Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో రిలేషన్స్, నో ఎమోషన్స్… బ్రేకప్పుల్ని కూడా సెలబ్రేట్ చేసుకునే తరమిది…

February 5, 2024 by M S R

Bharadwaja Rangavajhala…..  ఐదేళ్ల క్రితం రాసానిది …. మారిన సమాజంలో మారని … సెంటిమెంట్లూ .. ఆలోచనలు …

ఆర్ధిక సరళీకరణ తర్వాత సమాజం మారింది. రిలేషన్స్ మారాయి.

సెంటిమెంట్స్ మారాయి.

Ads

మార్కెట్ శాసనం జీవితాల్లో విపరీతమైపోయింది.

మారిన సమాజంలో మనం ఉన్నాం … పాత సమాజపు తాలూకు బంధాలు సెంటిమెంట్లు పట్టుకుని వేళ్లాడుతున్నాం .. ఇది ఇక్కడ సెట్ అవడం లేదని బాధపడుతున్నాం … భయపడుతున్నాం …

వ్యసనాల గురించే మాట్లాడుకుందాం …

మన రోజుల్లో వ్యసనాలు అంటే …

ఆదిమ వ్యసనం వదిలేస్తే ప్రదానంగా కనిపించేవి సిగరెట్టు సినిమా … వాటిని మించినది తాగుడు …

ఇది చాలా అరుదుగా కనిపించేది …

సిగరెట్టు , సినిమా ప్రధానమైనవి …

నేనూ సిగరెట్టు తాగుదామని ట్రై చేశా

శోభన్ బాబు మల్లెపూవు సినిమా విడుదలైనప్పుడు … నాకెందుకో అందులో రక్తి కనిపించలేదు …

సిగరెట్ తాగడం కన్నా కరీం హోటల్లో సాంబారు ఇడ్లీ తినడం బెటరని డిసైడ్ అయ్యా …

ఆ రోజే మొదలు ఆరోజే ఆఖరు …

హైద్రాబాద్ వచ్చిన తర్వాతనే మందు పార్టీలకు పిల్చే మిత్రులు పెరగడం తో …

ఎప్పుడేనా పుచ్చుకుంటూంటాంగానీ …

రోజువారీ అదుంటే తప్ప కథ నవడదనేంత అడిక్టునూ కాను …

సినిమా అనేది నాకున్న ప్రదాన వ్యసనం …

ఇప్పటికీ నన్ను వదలడం లేదది …

ఏ ఊరెళ్లినా అక్కడ ఏదో ఒక సినిమా చూడకుండా వెనక్కు రాలేని బలహీనత …

అయితే ఈ జనరేషన్ లో తాగుడు చాలా కామన్ అయిపోయింది.

సిగరెట్ అనేది అంతకన్నా కామన్ … అయిపోయింది…

ఆడపిల్లలు సిగరెట్లు తాగడం … మందు కొట్టడం కూడా కామనే …

దీన్ని నేనెలా అర్ధం చేసుకుంటానంటే …

మార్కెట్ కు సిగరెట్ల అమ్మకాలు పెరగడం అవసరం …

మందు అమ్ముకోవడం అవసరం … అందుకు కొత్త కొత్త ఏరియాల్లో కష్టమర్లు ఓపెన్ కావాలి ..

అలా అనుకున్న ఓ సిగ్మంటు ఆడపిల్లలు.

అలాగే ఇంటర్ మళ్లీ మాట్లాడితే టెంత్ లోనే … బీరుతో మద్యాభ్యాసం చేయించడం అనేది కూడా మార్కెట్ శక్తుల ప్రమేయంతో జరిగేదే …

ప్రేమలు బ్రేకప్పులు .. కూడా క్వైట్ కామనైపోయాయి.

వాటిని మనంత సెంటిమెంటల్ గా ఆలోచించడం లేదు …

ఆ మధ్య నా దగ్గరకు ఓ సమస్య వచ్చింది ..

నా ఫ్రెండ్ ఒకడు వాళ్లబ్బాయికి పెళ్లి నిశ్చయించాడు. ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.

అప్పడు ఓ రోజు పొద్దున్నే అతను పన్జేసే ఆఫీసు నుంచీ ఓ అమ్మాయి మా ఫ్రెండుకు ఫోన్ చేసి …

“అంకుల్ నేనూ మీ అబ్బాయీ ప్రేమించుకున్నాం .. మీ వాడు నిన్న తన మ్యారేజ్ అనే మాట చెప్పాడు ఆఫీసులో .. నేను దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాను “

అని ఫోన్ పెట్టేసింది…

వాడు ఖంగారు పడిపోయి నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడమని నంబరు ఇచ్చాడు.

ఆ కుర్రాడిది గుంటూరు.

అతను పన్జేసేది హైద్రాబాదు హైటెక్ సిటీలో .. ఏదో దిక్కుమాలిన సాఫ్ట్ వేరు ఆఫీసులో ..

సరే అని నేనా అమ్మాయికి ఫోన్ చేశాను …

ఆ అమ్మాయి ఓ శనివారం ఉదయం మా కార్యాలయానికి వస్తానంది..

ఓకే అన్నాన్నేను.

అప్పుడు నేను భారత్ టుడే లో పన్జేస్తున్నాను..

ఆ అమ్మాయి వచ్చింది…

పైన స్టూడియో పక్కన ఓ ఖాళీ స్థలం ఉంటుంది.

అక్కడకి ఆవిడ్ని తీసుకెళ్లి … చెప్పమ్మా ఏమిటి సంగతి అన్నా ..

“వాడు అలా చేయడం దుర్మార్గం “ అందామ్మాయి …

వాడ్ని అడిగితేనేమో తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం తప్ప ప్రేమ కాదన్నాడు.

ఇలా రెండు రోజులు ఇద్దరితోనూ చర్చించిన తర్వాత … ప్రేమించి ప్రేమించడం లేదని చెప్తున్న వాడితో కాపురం ఏం చేస్తావమ్మా వాడుత్త వెధవలా ఉన్నాడు … నా ప్రెండు కొడుకే అయినప్పటికీ … అన్నానో రోజు షడన్ గా …

అప్పుడు తనేమందంటే ..

“ఓకే అంకుల్ … నాకు అభ్యంతరం ఏం లేదు … వాడు చెప్పే ఫ్రెండ్షిప్ డేస్ లో .. వాడు నా దగ్గర తీసుకున్న అప్పులు … అలాగే వాడికి నేనిచ్చిన గిఫ్టుల వాల్యూ అన్నీ రాసుకొచ్చాన్నేను … విత్ ఇంట్రస్ట్

ఆ అమౌంట్ పే చేయమనండి .. చాలు “ అంది …

నేను కొంత షాకయ్యాను …

ఆ అమ్మాయి సెంటిమెంటలైజ్ అయి … గొడవ చేస్తుందేమో అనుకున్నా …

ఇలా సింపుల్ గా తేల్చేసిందేమిటీ పిల్ల అనుకున్నా …

ఆవిడకు ఇవ్వాల్సింది అదంతా కలిపి ఓ రెండు లక్షలయాభై వేల వరకు తేలింది …

ఆ లెక్కను వీడూ యాక్సెప్ట్ చేశాడు …

దీంతో ఆ పిల్లాడి తండ్రిని పిల్చి ఆ అమౌంట్ తీసుకుని ఆ అమ్మాయికి ఇచ్చేసి క్లోజ్ చేశాం …

ఈ సెటిల్మెంటు జరిగిన ఓ నాలుగైదు రోజులకి …

మాధాపూర్ లో ఓ ఫ్రెండ్ రూమ్ లో బ్రేకప్ పార్టీ చేసుకుంటున్నాం రమ్మని నన్ను ఆహ్వానించిందా అమ్మాయి … వెళ్లాను.

ఈ కుర్రాడు లేడా పార్టీలో …

కానీ వాడికి తెల్సు అక్కడ పార్టీ జరుగుతోందని …

ఆడా మగా అందరూ ఉన్నారు ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది …

ఈ పార్టీ మీరు మొన్న ఇప్పించిన డబ్బుల్తోనే జరుగుతోందని చెప్పి ఆ అమ్మాయి నన్ను మరింత ఆశ్చర్యపరచింది.

కుంచెం లిక్కరు , సిగరెట్లు నడుస్తున్నాయి … అయితే ఒక్కందుకు వాళ్లని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

అదేంటంటే …

నేనున్నంత సేపూ నా ఎదురుగా ఎవరూ హాట్ డ్రింకుల వైపు పోలేదు …

నన్ను ఎనిమిదిన్నరకు చాలా కూల్ గా వెళ్లిపోండంకుల్ ఇంక ఈ కుర్రాళ్లు మన మాట వినరు కాస్త డ్రింక్ తీసుకుంటారు … మీకు ఇబ్బంది అన్జెప్పి తనే ఒబర్ బుక్ చేసి మరీ పంపేసింది.

తన స్వగ్రామం ఖమ్మం దగ్గర్లో ఏదో పల్లెటూరు.

ఆ అమ్మాయి బ్రదర్ ఖమ్మంలో ప్రభుత్వోద్యోగి.

అతనితో కూడా నేను ఆ బ్రేకప్పు రోజుల్లో మాట్లాడా …

అతనూ ఆ అమ్మాయి బిహేవియర్ పట్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతూ మాట్లాడాడు …

నేను మా వాడిదే పెద్ద తప్పుందన్నాగానీ అతను అంగీకరించలేదు.

ఈ అమ్మాయిదీ తప్పుందని వాపోయాడు.

ఎలా ఈ పిల్లలు ఇలా ఆలోచిస్తున్నారు అని కాసేపు నా ముందే బాధపడ్డాడు.

నేను బాధపడాల్సిందేం లేదు నాన్నా ఇది సమాజం మారుతున్న దశలో మనకి అర్ధం కాని విషయాలు …

అంతే నాల్రోజులు పోతే నీకే అర్దమౌతుందని ఓదార్చి వచ్చేశాను …

అతనూ పెద్ద వయస్సేం కాదు …

ఓ ముప్పై లోపు ఉంటుంది.

సంప్రదాయంగా ఖమ్మంలోనే డిగ్రీ చేసి అక్కడే ఎక్కడో బిఎడ్ చేసి అలా జీవితంలో సెటిలయ్యాడన్నమాట …

ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి నాతో ఎప్పుడైనా ఫోన్జేసి మాట్లాడుతూంటుంది …

బ్రేకప్ జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం అనే అంశం మీద ఓ సారి తనను అడిగాన్నేను.

అప్పుడు తను చెప్పింది …

“ఈ బ్రేకప్ప్ పార్టీ వల్ల నేను వాడి ప్రేమలో లేననే విషయం అందరికీ క్లారిటీ వస్తుంది.

దీని వల్ల కొత్తగా నాతో ప్రేమలోకి రావాలనుకునే వాళ్లకి ఒక ఇండికేషన్ ఇచ్చినోళ్లం అవుతాం …

పాత ప్రేమను వదిలించుకుని సెలబ్రేట్ చేసుకోవడంలా మాత్రమే చూడద్దంకుల్ కొత్త ప్రేమలోకి అడుగు పెడుతున్న సందర్భంలో చేసుకుంటున్న సెలబ్రేషన్ గా ఎందుకు చూడరు దీన్ని మీరు “

అని క్లాసు చెప్పిందో రోజు.

అలా సొసైటీ మనం అనుకున్నట్టు లేదు …

సెంటిమెంట్లు మారిపోయాయి …

దీనికి ఎవరినీ తప్పట్టలేం … కూడదు కూడానూ …

బ్రాడ్ గా చెప్తే రొటీన్ ఆన్సర్ లా అనిపిస్తుంది గానీ …

మారిన సమాజంలో మారని మనం ఉన్నాం .

… అంతే …

జనతా గ్యారేజ్ సినిమా విడుదలైన రోజుల్లో జరిగిందీ కథ … ఎందుకు నాకు గుర్తంటే…

ఓ రోజు నేను బెజవాడ నవరంగ్ లో ఆ సినిమా చూస్తుండగా ఈ అమ్మాయి వరసగా ఫోన్ చేసి మరీ ఆ బ్రేకప్పు పార్టీకి ఆహ్వానించిందన్నమాట …

వీళ్లకి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తే వినో ఆల్ అనేస్తున్నారు … మమ్మల్ని సఫకేట్ చేయకండని వార్నింగ్ ఇస్తున్నారు.

పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు …

ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదు ..

ముఖ్యంగా విలువలు సెంటిమెంట్లూ అని అంటిపెట్టుకున్న మధ్యతరగతి తల్లిదండ్రులైతే నిజంగానే చాలా భయపడుతున్నారు.

మొన్నే మా అబ్బాయి నాతో మాట్లాడుతూ …

ట్వంటీ ఒన్ ఇయర్స్ కి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు …

నేనా .. అప్పుడు విప్లవంలో ఉన్నాగా బిజీగా అన్నాన్నేను…

ఎందుకు ఆ పనికిమాలిన పని … పైసా ఉపయోగం లేకుండా అనేశాడు …

పైగా ఇప్పటికీ ఆ పోలీసుల అబ్జర్ వేషను దరిద్రంగా అని జోడించాడు …

వాడికి చాలా సార్లు చెప్పాన్నేను …

కానీ వాడికి ఎక్కలేదు …

పిల్లల పెంపకం మీద శ్రద్ద పెట్టాలి …

ఇలా పెంచాలి అలా పెంచాలి అంటున్నాంగానీ …

సినిమా అలా లేదు …

బైట ఎక్స్ పోజర్ పెరిగింది … మనకంటే ఎక్కువ ఇన్స్ ఫ్లుయెన్స్ చేసే అంశాలు వాళ్ల జీవితంలోకి మన ప్రమేయం లేకుండానే వస్తున్నాయి…

ఈ క్రమంలోనే …

అభద్రత పెరుగుతోంది …

దాంతో పాటు క్రిమినల్ యాటిట్యూట్ కూడా పెరుగుతోంది … ఈ సమాజంలో పిల్లలు పెద్దలు అందరూ ఆ రొటీన్ లోకి వెళ్లిపోతున్నారు …

ఈ పరిణామ క్రమంలో బాగంగానే మనం రోజూ పేపర్లలో చూసే వార్తలను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

అది ఇద్దరిని వదిలేసి మరొకడితో సంబంధం పెట్టుకుంది .. అనే వెకిలి కామెంట్లు ఇలా మనం మాట్లాడేస్తూ ఉంటాం గానీ …

సినిమా అర్ధం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు…

మారిన సమాజం తనకు కలిపించే సౌలభ్యాలు తన భార్యకూ కల్పిస్తుందనే విషయం ఎందుకు మర్చిపోతున్నారో …

తను మాత్రం ఏం చేసినా నడుస్తుంది …

భార్య అడుగు ముందుకు వేస్తే మాత్రం నాకు తెలియాలి అని హింసించడం క్వైట్ కామన్ అయిపోయింది.

చాలా ఇళ్లల్లో ఈ గొడవలు పీక్స్ లో నడుస్తున్నాయి. విడిపోవడం అనేది పెద్ద విషయంగా చూడ్డం లేదెవరూ …

తెగిపోయిన తాడును పట్టుకు వేళ్లాడుతున్నారు ఆడా మగానూ …

ఆడ వాళ్లు పిల్లలు బాగా నలిగిపోతున్నారీ గోలలో …

బాగా డీఫేమైపోతున్నదీ వాళ్లే ..

ఈ పరిస్తితి మీద కాస్త విస్తృతంగానే మాట్లాడుకోవాల్సిన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోంది …

పాత విలువలను పునరుద్దరించమనేది కాదు నా ఉద్దేశ్యం … కొత్త విలువల్లో ఉన్న దుర్మార్గాన్ని అర్ధం చేయించాల్సిన అవసరం ఉందనేదే బాధ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions