Sampathkumar Reddy Matta…. రామా.. నిన్నే నమ్మినామురా… !
~~~~~~~~~~~~~~~~~~~~~~
అర్థనారీశ్వర తత్త్వస్వరూపుడయిన శివునిపట్ల
హిజ్రాలకు అవ్యాజమైన అనురాగం ఉండుడు సరే,
మరి ఏకనారీ వ్రతుడయిన రామునితో వీరికేమి సోపతి,
నవమినాటి రామునిపెండ్లికి అంతటి ప్రాధాన్యత ఎందుకిస్తరు ?
ఈ విషయం గురించి హిజ్రాల దగ్గర ఎన్నెన్నో ఐతిహ్యాలు..
కైకేయి కోరికమేరకు రాముడు వనవాసానికి పోతున్నందుకని
తల్లడిల్లిన అయోధ్యవాసులంతా అతని వెనుకే పయమయిండ్రు.
రాజ్యం పొలిమేరలదాకా వెంబడించిన అభిమానులను వారించి,
ఇట్లా రావటం తగదని, పద్నాలుగేండ్ల తర్వాత నేనే అయోధ్యవచ్చి
పరిపాలన చేపడుతానని, నా మాటవిని స్త్రీలూ పురుషులందరూ
వెనుకకు వెళ్లిపోవాలని చెప్పి, వారినందరినీ ఊరికి మరలించిండు.
అరణ్య అఙ్ఞాతవాసాలు ముగించి, రాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నపుడు రాజ్యం పొలిమేరలలోనే కొంతమందిని చూసిండు.
మీరంతా ఎవరు, ఇక్కడ ఎందుకున్నరు అని రాముడు అడుగుతే
అయ్యా మీరు ఆనాడు స్త్రీపురుషులందరినీ అయోధ్యకు పొమ్మని
మాకు మాత్రం ఏమాటా సెలవీయలేదు. కనుక స్త్రీలం పురుషులం
అదీయిదీ ఏదీకాని మేమంతా మీ ఆజ్ఞకోసం ఇక్కడనే ఉన్నామని
వారంతా రామునికి జవాబు చెప్పిండ్రట. వారి మాటలకు రాముడు
చలించిపోయి వారికి నమస్కరించి, మీ సత్యసంధతకు ఎల్లలులేవు
మీ నోట వెలువడే మాట సత్యవాక్కుగా నిలిచివుండును గాక అని
దీవించి, మీకు ఏమి కావాలెనో కోరుకొమ్మని అడిగిండట. అందుకు
వారంతా ముక్తకంఠంతో మా స్త్రీత్వాన్ని గుర్తించి పెండ్లి చేసుకొమ్మని
కోరారట. దానికి రాముడునవ్వి అది ఈజన్మలో సాధ్యం కాదు, కానీ
కృష్ణావతారంలో మీ కోరిక తప్పకుంట నెరవేరుస్తానన్నాడట. వారే
ద్వాపరయుగాన గోపికలుగా జన్మించి, కృష్ణున్ని సేవించుకున్నారట.
అందుకే, రాముడంటే వీరందరికీ ఎనలేని భక్తి. అతని పెండ్లి వేళనే
తామూ వివాహం చేసుకున్నుడన్నది ఓ ఆనవాయితీగ స్థిరపడింది.
దాన్ని వేములవాడలో మనం ఈనాటికీ ప్రత్యక్షంగా చూస్తున్నాము.
~•~•~•~•~•~•~•~
1998ల నేను పీజీ సెకండియర్ల ఉన్నపుడు అమ్మ ఆరోగ్యం కోసం
ఏదైనా ఆసరా దొరుకుతదేమో అనే ఆశతో పుట్టపర్తికి పోయింటిని.
CBSలో రాత్రి పదిగంటలకు పుట్టపర్తి బస్సెక్కిన. బస్సు మొత్తంగ
ఒకే ఒక్క సీటు ఖాళిగవున్నది. ఆ సీట్లవున్న వ్యక్తిపక్కన కూర్చునే
ఆలోచన ఎవరికీ లేదు కనుక, అదొక్కసీటే ఖాళీగ మిగిలిపోయింది.
పైలాపచ్చీసు వయసున ఆతడుకాని ఆమెపక్కన కూర్చునుటానికి
నాకు కూడా ధైర్యం సరిపోలేదు. కానీ విధిలేదు. కూర్చొనక తప్పలే.
నా అవస్థను గమనించి ఆ నడీడు కొజ్జావ్యక్తి నాతోమాట కలిపింది.
తనది కర్ణాటక అని, తాము స్త్రీలుగా మారి, స్త్రీలుగానే గుర్తింపును
పొందుటకు ఇష్టపడే వారమని, మగవారికి తగు గౌరవం ఇస్తామని
తన పక్కన కూర్చున్నందుకు తనతో ఇబ్బందేదీ ఉండదని చెప్పింది.
నాది కరీంనగర్ జిల్లా అని చెప్పంగనే, ఆత్మీయంగ స్పందించింది.
శ్రీరామనవమికి వేములవాడ రాజన్నగుడిలో పెండ్లి సంబురాలకు
పోయివస్తున్నానని, కరీంనగరుకు తను పాతచుట్టాన్నని చెప్పింది.
వేములవాడలో రాములవారిపెండ్లికి మీకూవున్న సంబంధమేమిటి
అని నేనడిగిన ప్రశ్నకు జవాబే, పైన చెప్పుకున్న రామవనవాస కథ.
ఇదే కథ, మొన్నమొన్న వచ్చిన ‘ఒక హిజ్రా ఆత్మకథ’ లోనూ ఉన్నది.
ఇది.. మనకు తెలియని మన చరిత్ర – మనలో కొద్దిమంది చరిత్ర.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
———————————————————–
(ఫోటో :: గుడినే ఇల్లుగా మార్చుకున్నదొకరు – పెండ్లికి వచ్చిపోయేవారొకరు…)
Share this Article