Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప

July 14, 2023 by M S R

History Repeats: కళ్లున్నందుకు చూసి తీరాల్సిన శిల్పం రామప్ప.
తెలుగువారు అయినందుకు వెళ్లి తీరాల్సిన గుడి రామప్ప.
చేతులున్నందుకు తాకి పరవశించాల్సిన శిల్పం రామప్ప.
గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప.

ప్రాణమున్న మనుషులకన్నా శిలలే నయమన్న శిల్పి సృష్టిని అర్థం చేసుకోవడానికి కలియతిరగాల్సిన గుడి రామప్ప.
సూది మొన మోపినంత శిలను కూడా వదలకుండా ఒళ్లంతా కళ్లు చేసుకుని చూడాల్సిన శిల్ప సంపద రామప్ప.
భూకంపాలను తట్టుకోవడానికి పునాదిలో పునాది లోతు ఇసుకను పరచి, ఇసుక రేణువులపై మొలిపించిన నల్లటి కృష్ణ శిల పిలిచే వేణు గానం వినడానికి వెళ్లాల్సిన చోటు రామప్ప.

గోపురం బరువు ఆలయం మీద పడకుండా ప్రకృతి సిద్ధమయిన తేలిక ఇటుకలను పేర్చిన నిర్మాణ నైపుణ్య గోపురం రామప్ప.
ఆలయంలో కొలువయిన శివుడు వెనక్కు వెళ్లి, ఆలయాన్ని చెక్కిన శిల్పి రామప్పను ముందు నిలిపిన అద్భుతం రామప్ప.

Ads

ఎర్రటి స్తంభాల్లో నల్లటి శిల్పాలు నాట్యమాడే మంటపాలు రామప్ప.
కను విప్పి చూసే నందిని కనురెప్ప వేయకుండా చూడాల్సిన ఆశ్చర్యం రామప్ప.
అందం అసూయ పడాల్సిన శిల్ప సౌందర్య రాశి రామప్ప.
భారతీయ శిల్ప శాస్త్ర వైభవానికి కట్టిన గుడి గోపురం రామప్ప.
ఆగమ శాస్త్ర వికాసానికి ఎత్తిన పతాక రామప్ప.
రాళ్లు నోళ్లు విప్పి తమ చరిత్రను తామే చెప్పుకునే పులకింత రామప్ప.
కాకతీయ చక్రవర్తుల రథ చక్రం ధరాతలమంతా ధగధగలతో వెలిగిన రోజుల్లో గణపతి దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడి లోచనాంతరాల్లో లేచి పూచిన కొమ్మ రామప్ప.

చరిత సిగలో ముడుచుకున్న ముచ్చటయిన పువ్వు రామప్ప.
నాలుగు దశాబ్దాలపాటు అంగుళమంగుళం ప్రాణం పోసి చెక్కిన శిల్పం రామప్ప.
మరో నాలుగు సహస్రాబ్దాలయినా నిలిచి వెలిగే కాకతి కళా తృష్ణ రామప్ప.
ఎనిమిది శతాబ్దాలుగా తెలంగాణ అఖండ సాంస్కృతిక వారసత్వ వైభవోజ్వల దీప్తిగా వెలుగుతున్న కీర్తి రామప్ప.
మాటలు మోయలేని మహా చారిత్రక కావ్యం రామప్ప.


Ramappa- A symphony in stone– రాతిలో పలికిన రాగాలు అని అంతటి పి వి నరసింహా రావు అరవై ఏళ్ల క్రితమే ఇంగ్లీషులో అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం రాసిన తరువాత, దాదాపు అదే సమయంలో రామప్ప పేరిట విశ్వంభరుడు సి నారాయణ రెడ్డి రూపకం రాసిన తరువాత, ఎనిమిది వందల ఏళ్లుగా కవులు, రచయితలు, పరిశోధకులు, పాత్రికేయులు వేనవేల కావ్యాలు, వ్యాసాలు రాసిన తరువాత ఇప్పుడు కొత్తగా రాయడానికి నిజానికి ఏమీ ఉండకూడదు.

కానీ- ఎంత రాసినా, ఎందరు రాసినా- ఇంకా ఎంతో రాయాల్సింది మిగిలిపోయే చరిత్ర రామప్పది. ప్రపంచ వారసత్వ కట్టడంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రామప్ప- లేపాక్షి రెండు ఆలయాలకు మాత్రమే గుర్తింపు దక్కింది. (అధికారికంగా ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా కొన్ని పనులు జరగాలి. కొన్ని ప్రక్రియలు దాటాలి- అది వేరే విషయం) మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తగిన ప్రాధాన్యంతో ఈ వార్తలు వచ్చాయి. ఆలయాలు ఎప్పుడు, ఎవరు, ఎలా కట్టారో? అందులో అద్భుతాలు, ఆశ్చర్యాలు, అందాలు ఏమిటో వివరిస్తూ సమగ్రంగా విశ్లేషణలు కూడా వచ్చాయి.

ఇప్పటికే ఇంత మంది రామాయణాలు రాశారు. మళ్లీ నేనెందుకు రామాయణమే రాస్తున్నాను? అని విశ్వనాథ తనకు తానే ప్రశ్న వేసుకుని తనే మహా గొప్పగా సమాధానం కూడా చెప్పుకున్నాడు. “నాదయిన భక్తి రచనలు నావిగాన…” అన్నాడు. అలా రామప్ప మీద ఎందరు రాసినా ఎవరి దృష్టి కోణం వారిది. ఎవరి రసాస్వాదన వారిది. ఎవరి ఆనందం వారిది. ఎవరి పరవశం వారిది. కాబట్టి రామప్ప ఆలయాన్ని ఎవరి కంటితో వారే చూడాలి. చూసి, ఎవరి మనసుతో వారే పొంగిపోవాలి.

ఇప్పటికే రామప్ప గుడిని చూసి ఉంటే… మరోసారి నెమరు వేసుకోండి. చూడకపోతే మాత్రం వీలు చూసుకుని, చూసి రండి.

(రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కినప్పటి కథనమిది. 700 ఏళ్ల తరువాత వరంగల్ వేయి స్తంబాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం చేయడానికి…కల్యాణ మండపాన్ని పునర్నిర్మిస్తున్నారు. దాదాపు అప్పటి శిల్ప, నిర్మాణ శైలితోనే జరుగుతున్న పనులు పూర్తి కావస్తున్నాయి. వచ్చే శివరాత్రి నుండి ఇక ఏటా ఇక్కడ శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడికి దగ్గరిలో ఉన్న ప్రఖ్యాత రామప్ప ఆలయం జ్ఞాపకాల నెమరువేత)
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions