచేశారు అన్నమాట. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కో నియోజక వర్గానికి లక్ష మంది వోటర్లు మాత్రమే ఉన్నారు యావరేజ్ గా లెక్కిస్తే. కాబట్టి గెలుపు ఓటమిని నిర్ణయించేది కొద్ది మంది వోటర్లు మాత్రమే.
8. మరో వైపు కాంగ్రెస్ మాత్రం సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని పాటించి ఈసారి కాంగ్రెస్ కి వోటు వేయమని అభ్యర్ధించారు వోటర్లని. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం ముఖ్యమంత్రి ఎవరూ అన్నది అధిష్టానానికి వదిలేసి, ఎన్నికల్లో కష్టపడి పని చేయండి అని పిలుపు ఇచ్చారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకి.
9. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వాగ్దానాల కంటే బిజేపిలోని వర్గ పోరే బిజేపి ఓటమికి కారణం అయ్యింది. దీనికి బాధ్యత వహించాల్సింది బిజేపి జాతీయ అధ్యక్షుడు jp నడ్డా ! తన స్వరాష్ట్రంలో తన ఆధిపత్యం కోసం ప్రాకులాడి చివరికి గెలిచే అవకాశం ఉన్నా దానిని అందిపుచ్చుకోలేక పోయాడు నడ్డా. 21 మంది రెబెల్ అభ్యర్ధులు బిజేపికి వ్యతిరేకంగా పనిచేసిన విధానం వల్ల బిజేపి నష్టపోయింది తప్పితే ఇందులో కాంగ్రెస్ ఘనత ఏమీలేదు !
10. ఒక్కో నియాజకవర్గంలో లక్షకు మించి వోటర్లు ఉండరు కానీ వీళ్లలో వోట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ? వేసిన వాళ్ళలో తిరుగుబాటు అభ్యర్ధుల వల్ల కలిగే నష్టం ఎంత ? కొంతమంది బిజేపి అభ్యర్ధులు 1000 వోట్ల లోపు మెజారిటీతో వోడిపోయారు అంటే రెబెల్ అభ్యర్ధులు బాగానే ప్రభావం చూపించారు కదా ?
11. బిజేపికి 21 మంది రెబెల్ అభ్యర్ధులు ఉంటే అదే కాంగ్రెస్ కి 6 గురు రెబెల్ అభ్యర్ధులు ఉన్నారు. ఒక్కో రెబెల్ అభ్యర్ధి స్వతంత్రంగా పోటీ చేసి కనీసం 2 వేల వోట్లు చీల్చగలిగారు అంటే బిజేపి అభ్యర్ధులు చాలా వరకు 1000 వోట్ల లోపే ఓడిపోయారు. చాలా క్లియర్ పిక్చర్ ఇది.
బిజేపి కేంద్ర అధినాయకత్వం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. స్వయానా బిజేపి జాతీయ అధ్యక్షుడే హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ వోటమికి కారకుడు అయ్యాడు.
హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు : కాంగ్రెస్ 40, బిజేపి 25,ఇతరులు 3.
*******************************
గుజరాత్ ఎన్నికల ఫలితాలు 2022:
గుజరాత్ శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. బిజేపి గెలుస్తుంది అని అంచనాలు ఉన్నాయి కానీ బొటాబొటి మెజారిటీ వస్తుంది అని అనుకున్నారు. గుజరాత్ లో కూడా అసమ్మతి సెగలు ఉన్నాయి బిజేపి పార్టీలో. కొంతమందిని పార్టీ నుండి సస్పెన్షన్ కూడా చేశారు. కానీ ఫలితాలు మాత్రం ఆశ్చర్యపరిచేలా వచ్చాయి.
1. గుజరాత్ లో మోడీజీ వేసిన పునాదులు చాలా పటిష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎవరు అనేది గుజరాత్ ప్రజలు చూడలేదు.
2. గుజరాత్ ప్రజలకి కేజ్రీవాల్ ఇచ్చిన ఉచిత హామీలు ఎవరూ పట్టించుకోలేదు.
3. చివరికి మొర్బీ లో బ్రిడ్జ్ కూలినా దానిని స్థానిక మునిసిపల్ అధికారుల అవినీతిగానే చూశారు తప్పితే అది బిజేపి ప్రభుత్వ వైఫల్యంగా చూడలేదు అందుకే అక్కడ బిజేపి అభ్యర్ధి విజయం సాధించారు.
4. డబుల్ ఇంజిన్ [కేంద్రంలో, రాష్ట్రంలో బిజేపి ] విధానం మీద నమ్మకం ఉంచారు గుజరాత్ ప్రజలు.
5. ప్రధానంగా గుజరాత్ అభివృద్ధి మీదనే అక్కడి ప్రజలు దృష్టి పెట్టారు తప్పితే ఇతర విషయాలని పట్టించుకోలేదు.
6. కాకపోతే కాంగ్రెస్ వోట్ బాంక్ ని మాత్రం కేజ్రీవాల్ తన వైపుకి తిప్పుకోగలిగాడు కానీ బిజేపి వోట్ బాంక్ మీద ప్రభావం చూపలేకపోయాడు. ఇది బిజేపికి కలిసివచ్చిన అంశం.
గుజరాత్ లో బిజేపి కి 156 సీట్లు వస్తాయని ఊహించలేదు అంటే అక్కడ ఇంకా మోడీ ఫాక్టర్ సజీవంగా ఉందనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా కృత్రిమ హంగామా సృష్టించిన ఉత్తర ప్రదేశ్ లోని ‘హాత్రాస్ ‘ లో కూడా బిజేపి విజయం సాధించింది.
కేవలం మోడీ మీద భారం వేయకుండా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వంతుగా కృషి చేస్తే తప్పితే వచ్చే లోక్ సభ ఎన్నికలు కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది బిజేపికి. హిమాచల్ ప్రదేశ్ బాటలో ప్రస్తుతం కర్ణాటక ఉన్నది అని చెప్పవచ్చు. ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఎన్నికల వరకు ఆగకుండా ఒక బలమయిన ముఖ్యమంత్రిని కర్ణాటకలో నియమిస్తే తప్ప కర్ణాటకలో కూడా గట్టెక్కడం కష్టం.
ఇక హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా ముఖ్యమంత్రి పదవి కోసం విపరీతమయిన పోటీ ఉంది. దానితో పాటు బలమయిన అసమ్మతి కూడా ఉంది కాబట్టి వాళ్ళంత వాళ్ళు బిజేపి పంచన చేరే వరకు ఆగి, ఆ తరువాత అక్కడ బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిది కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టే అవకాశం ఉంది. బహుశా ముందు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు బిజేపి జాతీయ అధ్యక్షుడు jp నడ్డా మీద కూడా చర్య తీసుకోవాలి లేకపోతే కాంగ్రెస్ లాగానే బిజేపి వర్గ పొరుకి నిలయంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంటి పోరుని ఎన్నాళ్ళని దాచగలరు ఎవరయినా ?
Share this Article