.
ఊటీ, కొడైకెనాల్లో హోమ్ స్టే వ్యథలు
భారత దేశంలో కొండాకోనలకు చెప్పుకోలేని కష్టం వచ్చింది.
“అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండాకోనలకొదిలేశాడా?” అని స్వాతిముత్యంలో సి నా రె మనిషి బాధకు కొండాకోనలను ప్రస్తావించారు.
Ads
పాపం ఇప్పుడా కొండాకోనల బాధలను ప్రస్తావించడానికి ఎందరు సినారె లు పుట్టాలో! ఒకవేళ ఎవరైనా చెప్పినా కొండాకోనల బాధలు వినే గుండెతడి ఉన్న మనుషులు ఉండాలి కదా!
పర్యాటకం, చార్ ధామ్ భక్తి యాత్రల దెబ్బకు ఉత్తరాఖండ్ కొండలు నిలువెల్లా ఎలా వణికిపోతున్నాయో, ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో, భూమి ఎలా నిలువునా చీలిపోతోందో చూశాం. మంచు కరిగి సహజంగా ప్రవహించాల్సిన దారులను పర్యాటక కేంద్రాలుగా మలిచి డబ్బు చేసుకుంటే క్లౌడ్ బరస్ట్ వేళల్లో ఊళ్ళకు ఊళ్ళు బురదలో కొట్టుకుపోయిన దృశ్యాలు చూశాం.
హిమాలయాల్లో, అక్కడి పర్వతసానువుల్లో అలా జరుగుతూ ఉంటుంది. దక్షిణాదిలో మన కొండాకోనల్లో అలాంటి సమస్యలేమీ ఉండవు అని అనుకోవడానికి వీల్లేకుండా ఆమధ్య కేరళ వయనాడ్ కొండల్లో ఊళ్ళు బురదలో కొట్టుకుపోయిన విషాదం కళ్ళముందే ఉంది.
రవాణా సదుపాయాలు పెరగడం, సెలవుల్లో విహార యాత్రలకు వెళ్ళడం పెరిగాక కొండాకోనలన్నీ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. తమిళనాడు ఊటీ, కొడైకెనాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సెలవుల్లో కార్లు ఎక్కువై అయిదారు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడం; బస్సులను ఊళ్లోకి పంపే మార్గం లేక ఎక్కడికక్కడ దింపేసి ఆటోల్లో ఊళ్ళోకి పంపుతున్న సందర్భాలు కోకొల్లలు.
ఉన్న ఈ కష్టాలకు తోడు ఆన్ లైన్ సేవలు మొదలయ్యాక హోమ్ స్టే లు పెరిగాయి (హోమ్ స్టే కు తెలుగులో ఇంతవరకు ఇంటి బస, ఇంటి విడిది లాంటి సరైన మాటను పుట్టించలేకపోయారు!). హోమ్ స్టే ల వల్ల స్థానికులకు ఎంతో కొంత ఆర్థికంగా లాభం కలుగుతున్నమాట నిజమే కానీ… తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ నియమనిబంధనలవల్ల హోమ్ స్టే తలకు మించిన భారమవుతోంది.
పర్యాటక శాఖ ఏమి చేసిందని తెలుసుకోబోతే… తమిళనాడు హై కోర్టు కథ మొదలవుతుంది. హై కోర్టు కథలోకి వెళితే పర్యావరణ ప్రేమికుల కథ మొదలవుతుంది. ఇదంతా “గడ్డిమోపు అడ్డమొస్తే…” కథలా ఉంటుంది కాబట్టి ముందు గడ్డిమోపు కథే తెలుసుకోవాలి.
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు. వేటాడిన చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు.
గడ్డిమోపు అడ్డొచ్చింది అంది. గడ్డిమోపా గడ్డిమోపా!ఎందుకు అడ్డొచ్చావ్? అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.
ఆవా, ఆవా! ఎందుకు మేయలేదు? అని అడిగారు.
గొల్లవాడు నన్ను మేపలేదు అంది.
గొల్లవాడా గొల్లవాడా! ఆవును ఎందుకు మేపలేదు? అని అడిగారు.
అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
అమ్మా అమ్మా! ఎందుకు అన్నం పెట్టలేదు? అని అడిగారు.
పిల్లవాడు ఏడ్చాడు అంది.
పిల్లవాడా పిల్లవాడా! ఎందుకు ఏడ్చావ్? అని అడిగారు.
చీమ కుట్టింది అన్నాడు.
చీమా చీమా! ఎందుకు కుట్టావ్? అన్నారు.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.
తమిళనాడు ప్రభుత్వం స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలి, పర్యాటకులకు తక్కువ ధరకే వసతి, ఆహారం అందించాలి అన్న సదుద్దేశంతో ఉదారంగా హోమ్ స్టే లకు కొన్నేళ్ళ క్రితం అధికారికంగా అనుమతులు ఇచ్చింది.
సొంత ప్రాపర్టీని హోమ్ స్టే కు అద్దెలకు ఇవ్వదలుచుకున్నవారు తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ పోర్టల్ లో నమోదు చేసుకుంటే చాలు. ఊటీ, కొడైకెనాల్లో కొన్ని వేలమంది నమోదు చేసుకున్నారు. కొన్నేళ్ళు అంతా సవ్యంగానే సాగింది. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ మూగుతాయి.
అలా ఇందులో నాలుగు రూపాయలు కనపడేసరికి కమర్షియల్ వెంచర్ గా మారింది. పెద్దవాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి… అయిదారు గదులతో హోమ్ స్టే వ్యాపారంలోకి దిగారు. లాడ్జ్ లు పోయి దాదాపు అన్నీ హోమ్ స్టే లే అయ్యాయి. పేరు మారింది కానీ మళ్ళీ అదే దోపిడీ. ఈ వ్యాపారం పోటీలో స్థానికులు తెరమరుగై డీలాపడ్డారు.
ఈలోపు పర్యావరణ ఉద్యమకారులు కోర్టుకెక్కారు. చిత్రవిచిత్రమైన పేర్లతో ఊటీ, కొడైకెనాల్లో వసతి సదుపాయాలకోసం ఏటా వేల చెట్లను కొట్టేస్తున్నారని, కొండలను తొలిచేస్తున్నారని ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
టూరిజం, రెవెన్యూ, స్థానిక పురపాలక సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి… ఇకపై హోమ్ స్టే లకు ఆ కమిటీ పరిశీలన తరువాతే అనుమతులివ్వాలని, ప్రస్తుతమున్న అనధికారిక హోమ్ స్టే లను అన్నిటినీ మూసేయించాలని ఆదేశించింది. దాంతో ఈ కమిటీ దాడులు చేయడం మొదలుపెడితే వందల సంఖ్యలో అనుమతుల్లేని, అక్రమ భవనాల్లో నడుపుతున్న హోమ్ స్టే ల బాగోతాలు వెలుగుచూస్తున్నాయి.
కొండ నాలుకకు మందు వేయబోతే ఉన్న నాలుక ఊడిపోయి తీరాలి కాబట్టి ఉన్నంతలో హోమ్ స్టే తో నెలకు యాభై వేల నుండి లక్ష దాకా సంపాదించుకునే స్థానికులు రోడ్డున పడ్డారు. పెద్దవి పర్మిషన్లు లేక మూతపడుతున్నాయి. చిన్నవి కొత్త నిబంధనలతో పర్మిషన్లు రాక ఖాళీగా ఉన్నాయి. తాంబూలాలు ఇచ్చాము- తన్నుకు చావండి అన్నట్లు ఒక ఆదేశంతో ఎన్నెన్నో అవస్థలు మొదలయ్యాయి.
బహుశా తమిళంలో కూడా ఏడు చేపల కథ ఉండే ఉంటుంది. ఆ కథను ఈ హోమ్ స్టే వ్యథకు అన్వయించుకుని తమను తాము ఓదార్చుకోవడం తప్ప ఊటీ, కొడైకెనాల్ ప్రస్తుతానికి చేయగలిగింది లేదు!
పురాణాల ప్రకారం- ఒకప్పుడు పర్వతాలకు రెక్కలుండి తెగ ఎగిరేవి. దాంతో లోక నిర్వహణ కష్టంగా ఉండి ఇంద్రుడు పర్వతాలకు రెక్కలు కత్తిరించి పడేశాడు.
అలా యుగయుగాలుగా ఎగరలేక ఎక్కడి కొండలు అక్కడే పడి ఉన్నాయి. ఇన్ని యుగాల తరువాత మనుషుల దెబ్బకు మళ్ళీ రెక్కలు మొలిచి… హాయిగా ఎగిరిపోతే బాగుణ్ణు అని కొండలు స్వగతంలో అనుకుంటున్నాయి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article