Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… మహారాష్ట్ర సంక్షోభం వెనుక ఇంత కథ ఉందా..?!

June 23, 2022 by M S R

మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… శివసేన అధినేతపై తిరగబడి, సర్కారును కూల్చేయబోతున్న నాయకుడు… పార్టీ ఫిరాయింపుల వేటు పడకుండా ఉండాలంటే, తదుపరి ఆట ఆడాలంటే తనకు 37 మంది ఎమ్మెల్యేలు కావాలి… శివసేన బలం 55… మరి 37 మంది ఉన్నారా, సేఫ్‌ గేమ్ ఆడగలడా లేదానేది వదిలేస్తే… ‘‘బాల్ ఠాక్రే హిందుత్వను వదిలేసినందుకే మేం బయటికి వచ్చేశాం’’ అని చేసిన ప్రకటన నిజమేనా..?

పార్టీ కేడర్‌కు ఠాక్రే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన వివరణలోనూ ప్రధానమైన పాయింట్ హిందుత్వే… ఒక కోణంలో ఇది కరెక్టు… ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జతకట్టాక ఠాక్రే హిందుత్వను వదిలేయడమే కాదు, దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు… నిజానికి హిందుత్వ అనేదే శివసేన బలం, బలహీనత… దాన్నే వదిలేస్తే ఇక శివసేనకూ ఎన్సీపీకి తేడా లేదు… పైగా మొన్నటి ఎన్నికల్లో ఇదే శివసేన కేడర్ ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో తలపడింది… ఇప్పుడు కలిసి స్వార్థ కాపురం చేయాల్సి వస్తోంది…

ప్రజలు వోట్లేసిన కూటమి కాదు ఇది… ఎన్నికల అనంతరం అధికారం కోసం ఏర్పడిన కూటమి… కేవలం ఠాక్రేకు సీఎం పదవి అనే పాయింట్ దగ్గరే బీజేపీ, శివసేన విడిపోయాయి… అసలు శివసేనను లేకుండా చేసి, మొత్తం హిందుత్వకు ఛాంపియన్‌ అవుదామని బీజేపీకి కూడా ఉంది… కానీ కుదరడం లేదు… ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటే ప్రజాభిప్రాయానికి భిన్నంగా జరిగింది… అయితే ఏకనాథ్ చెప్పినట్టు హిందుత్వే అసలు కారణమా..? కాదు..!

Ads

eknath

ఏకనాథ్ తిరుగుబాటుకు కూడా అధికారం, అహం, ఆధిపత్య సమస్యలే కారణం… దీనికి బాధ్యుడు ఠాక్రేయే… తనకు పాలన తెలియదు, పార్టీ వ్యవహారాలపైనా గ్రిప్ లేదు… అప్పాజీలాగా పూర్తిగా సంజయ్ రౌత్ మీద ఆధారపడుతున్నాడు… తను మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా నమ్మదగిన వ్యక్తి కాదు… ఆమధ్య ఈడీ కూడా తన మీద కన్నేసింది… తన తండ్రిలాగా ఠాక్రే పార్టీ నాయకులకు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదు… చాలారోజులుగా పార్టీ యాక్టివిటీ లేదు… పార్టీ కేడర్‌లో ఓరకమైన నిస్తేజం అలుముకుంది… ఇది సహజంగానే పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా ఓరకమైన అభద్రతకు దారితీస్తోంది…

పార్టీలో, ప్రభుత్వంలో సంజయ్ పెత్తనం బాగా పెరిగిపోయింది… పవార్‌తో అనే సంధానకర్త… దీంతో సంజయ్ ఆడింది ఆట… ఇప్పుడు పార్టీ తరఫు కీలక ప్రకటనల్ని, చివరకు రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయని, అసెంబ్లీ రద్దు జరగవచ్చునని కూడా తనే వెలువరిస్తున్నాడు… పార్టీ పత్రిక సామ్నా తన చేతుల్లోనే ఉంది… మాట చెల్లుబాటు దృష్ట్యా పార్టీ నేతలు సంజయ్ చెప్పినట్టు వినకతప్పడం లేదు…

ఈనేపథ్యంలో మొన్నామధ్య ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఓ భేటీలో సంజయ్ ఏకనాథ్ షిండేను పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ముందే తూలనాడాడు… అనుభవం, తెలివి లేని డ్రైవర్ అన్నాడు… (ఏకనాథ్ మొదట్లో ఆటో డ్రైవర్…) థానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిపి పోటీ చేద్దామని డిక్లేర్ చేసేశాడు సంజయ్… అది బీజేపీకి పట్టున్న కార్పొరేషన్… పరాభవంతో ఆ భేటీ నుంచి ఏకనాథ్ వెళ్లిపోయాడు… దీనికితోడు ఠాక్రే కొడుకు, రాజకీయ వారసుడు ఆదిత్య ఠాక్రే కూడా ఏకనాథ్‌ను పక్కన పెట్టేశాడు… ఏకనాథ్ పరిధిలోని ముఖ్యమైన ఫైళ్లు, ప్రాజెక్టులు తమకు తెలియకుండా క్లియర్ కావద్దని ఆంక్షలు పెట్టారు…

(బాల్ ఠాక్రే ప్రధాన అనుచరగణంలో ఏకనాథ్ కూడా ఉండేవాడు… 2014లో కొన్నాళ్లు అపోజిషన్ పార్టీ లీడర్ తను… మొన్నటిదాకా పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్… 14 క్రిమినల్ కేసులు… ఓసారి 40 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది… అలాంటి తను ఇప్పుడు ఏమీకాకుండా పోవడంపై ఏకనాథ్ రుసరుస… బుసబుస…)

సంజయ్ పెత్తనం పెరిగి, తనను పక్కన పడేస్తున్న తీరుతో ఏకనాథ్ లోలోపల రగులుతున్నాడు కొన్నాళ్లుగా… అసలే దూకుడు ఎక్కువ… బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో స్నేహం ఉంది… అదును కోసం చూస్తున్నారు… ఎమ్మెల్యేలతో సంప్రదింపులు సాగుతున్నాయి… ఠాక్రేకు కళ్లూచెవులూ లేవు… తనేమో గుడ్డిగా, పూర్తిగా నమ్మిన సంజయ్ టోటల్లీ ఫెయిల్… ఫడ్నవీస్, ఏకనాథ్ కలిసి ఏం చేస్తున్నారో, చివరకు ఏం జరుగుతున్నదో అంత భారీ ముదురు రాజకీయవేత్త పవార్ కూడా పసిగట్టలేకపోయాడు… ఏకనాథ్, ఫడ్నవీస్ కలిసి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి కొన్ని వోట్లను క్రాస్ చేయించారు… ఇప్పుడిక ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు… అంతేతప్ప… ఇదేమీ కేవలం హిందుత్వ కారణంగా జరిగిన సైద్ధాంతిక తిరుగుబాటేమీ కాదు… ఇది కూడా పవర్ గేమ్… వెరసి సంజయ్ రౌత్ కారణంగా మునుగుతున్న శివసేన టైటానిక్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions