మోకాలికీ బట్టతలకూ లింక్ పెట్టడం మన రాజకీయ నాయకులకు, పార్టీలకు నీళ్లు తాగినంత ఈజీ… కాదు, వాళ్ల అలవాటే అది… మన మీడియా ఈ ధోరణికి భిన్నమేమీ కాదు, నాలుగు ఆకులు ఎక్కువే… ఎవడో వాషింగ్టన్ పోస్ట్ వాడు ఏదో పిచ్చి రాతలు రాస్తాడు… మనవాళ్లు కళ్లకద్దుకుని ఆ ఎడ్డి కూతల్ని అచ్చేసుకుని, వాషింగ్టన్ పోస్ట్ ఇలా రాసింది తెలుసా అని రాసేస్తాడు… ఆ వాషింగ్టన్ పోస్ట్ కూడా మనలాంటి పత్రికే అనే సోయి ఉండదు…
కొన్నిసార్లు కొన్ని పత్రికల్లో వచ్చే వార్తలను మనం కోట్ చేసుకోవాల్సి ఉంటుంది… ఎలాంటప్పుడూ అంటే ఉదాహరణకు చైనా… అక్కడి ప్రభుత్వ విధానం ఏమిటో, ఆలోచనల సరళి ఏమిటో అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చదివితే తెలుస్తుంది… ఇంకెవడూ మీడియాకెక్కి మాట్లాడడు కాబట్టి సదరు పత్రిక ఇలా రాసింది అని మనం ప్రస్తావించుకోవాలి… మన వార్తను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం…
కానీ ఒక రాజకీయ పత్రిక తన పార్టీ పొలిటికల్ లైన్‌కు తగ్గట్టుగా ఏదో కూస్తే, ఏదో రాస్తే… దాన్నే ప్రామాణికంగా తీసుకుని, ఫలానా పత్రిక ఇలా రాసింది అంటూ ఇంకేవో రాజకీయ పత్రికలు రాయడం నవ్వు తెప్పిస్తుంది… ఉదాహరణకు… జాగో బంగ్లా అని ఓ పత్రిక ఉంది బెంగాల్‌లో… అది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక… సీపీఎం గణశక్తి, టీఆర్ఎస్ నమస్తే తెలంగాణ, వైసీపీ సాక్షి, సీపీఐ విశాలాంధ్ర టైపే…
Ads
అది జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు అగ్నిపథ్‌కూ ముడిపెట్టి ఏదో రాసింది… ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి మోడీయే కారకుడు, బీజేపీదే బాధ్యత, కేంద్ర ప్రభుత్వమే దోషి అన్నట్టుగా ఆమె ఏవేవో మాట్లాడుతూనే ఉంటుంది… విజ్ఞత, హేతుబద్ధత వంటివి వెతకకూడదు… ఇదీ అంతే… విచిత్రం ఏమిటంటే… ఆ పార్టీ పత్రిక రాసింది అంటూ నమస్తే తెలంగాణ వాడు దాన్నే మళ్లీ వార్తగా రాసుకున్నాడు… వాడెవడో రాశాడని రాయడం దేనికి..? నువ్వే రాసుకోవచ్చు కదా… జాగో బంగ్లాకు నమస్తే తెలంగాణకు పెద్ద తేడా ఏముంటందసలు..?
షింజో మోడీకి వ్యక్తిగతంగా మిత్రుడు కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా మోడీ వ్యతిరేక మీడియాకు, పార్టీలకు షింజో ‘నచ్చని కేరక్టర్’ అయిపోయాడు… ఆయన భారతదేశానికి మిత్రుడు అనే బేసిక్ పాయింట్ వదిలేశారు… దొరికింది కదా చాన్స్ అనుకుని షింబో హత్యను కూడా అగ్నిపథ్‌కు లింక్ పెట్టి, ఏదేదో రాసి, మరీ సంకుచితత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి ఇండియన్ విపక్షాలు ప్లస్ వాటి గొంతులైన పత్రికలు… సరే, నమస్తేకు, జాగోబంగ్లాకు తేడా లేదు కాబట్టి జాగోబంగ్లా వార్తను నమస్తే మోసింది… మరి సాక్షికి ఏమైంది..? ఏమైందంటే..? దానికి సొంత బుర్ర అంటూ లేదు, మాయమైంది..! ఇతరత్రా చిన్నాచితకా పత్రికలకూ జాగోబంగ్లా స్టోరీ ప్రామాణికం ఎలా అయ్యిందసలు..? ఎవడో ఇంగ్లిష్ న్యూస్ ఏజెన్సీ వాడు మొదట ఏదో రాస్తాడు, మన మందబుద్ధులు యథాతథంగా క్యారీ చేసేస్తారు…
నిజానికి షింజో హత్యకూ అగ్నిపథ్ స్కీమ్‌కూ లింకేముంది..? హంతకుడు యమగామి సైన్యం నుంచి బయటికి వచ్చాడు, వేరే కంపెనీలో చేరాడు, విధినిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఏప్రిల్‌లోనే చెప్పాడు… చేశాడు… ఏదో మతసంస్థ నేతపై ద్వేషం, ఆ మతసంస్థతో షింజో బాగుంటాడు కాబట్టి షింజోపై కోపం… సొంతంగా తుపాకీ తయారుచేసుకుని, ఎవరినో చంపాలనుకుని, షింజోను చంపాడు… ఇదొక క్రైమ్… అగ్నిపథ్ వంటి స్కీముల వల్ల ఇలాంటి అనర్థాలే జరుగుతాయి అని సూత్రీకరించేశాయి మన విపక్షాలు…
పోనీ, అగ్నిపథ్ స్కీమ్ మంచిది కాదనే అనుకుందాం… అదేదో రాజకీయ విమర్శను సూటిగా, సమగ్రంగా, వివరంగా చేయవచ్చు కదా… ఎక్కడో జరిగిన ఏదో హత్యను కూడా అగ్నిపథ్ ప్రమాదానికి హెచ్చరికగా చిత్రీకరించడం దేనికి..? జపాన్‌లో అగ్నిపథ్ అంత ఘోరమైన ఫలితాలనిస్తుంటే… ఈ ఒక్క యమగామి మాత్రమే చెడిపోయాడా..? మరి మిగతా వేలాది మంది..? జపాన్ మార్క్ అగ్నిపథ్ అంత డేంజర్ అయిఉంటే, ఇప్పటికే అనేకమంది యమగాములు తయారై ఉండాలి కదా… అసలు సమస్య అగ్నిపథ్ కాదు… టీఆర్ఎస్, టీఎంసీ వంటి పార్టీల ఆలోచన ధోరణులు..!!
Share this Article