రాధాకృష్ణ వార్తలు రాయించబడుతున్నాడా..? తెలియకా… లేక తెలిసీ తెలివిగా రాస్తున్నాడా..? జగన్ క్యాంపు కూడా తెలియనట్టు నటిస్తూ తెలివిగా రాయిస్తున్నదా..? ఏమిటీ మర్మం..? లీడ్ అర్థం కాలేదా..? కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు మననం చేసుకుంటే చాలు… మనకు కూడా తెలిసీతెలియనంతగా అర్థమవుతుంది…
‘అమ్మ రాజీనామా’ వార్త ఆర్కేకు మాత్రమే ఎలా తెలుసు..? ఏం చదవబోతున్నదో, స్క్రిప్టులో ఏం రాసి ఉన్నదో కూడా పూసగుచ్చినట్టు… తన దగ్గర ఆ రాజీనామా కాపీ ఉన్నట్టుగా రాశాడు నిన్న… అదే జరిగింది..? వికలం, విషణ్ణం, విషాదం అనే వీ భాషలో బరువైన పదాలు పొదిగి బ్యానర్ కొట్టాడు… ఆర్కే చెప్పాల్సింది ఏమిటంటే..?
విజయమ్మ ప్రకటన స్వచ్చందమా..? నిర్బంధమా..? స్వచ్ఛందమే అనుకుందాం… షర్మిల పట్ల జగన్ వివక్ష చూసి, కన్నీళ్లతో ఆమె జగన్ క్యాంపు వదిలేయాలని నిర్ణయించుకుందా..? అలాంటప్పుడు ప్లీనరీ దాకా ఆగి, ఆ వేదిక మీద ప్రకటించి మరీ వెళ్లిపోవాలా..? ‘‘తను ఒంటరిపోరు చేస్తోంది, షర్మిల వెంట ఉంటాను, నా అవసరం ఉంది అక్కడ’’ అని ప్రకటిస్తుందా..? తన ప్లీనరీ మీద, తన కుటుంబంలో విభేదాలున్నాయని జనం అనుకోవడానికి ఆస్కారమిచ్చే ఆ చర్యకు జగన్ అనుమతిస్తాడా..? నెవ్వర్… అంటే తన కనుసన్నల్లోనే, తను చెప్పినట్టే ఆమె రాజీనామా చేసింది అనుకుందాం…
Ads
అంటే, నిర్బంధమే అనుకుందాం… దానికైనా ఓ ఫాయిదా ఉండాలి కదా… ఏమిటది..? కావాలని ఆమెను వెళ్లగొట్టాడా..? దాంతో వచ్చేదేముంది జగన్‌కు..? ఆమె కేవలం గౌరవాధ్యక్షురాలు, వైఎస్ లెగసీ గుర్తుచేయడానికి ఆమె ఉనికి పార్టీలో అవసరం… అంతే… అలాంటప్పుడు ఆమె వెళ్లిపోవడానికి కూడా జగన్ అనుమతించడు కదా… అదీ ప్లీనరీ వేదికగా ఓ విషాదపర్వాన్ని ఆవిష్కరించి మరీ వెళ్లిపోవడానికి సమ్మతిస్తాడా..? మరేమిటి మర్మం..?
నిజంగానే షర్మిల వెంట ఉండటానికి ఆమె నిర్ణయించుకుంటే… ప్లీనరీ దాకా ఆగనక్కర్లేదు, ఈ బహిరంగ ప్రకటనలు అక్కర్లేదు… ఈ రచ్చ అవసరం లేదు… సింపుల్‌గా షర్మిల వెంట కనిపిస్తే చాలు… అలా వైఎస్సార్టీపీ నేతలు ఆమెను కలుస్తున్నారు కూడా… అంటే, ఆ కుటుంబంలో నిజంగానే విభేదాలున్నాయి..? అందుకే షర్మిల తెలంగాణ పార్టీ పెట్టుకుంది, చివరకు అమ్మ కూడా ఆమెతోనే ఉండబోతోంది అని రెండు రాష్ట్రాల ప్రజలు నమ్మడానికి ఇదంతా ప్రదర్శితమవుతోందా..?
ఇదంతా సాక్షి రాయలేదు, రాస్తే ఎవరూ నమ్మరు, సొంత పత్రిక, అధికార పత్రిక… అందుకే ప్రత్యర్థి పత్రికలో వస్తేనే ప్రజలు నమ్ముతారు… అందుకేనా ఈరోజుకూ ఆంధ్రజ్యోతి మీద ఈగవాలడం లేదు..? బయటికి మారీచ పత్రిక మన్నూమశానం అంటున్నా సరే, యాడ్స్ ఇవ్వకపోవడం తప్ప ఆర్కేకు వీసమెత్తు నష్టం లేదు, భయం లేదు… జగన్ వ్యవహార ధోరణికి భిన్నంగా ఉంది… పైగా షర్మిల వార్తలు అందులోనే వస్తాయి… పూసగుచ్చినట్టు రాస్తారు… పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తుంది షర్మిల… ఆమెకు తెలియదా ఆర్కే విధేయతలు, తత్వాలు… వైఎస్ కుటుంబం పట్ల ద్వేషం… ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తోంది మరి..?
ఐనా ఆర్కే తెలిసీ ఎందుకు రాయించబడుతున్నట్టు..? వైఎస్ కుటుంబాన్ని ప్రజల్లో పలుచన చేయడానికి ఉపయోగపడుతుంది కదానే భావనా..? జగన్‌ను దుర్మార్గుడిగా, చివరకు కుటుంబబంధాలు కూడా పట్టని రాక్షసుడిగా చిత్రీకరించే చాన్స్ దొరుకుతోందనే ఆనందమా..? తెలుగుదేశం పార్టీ విమర్శలకు మరికొన్ని ఎమోషనల్ పాయింట్స్ దొరుకుతున్నాయనే సంతోషమా..? కానీ జనం నమ్మాలంటే సరిపోదుగా… జగన్ వదిలిన తెలంగాణ బాణమే షర్మిల, వాళ్లిద్దరూ వేర్వేరు కాదు అనే ఫీలింగే జనంలో కనిపిస్తోంది… మరెలా బ్రేక్ చేయడం..?
జగన్ ఒకవేళ జైలుకు వెళ్తే… విజయమ్మ సీఎం కాకూడదు, ఆమెను బయటికి పంపిస్తే తప్ప భార్య భారతీరెడ్డిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టలేడు కదా, అందుకే పొగబెట్టి బయటికి పంపించాడు అని మరో జ్యోతి మార్క్ కథ… మూడేళ్లుగా జగన్‌ను రోజూ జైలుకు పంపిస్తూనే ఉన్నారు ఈ ప్రచారంతో… పోనీ, జైలుకు వెళ్తాడు అనుకుందాం… విజయమ్మే సీఎం కావాలని ఏముంది..? అది జగన్ ఇష్టం… తనకు ఏది సౌలభ్యంగా ఉంటుందో అదే చేస్తాడు… జగన్ లేకపోతే విజయమ్మే సీఎం కావాలని వైఎస్సార్సీపీ రాజ్యాంగంలో రాసుకోలేదు కదా… సో, ఆర్కే మార్క్ న్యూస్‌కు ఏదో క్రెడిబులిటీని అద్దే ప్రయాస… మొత్తానికి జగన్ మార్క్ అత్యంత సంక్లిష్ట, మార్మిక రాజకీయాల్లో ఆర్కే కూడా అన్నీ తెలిసిన ఓ పాత్రధారా..?
ఇవన్నీ సరే, అన్నతో పడటం లేదు కాబట్టి తెలంగాణలో పార్టీలో పెట్టుకున్నాను అనే షర్మిల ప్రకటనే నమ్మదగింది కాదు… కోపం తీర్చుకోవాలంటే ఆంధ్రాలో పార్టీ పెట్టాలి… అంతేతప్ప, పక్క రాష్ట్రంలో పగ తీర్చుకుంటాను అనే వాదన జనానికి ఎలా ఎక్కుతుంది..? జనం నమ్మడం లేదు కాబట్టే ఆమె ప్రయాసకు, ప్రయత్నానికి, కోట్ల ఖర్చుకు ఫలితం కనిపించడం లేదు… ఇంపాక్ట్ లేదు… పోనీ, జగనే వెనుక ఉండి ఆమెను నడిపిస్తున్నాడు అనుకుంటే… ఎందుకు..? ఫాయిదా ఏమిటి..? ఎలా..? అది జగన్‌కా..? జగన్ ప్రచ్ఛన్నమిత్రుడు కేసీయార్‌కా..? ప్చ్, ఇదేమైనా ఆర్కే రాస్తాడేమో అనుకుంటే… ఫస్ట్ పేజీ పలుకుల్లో కనిపించడం లేదు… కొత్త పలుకుల్లోనూ కనిపించడం లేదు… తనకూ సమజవుతున్నట్టు లేదు..!!
Share this Article