భారత దేశంలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. దేశంలో ఆకలి చావులు అన్నవే లేవు. కనీసం మరో మూడేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు దేశంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగులలో ఎప్పుడూ నిల్వ ఉంటున్నాయి. చాలాసార్లు అలా నిల్వ చేసిన ఆహార ధాన్యాలు పాడైపోవడంతో వేల టన్నుల గోధుమలు, వరి సముద్రంలో పారబోస్తున్న ఉదంతాలు అప్పుడప్పుడూ చూస్తునే ఉన్నాం. దేశంలోని పోర్టుల నుంచి విదేశాలకు రోజూ ఆహార ధాన్యాలు ఎగుమతి అవుతునే ఉన్నాయి. ఇవన్నీ ఒక 30 ఏళ్లుగా మనం చూస్తున్న భారతం. కానీ అంతకుముందు భారత్ పరిస్థితి ఏమిటన్నది నేటి తరానికి తెలియకపోవచ్చు… తిండి గింజల కోసం అల్లాడిన గడ్డు రోజులు… ఆహార ధాన్యాల కోసం విదేశాల గుమ్మంలో నిలిచిన అవమానకర పరిస్థితులను ఈ దేశం చూసిందన్నది చేదు నిజం. అన్నమో …రామచంద్రా ! అన్న దుస్థితి నుంచి ఏకంగా విదేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకోవడం ఏమీ ఆషామాషీగా జరగ లేదు. దాని వెనుక…
ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కసి ఉంది…అప్పటి కేంద్ర ఆహార శాఖ మంత్రి సి.సుబ్రమ్మణ్యం దార్శనికత ఉంది…వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కృషి ఉంది… ఆ ముగ్గురి ఆలోచనల నుంచి ఉద్భవించి విజయవంతమైన ‘హరిత విప్లవం’అనే మహాయజ్ఞం ఉంది.
ఎం.ఎస్.స్వామినాథన్ మనల్ని విడిచివెళ్లిన నేపథ్యంలో ఆనాటి త్రయం దేశానికి చేసిన నిరుపమాన సేవను మరోసారి స్మరించుకుందాం…
Ads
( నా జర్నలిజం కోర్సులో భాగంగా భారత్ – అమెరికా దైపాక్షిక సంబంధాలు అనే అంశంపై ప్రాజెక్ట్ చేశాను. ఆ సందర్భంగా ఎన్నో రిఫరెన్స్ బుక్స్ నుంచి తీసుకున్న సమచారంతో ఈ వ్యాసం…)
*ఇందిరా గాంధీ అమెరికా పర్యటన*
– భారత్‌కు ఆహార ధాన్యాల సరఫరాకు అమెరికా అంగీకారం
లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తరువాత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఇందిరా గాంధీ 1966లో అమెరికాలో పర్యటించారు. ప్రధానమంత్రి హోదాలో ఆమె తొలి విదేశీ పర్యటన కూడా అదే. అప్పటికే దేశాన్ని తీవ్రమైన ఆహార కొరత వేధిస్తోంది. అమెరికా నుంచి ఆహార ధాన్యాల సరఫరా గురించి చర్చించేందుకు ఆమె ఆ దేశానికి వెళ్లారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌తో అమె సమావేశం ఫలప్రదమైంది. భారత్‌కు 3.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు జాన్సన్ సమ్మతించారు. ప్రోటోకాల్ నిబంధనలను పక్కన పెట్టి మరీ భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన విందుకు ఆయన హాజరు కావడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు ఇందిర గాంధీ మరో కీలక విధాన నిర్ణయం దిశగా ఓ ముందడుగు వేశారు. అప్పటివరకు భారత్ అనుసరిస్తున్న సామ్యవాద ఆర్థిక విధానాన్ని కొంత సడలిస్తూ సరళతర ఆర్థిక విధానాలపట్ల ఆమె మొగ్గు చూపారు. అందుకోసం కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి అశోక్ మెహతాను అమెరికా పంపారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించి ఐఎంఎఫ్ భారత్‌కు 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ తరువాత ఏడాది ఆ రుణ సహాయాన్ని 1.5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఆమోదించింది. 1970 నాటికే భారత్ సరళీ కృత ఆర్థిక విధానాల దిశగా యోచిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.
*సోవియట్ పేచీ…*
– వియత్నాం అంశంలో అమెరికాను తప్పుబట్టిన ఇందిర
ఇందిరా గాంధీ అమెరికా పర్యటన అప్పటి ప్రపంచం ప్రచ్ఛన్న యుద్ధ సమీకరణల్లో పెను మార్పులు తీసుకువస్తాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. దాంతో సోవియట్ యూనియన్ ఆందోళన చెందింది. తమకు మిత్ర దేశంగా ఉన్న భారత్ అమెరికాకు సన్నిహితం కావడాన్ని ఆ దేశం వ్యతిరేకించింది. అప్పటికి సోవియట్ యూనియన్ భారత్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. అమెరికా ఆర్థిక విధానాలపట్ల మొగ్గుచూపితే తాము ఆయుధాల సరఫరా విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించింది. దాంతో సోవియట్ యూనియన్‌కు నచ్చజెప్పేందుకు ఇందిరా గాంధీ 1966లోనే ఆ దేశంలో పర్యటించారు. అప్పటికే వియత్నాం సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా అదనంగా 1.84లక్షలమందితో కూడిన సైనిక దళాలను వియత్నానికి పంపింది. సోవియట్ యూనియన్ ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆ దేశంలోనే మీడియాతో మాట్లాడుతూ ఇందిరా గాంధీ వియత్నాం విషయంలో అమెరికా వైఖరిని తప్పుబట్టారు. వియత్నాం లో సామ్రాజ్యవాద దాడులను అరికట్టేందుకు అమెరికా చొరవ చూపాలని వ్యాఖ్యానించారు. 1960ల తరువాత తీవ్రరూపు దాల్చిన వియత్నాం సంక్షోభం విషయంలో అంతకుముందు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి కాస్త తటస్థ వైఖరి ప్రదర్శించారు. అందుకు భిన్నంగా ఇందిరా గాంధీ వియత్నాం అంశంలో అమెరికా వైఖరిని వ్యతిరేకించారు.
*అమెరికా ఆగ్రహం… ఆహార ధన్యాల సరఫరా నిలిపివేత*
వియత్నాం విషయంలో తమ వైఖరిని ఇందిరా గాంధీ తప్పుబట్టడం అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌కు ఆగ్రహం కలిగించింది. భారత్‌కు ఆహార ధాన్యాల సరఫరాను నిలిపివేశారు. మరోవైపు వరుసగా రెండో ఏడాది 1966లో కూడా భారత్ లో రుతుపవనాలు అనుకూలించకపోవడంతో పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దేశంలో ఆహార సంక్షోభం మరింత తీవ్రమైంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆకలిలో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. జాన్సన్ నిర్ణయాన్ని అమెరికా లోని నిపుణులు, మీడియా కూడా తప్పుబట్టాయి. మరో వైపు భారత దౌత్య బృందాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. దాంతో జాన్సన్ ఓ మెలిక పెట్టారు. భారత్ సరళీ కృత ఆర్థిక విధానాల అమలు మొదలు పెట్టిందీ లేనిదీ పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించారు. ఆ బృందం భారత్‌లో పర్యటించి నివేదిక ఇచ్చిన తరువాతే ఆహార ధాన్యాల సరఫరాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కేవలం కాలయాపన కోసమే ఆయన అలా చేస్తున్నారన్నది స్పష్టమైంది.
*జాన్సన్‌కు ఇందిరా ఫోన్*
– రిసీవర్‌పై బిగుసుకున్న ఇందిరా చేతివేళ్లు
దేశంలో ఆహార కొరత సమస్య అంతకంతకూ విషమిస్తోంది. దాంతో ఇందిరా గాంధీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌కు ఫోన్ చేసి భారత్‌కు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని కోరారు. అటువైపు నుంచి జాన్సన్ ఏం మాట్లాడారో తెలియదుగానీ… భారత్‌కు ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఆయన ఎట్టకేలకు అంగీకరించారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ పక్కనే ఉన్న ఆమె ప్రెస్ సలహాదారు శారదా ప్రసాద్ ఆనాటి సంఘటన గురించి తరువాత ఇలా చెప్పారు…
‘జాన్సన్‌తో ఇందిరా గాంధీ స్నేహపూర్వకంగానే మాట్లాడుతూ ఉన్నప్పటికీ …ఆమె చేతి వేళ్లు ఫోన్ రిసీవర్‌పై గట్టిగా బిగుసుకున్నాయి. ఫోన్ సంభాషణ పూర్తయిన వెంటనే ‘మనం ఇంకెప్పుడు ఆహార ధాన్యాల కోసం ఎవర్నీ ప్రాధేయపడాల్సిన అగత్యం రాకూడదు” అని ఆగ్రహంగా అన్నారు. అప్పటి భారత ఆహార శాఖ మంత్రి సి.సుబ్రమణ్యం నాటి పరిస్థితి గురించి చెబుతూ అమెరికా నుంచి ఆహార ధాన్యాల సరఫరా మరో వారం రోజులు ఆలస్యమైయుంటే దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేది. అమెరికా ఇతర దేశాలకు సహాయం చేస్తుంది…కానీ ఉదారంగా చేయదు. అందుకు తగిన ప్రతిఫలం చెల్లించగలిగితేనే ఆ దేశంతో వ్యవహరించాలి’ అని చెప్పడం ఆనాటి పరిస్థితికి నిదర్శనం.
*హరిత విప్లవం… దేశం సస్యశ్యామలం*
ఆహార ధాన్యాల ఉత్పత్తితో భారత్ స్వయం సమృద్ధి
సాధించాలని ఇందిరా గాంధీ నిర్ణయించారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి సి.సుబ్రమణ్యంతో చర్చించారు. ఆయన భారత ఆహార సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపించే సాధకుడిగా ఎం.ఎస్. స్వామినాథన్‌ను ఎంపిక చేశారు. ఇందిరా, సి.సుబ్రమణ్యం, స్వామినాథన్ త్రయం ఆలోచనల నుంచి ఉద్భవించిందే హరిత విప్లవం. అందుకోసం అవసరమైన నిధులు, మౌలిక వసతులను సమకూర్చారు. విస్తారమైన సారవంతమైన నేలలు, కష్టించే రైతులు ఉన్నప్పటికీ దేశంలో సరైన వంగడాలు లేకపోవడంతోనే పంటలు దెబ్బతింటున్నాయని ఎం.ఎస్. స్వామినాథన్ గుర్తించారు. దీనికి పరిష్కారంగా మెరుగైన వంగడాలను సృష్టించారు. నీటి నిర్వహణ విధానాలను సంస్కరించారు. భారతీయుల ప్రధాన ఆహార పంటలైన గోధుమలు, వరి ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించారు. 1967–68లో మొదలైన హరిత విప్లవం పదేళ్లలోనే దేశ వ్యవసాయ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసింది. దేశంలో ఆహార కొరత అనే పదానికే చోటు లేకుండా చేసింది. నేడు విదేశాలకు సైతం ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకోవడం వెనుక ఇందిరా గాంధీ కసి ఉంది… సి.సుబ్రమణ్యం దార్శనికత ఉంది…ఎం.ఎస్.స్వామినాథన్ కృషి ఉంది.
ఆ ముగ్గురు మహానీయులకు వందనం. చరిత్ర తెలుసుకుంటేనే గానీ ఉజ్వల భవిష్యత్తును నిర్మించలేం.. ( మిత్రుడు – వడ్డాది శ్రీనివాస్ వాల్ నుంచి తీసుకోబడింది…)
Share this Article